పంజాబ్‌లో తొలి మహిళా చౌకీదార్‌

19 Sep, 2020 07:01 IST|Sakshi
కులదీప్‌ కౌర్‌ : పంజాబ్‌లో తొలి మహిళా చౌకీదార్‌

టార్చ్‌లైట్‌ వేస్తుంది కౌర్‌. పాత ముఖం అయితే.. ‘ఇంత లేటేమిటి?’ అంటుంది. కొత్త ముఖం అయితే.. ‘ఎవరింటికీ..’ అంటుంది. వదిలిపెట్టనైతే వదలదు.  ఆపాల్సిందే అడగాల్సిందే! కనురెప్పలా.. ఊరికి ఆమె కాపలా.

దేవుడు ఆమె కోసమే చీకటిని ప్రసాదించినట్లున్నాడు! ఆ చీకటితో తన జీవితానికి వెలుగు దారి వేసుకుంది కులదీప్‌ కౌర్‌. యాభై ఐదేళ్ల కౌర్‌ పంజాబ్‌లోని తొలి మహిళా చౌకీదార్‌. పన్నెండేళ్లుగా జలంధర్‌ జిల్లా నకోదర్‌ పరిధిలోని బంగీవాల్‌ గ్రామానికి ఆమె కాపలా కాస్తోంది. మొదట్లో ఉన్న 800 జీతం ఇప్పుడు 1250 రూపాయలు కావడం ఎనిమిది మంది పిల్లలు గల ఈ తల్లి సంతోషించే సంగతే. అయితే పన్నెండేళ్లుగా ఆ ‘ఉద్యోగం’ తన చెయ్యి జారిపోకుండా ఉన్నందుకే ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తోంది కౌర్‌. ఒకందుకు ఆమె ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. అర్ధరాత్రులు పహారా కాస్తున్నప్పుడు  తాగుబోతులు, దొంగలు ఎవరైనా తనపై దాడి చేస్తారేమోనని కాదు ఆమె భయం. ‘ఇది మగవాళ్ల పని’ అని ప్రభుత్వం తన చేతిలోని టార్చిలైట్‌ను, పొడవాటి లాఠీ లాంటి ఆ కర్రను ఏ క్షణమైనా లాగేసుకుంటుందేమోనని!

పంజాబ్‌ రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల గ్రామాలకు 13,500 మంది ప్రభుత్వ చౌకీదార్లు ఉన్నారు. వారిలో ఇద్దరంటే ఇద్దరే మహిళలు. తొలి మహిళ కులదీప్‌ కౌర్‌. రెండో మహిళ రజియా బేగం. బంగీవాల్‌కు పదిహేను కి.మీ. దూరంలోని బిర్‌ గ్రామనికి చౌకీదార్‌ రజియా. కౌర్‌ తర్వాత ఏడాదికి ప్రభుత్వం రజియాను నియమించింది. అలా పంజాబ్‌లో తొలి మహిళా చౌకీదార్‌ అయింది కౌర్‌. గ్రామం కాబట్టి రాత్రి తొమ్మిదిన్నరకే ఆమె డ్యూటీ మొదలవుతుంది. సల్వార్‌ కమీజ్‌ వేసుకుని, టార్చిలైట్, కర్ర పట్టుకుని ఊళ్లోని సందులు, గొందులన్నీ ఒక చుట్టు వేస్తుంది. ఆ తర్వాత ఊరి మధ్యలోని మర్రిచెట్టు అరుగు మీద ఇరవైనిముషాలు విశ్రాంతిగా కూర్చుంటుంది. పగటిపూట మగవాళ్లు పేకాట ఆడే ప్రదేశం అది. తర్వాత మళ్లీ డ్యూటీ. మధ్య మధ్య విరామాలతో ఉదయం నాలుగు గంటల వరకు డ్యూటీ చేస్తుంది. ఊళ్లో అంతా ఆమెకు తెలిసినవాళ్లే. ఆర్ధరాత్రి దాటాక కొత్త ముఖం కనిపిస్తే ముఖం మీదే లైఫ్‌ ఫోకస్‌ చేస్తుంది. ఆమెకేం భయం ఉండదు. ‘ఎవర్నువ్వు! ఎక్కడికెళుతున్నావు?’ అని వాళ్ల వాలకాన్ని బట్టి ఏక వచనంలో గద్దిస్తుంది. బంగీవాల్‌ గ్రామంలో 500 గడపలు ఉంటాయి. 1500 మంది జనాభా ఉంటారు. డ్యూటీ చేస్తున్నంతసేపూ ‘జాగ్తే రహో’ అని అంటూ ఉంటుంది కౌర్‌. ఆ అరుపు బలం తగ్గలేదు కానీ, ఆమె కంటిచూపు సన్నగిల్లింది. ఇప్పుడామె రెండు మూడు గంటలు మాత్రమే పని చేయగలుగుతోంది. మిగతా సమయాన్ని ఆమె పెద్ద కొడుకు పూరిస్తుంటాడు. 
∙∙ 
మొదట్లో కులదీప్‌ కౌర్‌ భర్త అవతార్‌ సింగ్‌ ఆ ఊరికి చౌకీదార్‌. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆ పని ఆమెకు సంక్రమించింది. పనికి మగవాళ్లు పోటీ పడ్డారు కానీ, సర్పంచ్‌ పడనివ్వలేదు. న్యాయంగా ఆమెకే దక్కుతుంది అన్నాడు. ప్రారంభంలో కౌర్‌ పిల్లలంతా ‘‘అమ్మా.. నువ్వు వెళ్లొద్దు’’ అన్నారు. చీకట్లో అమ్మను ఎవరైనా ఏమైనా చేస్తారని భయం. ఊరికి కాపలాగా ఆమె అటు వెళ్లగానే, అమ్మకు కాపలాగా ఇటు వీళ్లు వెనకే వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఆమెను పిల్లలే కాదు, ఊరు కూడా ‘సూపర్‌ఉమన్‌’ అంటోంది. కౌర్‌ చిన్నప్పుడు బడికిపోలేదు. అందుకే ఎంత కష్టమైనా పిల్లలందర్నీ చదివిస్తోంది. ప్రతి వేకువజామునా డ్యూటీ ముగిశాక కౌర్‌ చేసే మొదటి పని దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడం. ప్రశాంతమైన మరొక రాత్రిని ఊరికి ప్రసాదించమని కోరుకోవడం. ఈ కరోనా సమయంలో ‘జాగ్తే రహో’ అనే మాటతోపాటు.. ‘ఘర్‌ వీచ్‌ రహో’ అని కూడా అంటోంది. ఇంట్లోనే ఉండండి అని అర్థం. ఏ మహిళా చేయని సాహసం తను చేస్తున్నానని కూడా అనుకోదు కౌర్‌. తననా పనిని చేయనిస్తున్న గ్రామస్థుల నమ్మకానికి తలవంచి నమస్కరిస్తుంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా