Lata Mangeshkar: లతా పాట.. 20 లక్షలు జమయ్యాయి.. వరల్డ్‌కప్‌ విన్నర్స్‌ టీమిండియాలో ఒక్కొక్కరికి లక్ష!

7 Feb, 2022 13:29 IST|Sakshi

క్రికెట్‌ కోసం  లత ‘లక్షగానం’

లతా మంగేష్కర్‌ క్రికెట్‌కు వీరాభిమాని. క్రికెట్‌తో  ఆమె అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటన మాత్రం 1983లో జరిగింది. భారత జట్టు ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. విజేతలను అభినందించి నగదు పురస్కారం అందించాలని బీసీసీఐ భావించింది. కానీ బోర్డు నాటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రపంచ కప్‌ జరిగిన సమయంలో క్రికెటర్లకు రోజూవారీ ఖర్చులకు తలా 20 పౌండ్లు ఇచ్చేందుకే అధికారులు కిందా మీదా పడ్డారు.

అలాంటిది ప్రోత్సాహకం ఏమిస్తారు?  బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ సమయంలో భారత సినీ సంగీతాన్ని శాసిస్తున్న తన స్నేహితురాలు లతా మంగేష్కర్‌తో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న దుంగార్పూర్‌ విజ్ఞప్తికి వెంటనే ‘ఓకే’ చెప్పిన లతా పైసా కూడా తీసుకోకుండా వేదికపై పాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆ కచేరీకి భారీస్థాయిలో అభిమానులు తరలి వచ్చారు.

దాని ద్వారా సుమారు రూ. 20 లక్షలు పోగయ్యాయి. భారత జట్టు సభ్యులు 14 మందికి ఒక్కొక్కరికీ కనీసం రూ. లక్ష చొప్పున బహుమతిగా ఇచ్చేందుకు ఆ డబ్బు సరిపోయింది. అప్పటినుంచి లతాకు, భారత క్రికెట్‌కు మధ్య అనుబంధం విడదీయరానిదిగా మారిపోయింది. నాటినుంచి ఇప్పటి వరకు భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా రెండు వీఐపీ సీట్లు లతా మంగేష్కర్‌ కోసం రిజర్వ్‌ చేయడం బీసీసీఐ రివాజుగా మార్చేసింది!   

చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో..

మరిన్ని వార్తలు