మల్కాన్‌గిరి మలాలా

26 Nov, 2020 08:25 IST|Sakshi

విద్య, ఆరోగ్యం, అభివృద్ధి కోసం చొరవ చూపుతూ ‘మల్కాన్‌గిరి మలాలా’ అని ప్రశంసలు పొందుతున్న కుసుమానీ.. మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్నారు! అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయడం లేదు. మావోయిస్టులు కూడా ఆమెకు ఏదైనా జరిగితే ప్రజా ఉద్యమం వస్తుందనే సందేహంతో ముందడుగు వేయడం లేదు. ఒడిశాలోని మల్కాన్‌జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ‘స్వాభిమాన్‌ ఆంచల్‌’కు రెండు నెలల క్రితమే తొలిసారి మొబైల్‌ ఫోన్‌లు, కమ్యూనికేషన్‌ల నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. నేటికీ ఆ ప్రాంతంలో పిల్లలు బడికి వెళ్లాలంటే ముళ్ల మీద నడకే. కొత్తగా వచ్చిన సమాచార సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని ఆ ముళ్లను ఇప్పుడు నల్లేరుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు కుసుమానీ ఖిల్లా.

ఈ ప్రాంతంలోని పిల్లలకు, టీచర్‌లకు స్వేచ్ఛగా చదువుకోగలిగే, స్వేచ్ఛగా చదువు చెప్పగలిగే పరిస్థితులు కల్పించాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను గత మంగళవారం అర్థించారు కుసుమాని. ఆ పరిణామంతో ఆమెలోని ధైర్యాన్ని, పట్టుదలను చూసిన ఆ ప్రాంతీయులు ఆమెను ‘మలాలా ఆఫ్‌ స్వాభిమాన్‌ ఆంచల్‌’ అంటూ అభినందిస్తున్నారు. పాకిస్తాన్‌లో బాలికలు, మహిళల విద్య కోసం గళమెత్తిన మలాలా తాలిబన్‌ తుపాకీ తూటాలకు గురై, పునర్జన్మ ఎత్తి, ఆడపిల్లల చదువు కోసం ఒక ఉద్యమకారిణిగా పని చేసింది. అందుకే కుసుమానీ ఖిల్లాను మలాలాతో పోల్చుతున్నారు.

కుసుమానీ కరోనా వారియర్‌ కూడా. ‘‘కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కుసుమానీ ప్రజలలో తీసుకువచ్చిన చైతన్యం కారణంగా అక్కడ ఒక్కరు కూడా కోవిడ్‌ కారణంగా మరణించలేదు’’ అని నవీన్‌ పట్నాయక్‌ కూడా ఆమెను ప్రశంసించారు. అంతేకాదు, కాన్ఫరెన్సింగ్‌లో ఆమెను ఆంచల్‌ ప్రాంత విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. కుసుమానీ పట్టభద్రురాలు. మల్కాన్‌గిరిలోని ‘బలిమెల కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ చదువుకున్నారు. కమ్యూనికేషన్‌ కనెక్టివిటీ వచ్చాక గత రెండు నెలల్లోనూ స్వాభిమాన్‌ ఆంచల్‌లో బిఎస్‌ఎఫ్‌ జవాన్లు, రాష్ట్ర పోలీసుల నిరంతర పర్యవేక్షణలో నాలుగు సెల్‌ టవర్‌ల నిర్మాణం జరిగింది. ఆ సదుపాయం కారణంగానే సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడగలిగారు కుసుమానీ.  

మరిన్ని వార్తలు