కుంగ్‌ ఫూ నన్స్‌

12 Dec, 2020 04:07 IST|Sakshi
తాము చేస్తున్న సేవల గురించి వివరిస్తున్న కుంగ్‌ఫూ నన్స్‌

హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. అవసరమైతే రక్షణగా నిలుస్తారు. వీరు కుంగ్‌ ఫూ నన్స్‌. గతంలో కేవలం బౌద్ధ స్త్రీ సేవాదళంగా ఉండేవారు. ఇప్పుడు కుంగ్‌ ఫూ కూడా నేర్చి తమను తాము రక్షించుకోవడమే కాదు ఏ చెడు పైన అయినా పంచ్‌ విసరడానికి సిద్ధంగా ఉంటారు.

కోవిడ్‌–19 మీద ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అందరూ పోరాటం చేస్తున్నారు. అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో దాదాపు 800 మంది బౌద్ధ మహిళా భిక్షువులు కూడా పోరాటం చేస్తున్నారని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ బౌద్ధ మహిళా భిక్షువులను ‘కుంగ్‌ ఫూ నన్స్‌’ అంటారు. ఎందుకంటే వీరికి కుంగ్‌ ఫూ వచ్చు కాబట్టి. కావి రంగు బట్టల్లో, శిరో ముండనం చేసుకుని, గంటల తరబడి చేసిన ధ్యానం వల్ల వచ్చిన ప్రశాంత వదనాలతో ఈ మహిళా భిక్షువులు ‘సాటి మనిషిని ప్రేమించుటకే జీవించు’ అనే బౌద్ధ తత్వాన్ని సాధన చేస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్‌ రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి హిమాలయ పర్వత సానువుల్లో వీరు తిరుగుతూ ఉంటే మంచు మీద పూసిన ఎర్రపూల వలే కనిపిస్తారు దూరం నుంచి.

2015 నుంచి వార్తల్లోకి
బౌద్ధంలోని అనేక శాఖలలో మహిళా భిక్షువులకు ప్రవేశం లేదు. కాని స్త్రీలకు చదువు అబ్బకపోవడం, వారికి సహాయకులు లేకపోవడం, మార్గదర్శకుల లేమి... ఇవన్నీ గమనించిన ‘ద్రుక్పా’ అనే బౌద్ధ శాఖ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రవేశం కల్పించింది. అందుకే వీరిని ద్రుక్పా బౌద్ధులు అంటారు. వీరు ప్రధానంగా శాంతి కొరకు, సేవ కొరకు పని చేయాల్సి వచ్చినా వీరికి వ్యాయామం నిషిద్ధమే అయినా 2015లో వచ్చిన వీరి గురువు వీరికి కుంగ్‌ ఫూ నేర్చుకునే అనుమతిని ఇచ్చాడు. దానికి కారణం పర్వత ప్రాంతాలలో అమాయక ఆడపిల్లలు ట్రాఫికింగ్‌ కు గురి కావడం వల్లే.

‘మీరూ నేర్చుకోండి... ఆడ³ల్లలకూ నేర్పండి’ అని లడాక్‌లో ఉన్న వీరి ప్రధాన కార్యాలయం ఆదేశం ఇవ్వగానే ఈ నన్స్‌ కుంగ్‌ ఫూ నేర్చుకుని భారత్‌–నేపార్‌ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఆడపిల్లలకు కుంగ్‌ ఫూ నేర్పడం మొదలుపెట్టారు. ఇది అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించి మెచ్చుకోళ్లు వచ్చాయి. వీరి మంచి పనికి సహాయం కూడా అందసాగింది. ‘మేము కుంగ్‌ ఫూ నేర్చుకోవడం ఇతర బుద్ధిస్ట్‌ శాఖలకు నచ్చదు. మా పని ప్రార్థించడం, వంట చేయడం, శుభ్రం చేయడం అని భావిస్తారు. కాని మేము సేవతో పాటు రక్షణకు కూడా కట్టుబడ్డాం. జనం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు’ అని అంటారు వీరు. వీరి అందరి పేర్ల చివర ‘జిగ్మే’ అని పెట్టుకుంటారు. జిగ్మే అంటే భయం లేనిది అని అర్థం.

సహాయమే మతం
‘ఇతరులకు సహాయం చేయడమే మా మతం’ అంటారు కుంగ్‌ఫూ నన్స్‌. ప్రస్తుతం భారతదేశంలో అంటే టిబెట్‌ చుట్టుపక్కల 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న 800 మంది కుంగ్‌ ఫూ నన్స్‌ ఉన్నారు. కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు పడే ఇబ్బందులు వీరు గమనించారు. ‘ప్రకృతి మాత కాలుష్యం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలా అనిపించింది ఇది. అయితే ప్రజల కష్టాలను మేము చూడలేకపోయాం. సహాయం కోసం ఎదురు చూడటం కంటే మనమే సహాయంగా మారాలని అనుకున్నాం’ అని ఈ నన్స్‌ అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో లాక్‌డౌన్‌ తర్వాత కూడా వీరు సరిహద్దు గ్రామాల వెంట ఉన్న దాదాపు 2000 కుటుంబాలను వీరు రేషన్‌ అందించారు. దేశ విదేశాల నుంచి అందిన విరాళాలు ఇందుకు సాయపడ్డాయి. పరిశీలకులు గమనించింది ఏమిటంటే హిమాయాల పొడవున ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్‌ ఫూ నన్‌లు మేత ఏర్పాటు చేశారు. లేకుంటే అనాథ పశువులు ఎన్నో ఇప్పటికి చనిపోయి ఉండేవి.

చైతన్యం... సాధనం
కోవిడ్‌ ఎంత ప్రమాదమో కుంగ్‌ ఫూ నన్‌లకు అర్థమైంది. కాని కొండ ప్రాంత ప్రజలకు దాని తీవ్రత అర్థం కాదు. ‘మేము వారికి పదే పదే చైతన్యం కలిగించాల్సి వచ్చింది. వారికి అది కేవలం జలుబు అనే అభిప్రాయం ఉంది. కాని వారికి భౌతిక దూరం గురించి, మాస్కుల గురించి చెప్పాం. వాటిని మేము కుట్టి పంచాం. దాని బారిన పడ్డ వారికి వైద్య సహాయం అందేలా చూశాం’ అంటారు ఈ కుంగ్‌ ఫూ నన్‌లు. కోవిడ్‌ ప్రచారంలో దిగాక వీరికి స్త్రీల ఇతర సమస్యలు కూడా తెలిసి వచ్చాయి. ‘శానిటరీ నాప్‌కిన్స్‌ సమస్య తీవ్రంగా ఉంది. హిమాయాల స్త్రీలకు వీటిని అందుబాటులోకి తేవడానికి పని మొదలుపెడతాం’ అంటున్నారు వారు. స్త్రీల శక్తి అపారం. యుద్ధ విద్యలు నేర్చిన స్త్రీల శక్తి మరింత దృఢం. ఈ దృఢమైన సేవ స్త్రీలకు తప్పక మేలు చేస్తుంది.

సహాయక చర్యలు చేపట్టిన కుంగ్‌ఫూ నన్స్‌


కుంగ్‌ఫూ సాధన

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు