కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి

22 Mar, 2021 19:19 IST|Sakshi
కురవపురం దీవి పరిసరాలు

‘ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడి మధ్య ఏరడ్డు...’ అని కవి హృదయం స్పందించింది బహుశా ఇలాంటి చోటును చూసే కావచ్చు. కృష్ణానదికి ఆ ఒడ్డున ఒక రాష్ట్రం, ఈ ఒడ్డున మరొక రాష్ట్రం. 

కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్నాటక మీదుగా తెలంగాణను పలకరించి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఓ విచిత్రం. కొంతదూరం కర్నాటక– తెలంగాణల మధ్యగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట్‌ జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా), మక్తల్‌కు పది కిలోమీటర్ల దూరాన ఉంది ఈ విచిత్రం. ఇక్కడ కృష్ణానది మధ్యలో ఉన్న దీవి పేరు కురువపురం. విశాలమైన ఇసుక తిన్నెల్లాంటి శిలలతో మంచి వీకెండ్‌ డెస్టినేషన్‌ ఇది. హైదరాబాద్‌కు 190 కి.మీ.ల దూరం. పంచదేవ్‌ పహాడ్‌ తీరాన నేల మీద నుంచి నీటిలోకి అడుగుపెట్టాలి. 

వలయాకారపు తెప్ప...  
కృష్ణానదిలో పెద్ద పెద్ద శిలలుంటాయి. మరబోట్లలో ప్రయాణించడం కష్టం. వలయాకారపు తెప్పలే ఇక్కడ రవాణా సాధనాలు. ఒక్కో తెప్పలో పది నుంచి పదిహేను మంది ప్రయాణించవచ్చు. ఈ తెప్ప తెడ్డు వేద్దామని సరదాగా ప్రయత్నించవచ్చు. కానీ అది ఫొటో వరకే. ఆ తెడ్డును చెయ్యి తిరిగిన సరంగు వేయాల్సిందే. మనం తెడ్డు వేస్తే తెప్ప ఉన్న చోటనే గిరగిర తిరుగుతుంది తప్ప ముందుకు వెళ్లదు. స్థానిక సరంగులకు నీటి లోపల ఎక్కడ శిల ఉన్నదీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ శిలకు కొట్టుకోకుండా తప్పించి నడుపుతారు. నేల మీద నుంచి దీవి అరకిలోమీటరు దూరంలో ఉంది. తెప్ప ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేసే లోపే దీవి వచ్చేస్తుంది. 

దీవిలో దేవుడు... 
కురువపురం దీవిలో దత్తాత్రేయ దేవస్థానం ప్రసిద్ధ క్షేత్రం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తులు విశేషంగా దర్శిస్తుంటారు. పౌర్ణమి గురువారం మరింత విశిష్ఠమైనదిగా చెబుతారు. ఈ దీవిలో ఉన్న మఠంలో రాత్రి బస చేయవచ్చు, ఉచిత భోజనం ఉంటుంది. హోటళ్లు కూడా ఉన్నాయి. విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, తినుబండారాలు దొరకడం కష్టమే. కాబట్టి మక్తల్‌లో కొనుక్కుని వెళ్లడం మంచిది. ఇక్కడికి కర్నాటక వాళ్లు కూడా ఎక్కువగానే వస్తారు. రాయచూర్‌ ఇక్కడికి 30 కి.మీ.లు మాత్రమే.

ఇప్పుడే కురిసిన మేఘమా... 
కృష్ణానదిలో శిలలు పైకి కొనదేలి ఉండవు. బల్లపరుపుగా ఇసుకతిన్నెలాగ ఉంటాయి. ఆ రాళ్ల మీద నిలబడి 360 డిగ్రీల కోణంలో తిరిగి చూస్తే ఎటు చూసినా పరవళ్లు తొక్కుతున్న నది అందంగా ఉంటుంది. నల్లమబ్బు అప్పుడే కరిగి నేల మీద జాలువారి ప్రవాహంగా మారినట్లు ఉంటుంది. ఈ దీవి నుంచి కొద్ది దూరం వెళ్తే నది రెండు పాయలుగా చీలిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. వర్షాలు కురిసేటప్పుడు ప్రవాహం ఉధృతిని బట్టి తెప్పలను ఆపేస్తారు. అలాగే వర్షాలు తక్కువగా పడిన ఏడాది ఎండాకాలంలో తీరం నుంచి దీవికి నడిచి వెళ్లవచ్చు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాబట్టి ఈ ఎండాకాలం కూడా హాయిగా తెప్పలో విహరిస్తూ దీవి పర్యటనకు వెళ్లవచ్చు. వీకెండ్‌ హాలిడేకి ఇది మంచి ప్రదేశం.

మరిన్ని వార్తలు