అమెరికన్‌ వాల్స్‌పై రీతూ పెయింటింగ్స్‌!

11 Jun, 2021 13:14 IST|Sakshi

డ్రాయింగ్‌ క్లాస్‌లో విద్యార్థులందరితోపాటు రీతుకుమార్‌ ఎంతో ఉత్సాహంగా పెయింటింగ్స్‌ వేసేది. వయసుతోపాటు తన పెయింటింగ్‌ నైపుణ్యం కూడా పెరిగింది. కానీ పెయింటింగ్స్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని రీతూ పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో పెయింటింగ్స్‌కు జీవం పోసి వాటితో చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించింది. దీంతో ఎంతో కొంత ఆదాయంతోపాటు అమెరికాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి వ్యాపారంలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతూ. 

బీహార్‌ రాష్ట్రం పట్నాలో పుట్టి పెరిగిన రీతూకి పెయింటింగ్స్‌ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏకాస్త సమయం దొరికినా వెంటనే కలర్‌ పెన్సిల్స్‌ పట్టుకుని తనకు నచ్చిన పెయింటింగ్స్‌ వేసేది. ఆరోతరగతిలో రీతూ పెయింటిగ్స్‌ని గమనించిన డ్రాయింగ్‌ టీచర్‌ తనని పెయింటింగ్‌ పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించేవారు. అలా టీచర్‌ ఇచ్చిన సహకారంతో తన స్కూలు తరపున డ్రాయింగ్‌ కాంపిటీషన్లలో పాల్గొని మంచి గుర్తింపుతోపాటు బహుమతులు గెలుచుకునేది. రీతూని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె మరింత శ్రద్ధగా పెయింటింగ్స్‌ వేస్తూ జాతీయ స్థాయి కాంపిటీషన్‌లో పాల్గొని చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవార్డును గెలుచుకుంది. 

భర్త ప్రోత్సాహంతో...
పెయింటింగ్స్‌తోపాటు పర్యావరణం పట్ల కూడా ప్రేమ ఉన్న రీతూ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసింది. పెళ్లయిన తర్వాత భర్తతో అమెరికాలో స్థిరపడింది. ఈ క్రమంలో రీతూ తనకు వచ్చిన పెయింటింగ్‌ కళను పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే రీతూకి పెయింటింగ్స్‌ బాగా వచ్చని తెలుసుకున్న భర్త, ఆమెతో ‘‘మళ్లీ నువ్వు పెయింటింగ్స్‌ వేయవచ్చు కదా! అంటూ ప్రోత్సహించడంతో ఆమె తిరిగి పెయింటింగ్స్‌ వేయడం మొదలు పెట్టింది. అలా వేసిన పెయింటింగ్స్‌ను తెలిసిన వారికి, స్నేహితులకు ఇవ్వడంతో వాళ్లంతా ‘‘ఇంత బాగా పెయింటింగ్స్‌ వేస్తున్నావు...వీటిని మార్కెట్లో విక్రయిస్తే గుర్తింపుతోపాటు మంచి ఆదాయం కూడా వస్తుంది కదా’’ అనడంతో ఆలోచనలో పడింది రీతూ.

భర్తతో చర్చించి ‘రీతూ హ్యాండ్‌మేడ్‌ ఆర్ట్స్‌’ స్టూడియోను డల్లాస్‌లో ఏర్పాటు చేసింది. హ్యాండ్‌మేడ్‌ ఆర్ట్స్‌ కస్టమర్లను ఆకట్టుకోవడంతో..ఆమె పెయింటింగ్స్‌ విపరీతంగా అమ్ముడయ్యేవి. దీంతో అమెరికాలో వందలాది ఇళ్లు, రెస్టారెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ గోడలపై తప్పనిసరిగా రీతూ పెయింటింగ్స్‌ ఒక్కటైనా  ఉండాల్సిందే... అన్నట్టుగా విక్రయాలు జరిగేవి. 

కాన్వాస్‌ మీద యక్రాలిక్, ఆయిల్‌ టెక్నిక్స్‌తో ఫ్లూయిడ్‌ ఆర్ట్‌లు రీతూ పెయింటింగ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పౌరాణిక పాత్రలు పెయింటింగ్స్‌లో ప్రముఖంగా కనిపిస్తాయి. అంతేగాక రీతూ పర్యటించిన ప్రాంతాల్లో తనకు నచ్చిన అంశాలను ఆమె ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఇవేకాకుండా కాస్ట్యూమ్‌ పెయింటింగ్స్‌ను కూడా వేస్తుండడం విశేషం.  

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం..
‘‘నా ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపి, మా వారు ఆఫీసుకు వెళ్లాక దొరికిన ఖాళీ సమయంలో పెయింటింగ్స్‌ వేసేదాన్ని. అవి అందరికీ నచ్చడం తో స్టూడియో పెట్టమని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే రీతూహ్యాండ్‌మేడ్‌ ఆర్ట్స్‌ ప్రారంభించాను. నేను పెయింటింగ్‌లు వేసినప్పటికీ స్టూడియోలో మేనేజర్, షిప్పర్, మార్కెటర్‌గా నా భర్త ముందుండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతోనే నా పెయింటింగ్స్‌కు గుర్తింపు లభించింది. నాకెంతో ఇష్టమైన పెయింటింగ్స్‌ ఈ రోజు చిన్నపాటి వ్యాపారానికి ఉపయోగపడతాయని నేనెప్పుడు ఊహించలేదు. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు పెయింటింగ్‌ల విక్రయానికి ఎంతో తోడ్పడ్డాయి. ప్రస్తుతం నా బిజినెస్‌ ఆదాయంతోపాటు ఆనందాన్ని ఇస్తుంది’’ అని రీతూ వివరించింది. 

చదవండి: Deepsikha: ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా.. అమ్మ ఎలాగ మరి’!
  

మరిన్ని వార్తలు