మహిమాన్విత మూర్తి మల్లూరు నరసింహ స్వామి

25 Jan, 2021 07:36 IST|Sakshi

హిరణ్య కశిపుడి ఆగడాలను అంతమొదించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి  శ్రీహరి ఎత్తిన  అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటకే నవ నరసింహ క్షేత్రాలని పేరు. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.

వరంగల్‌ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మీనరసింహ స్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు వరంగల్‌ పట్టణానికి 135 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది .

ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది. స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. స్వామి వారి బొడ్డు భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీని నుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తలలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.

ఈ ఆలయానికి సమీపంలో చింతామణి జలపాతం ఉంది. ఇది విశేషమైన ఔషధ గుణాలతో ఉంటుందని చెబుతారు. ఈ జలపాతానికి సమీపంలో మహాలక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జలపాతానికి సమీపంలో మరో చిన్ని జలపాతం ఉంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.

ఎలా చేరుకోవాలి?
మల్లూరు క్షేత్రానికి వరంగల్‌ నుంచి నేరుగా చేరుకోవచ్చు . అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మల్లూరు నరసింహ స్వామి అని పిలుస్తారు ఈ స్వామిని. 
– దాసరి దుర్గాప్రసాద్‌
పర్యాటక రంగ నిపుణులు 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు