హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..

9 Oct, 2021 15:04 IST|Sakshi

దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని హీరామండి గురించిన ఆసక్తికర విషయాలు... ఇది లాహోర్‌లో ఉంది. హీరామండి (డైమండ్‌ మార్కెట్‌) చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి వే‍శ్యా వృత్తి తమ జీవనశైలిగా బతుకుతున్నారు. ఇది ఎందుకిలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి తొంగిచూడాల్సిందే.. మిగతానగరాలు ఆధునీకరించబడినప్పటికీ ఈ నగరం మాత్రం చారిత్రక అవశేషంగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకుందాం..

ఆ మార్కెట్‌ స్థాపకుడు ఇతడే..
సిక్కుల మహారాజైన రంజిత్‌ సింగ్‌ మంత్రి అయిన  హీరా సింగ్‌ పేరు మీదనే దీనికా పేరు వచ్చింది. హీరా సింగ్‌ అక్కడ ఓ ధాన్యం మార్కెట్‌ను స్థాపించాడు. అంతేకాకుండా తరచుగా తవైఫ్‌ (నర్తకి) లను కూడా ఆ మార్కెట్‌ తీసుకొచ్చేవాడు. సిక్కు రాజైన రంజిత్‌ సింగ్‌ ఆ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. దీనికి షాహి మొహల్లా అని కూడా పేరుంది. లాహోర్‌ కోట పక్కనే ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది.

మొగల్‌ రాజుల కాలంలో...
మొగలుల సామ్రాజ్యంలో లాహోర్‌ కూడా ఒక భాగమే. దీని ఇతర నగరాల్లో హీరామండి ఒకటి. వీరికాలంలో ఆఫ్గనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ల నుంచి అందమైన మహిళలను (వేశ్యలు) ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారికి ముజ్రాస్‌ అనే సంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు (ఆ కాలంలో డాన్స్‌, సంగీతం, లలిత కళలు, పెయింటింగ్‌లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి). వీరితో ధనవంతులు కచేరీలు నిర్వహించేవారు. తర్వాత కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వీరు మొగల్‌ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు. తర్వాత కాలంలో ఈ నృత్యం కుటుంబ సంప్రదాయంగా మారింది. 

చివరికి మొగలుల వైభవం మసకబారసాగింది. విదేశీ దండయాత్రల కాలంలో రాజ భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవైఫ్‌ఖానా ధ్వంసమైపోయింది. కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వేశ్యలుగా మారారు. క్రమంగా ఇది వేశ్యా కూపంగా మారింది. ఇప్పుడు అక్కడ నపుంసకులు నృత్యం చేస్తున్నారు. ప్రస్తుతం తవైఫ్‌ అనేపదం వేశ్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది. 

రెండు రకాలైన జీవనశైలి
వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైన జీవనశైలి కలిగిన స్త్రీలు నివసిస్తున్నారు. నిజానికి రాత్రిళ్లు 11 నుంచి1 గంటల మధ్య సమయంలో ఈ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. తమ కష్టమర్లు వెళ్లిపోగానే మామూలు మహిళల్లానే వారిళ్లకు చేరుకుంటారు. ముజ్రా నృత్యం చేసేవారు సాధారణంగా ఈ రొంపిలోకి దిగరు. వీరు తమ వృత్తి పట్ల నిబద్థత, అంకిత భావం, గౌరవం ప్రదర్శిస్తున్నారు. తాము ముజ్రా నృత్యకారినులని గర్వంగా చెప్పుకొంటారు కూడా.

ఇక మరొక రకం కేవలం రూ. 200 నుంచి 400 లకు వేశ్యా వృత్తిని జీవనోపాధిగా బతికేవారు. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే వీరి అజ్ఞానం, నిరక్ష్యరాస్యత అక్కడి పురుషుల విలాసానికి ప్రతీకగా ఎంచబడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది.

ఈ కథనం ఆధారంగా..
పగలంతా ఈ ప్రదేశం మామూలు మార్కెట్‌లా కనిపిస్తుంది. కానీ చీకటైతే మాత్రం రెడ్‌లైట్‌ ఏరియాగా మారిపోతుంది. కళంక్‌ సినిమాలో ఇక్కడి పరిస్థితిని కొంతమట్టుకు చూపారు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ హీరా మండిపై సినిమాను తెరకెక్కించనున్నాడు.

చదవండి: టీచర్‌ దారుణం.. స్నాక్స్‌ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు..

మరిన్ని వార్తలు