లక్కీ బిజినెస్‌

15 Apr, 2021 00:49 IST|Sakshi

ఈ ప్రాంత మహిళల నుంచి ఎంతో నేర్చుకోవాలి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.. నిత్యం చేసుకునే పనులే కాకుండా అదనంగా కొత్త పని చేస్తున్నారు. తమ పని ద్వారా ఏడాదికి పాతిక వేల నుంచి లక్షన్నర వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ఇప్పుడు కాదు... కొన్ని తరాలుగా వారు ఈ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఆనందంగా ఉంటున్నారు. చిన్నిచిన్ని Mీ టకాలే వీరికి ఈ పెద్ద మొత్తాన్ని అందిస్తున్నాయి.

జార్‌ఖండ్‌ సిమ్‌డెగా జిల్లాలో ఉంటున్న ఆమ్రెన్షియా బార్లా కుటుంబం కొన్ని తరాలుగా లక్కతో వ్యాపారం చేస్తున్నారు. లక్క అనేది గుగ్గిలం వంటి రసం... కొన్ని రకాల కీటకాల నుంచి స్రవిస్తుంది. గుడ్లు పెట్టి పొదగడానికి సిద్ధంగా ఉన్న కర్రను రైతులు తీసుకువచ్చి పెద్దపెద్ద చెట్లకు కట్టడంతో లక్క సాగు ప్రారంభమవుతుంది. సౌందర్య సాధనాల నుంచి ఆయుధాల తయారీ వరకు లక్కను పుష్కలంగా ఉపయోగిస్తారు. అనేక రకాల చెట్ల మీద లక్కను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పళ్ల చెట్లు, నీడనిచ్చే బెర్రీ, కుసుమ, పలాస, సాల వృక్షాల మీద వీటి సాగు విస్తృతంగా జరుగుతుంది.  తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వస్తోంది.  

2016 లో ఆమ్రెన్షియా ‘లైవ్‌లీహుడ్‌ ప్రొమోషన్‌ సొసైటీ’ అనే ఒక స్వయం సహాయక సంఘంలో చేరారు. అక్కడ ‘మహిళా కిసాన్‌ స్వశక్తికారణ్‌ పరియోజన’ సంస్థ వారి దగ్గర లక్కను శాస్త్రీయంగా పెంచటంలో శిక్షణ పొందారు. ఇప్పుడు ఆమ్రెన్షియా సంప్రదాయ పద్ధతుల్లో సంపాదించిన దాని కంటె మూడు రెట్లు అధికంగా ఆదాయం పొందుతున్నారు. ఆమ్రెన్షియా వంటివారు సుమారు 73 వేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా సంవత్సరానికి పాతిక వేల నుంచి యాభై వేల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.

‘‘శాస్త్రీయ విధానంలో వ్యవసాయం చేయటం వల్ల ఉత్పత్తి పెరిగింది. గతంలో నాకు ఏడాదికి పదివేల రూపాయలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు సీజన్లో ఏడాదికి అరవై వేల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. రెండుసార్లు లక్క సాగు చేస్తున్నాం’’ అంటున్నారు. లతేహార్‌కు చెందిన ఆశ్రిత గురియా ఏడాదికి ఒకటిన్నర లక్షలు సంపాదిస్తున్నారు. ‘‘మాకు సూచించిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా రెట్టింపు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అలాగే మాకు 5 కేజీల లక్కవిత్తనాలు కూడా అందిస్తున్నారు’’ అంటున్నారు మరో మహిళా రైతు రంజీతాదేవి.

గుగ్గిలం, మైనం, లక్క... వీటిని కీటకాల నుంచి తయారు చేస్తారు. ఉన్ని, పట్టు, వైన్‌ వంటివి అందంగా కనపడటానికి ఈ పదార్థాలే కారణం. ఆయుర్వేద ఔషధాలలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే చెక్క వస్తువులకు పాలిష్‌ పెట్టడానికి కూడా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వీటిని చాలా ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఈ మహిళలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు