ఈ భాష నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగం!

24 Mar, 2021 08:27 IST|Sakshi

కొత్త భాష నేర్చుకుంటే  ఏమొస్తుంది? కొత్త ఉత్సాహం వస్తుంది. మెమోరీ మెరుగు పడుతుంది. విషయ జ్ఞానం పెరుగుతుంది. జపనీస్‌ నేర్చుకుంటే వీటితో పాటు బ్రహ్మాండమైన ఉద్యోగం కూడా వస్తుంది....

తమ దేశంలో ఉద్యోగుల కొరత తీర్చడానికి మన ప్రభుత్వం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హెల్త్‌కేర్, కన్‌స్ట్రక్షన్, ఏవియేషన్, ఫుడ్‌సర్వీస్, నర్సింగ్‌కేర్, మెషిన్‌ పార్ట్స్‌ అండ్‌ టూల్‌ ఇండస్త్రీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ షిప్‌ మెషినరీ...ఇలా పద్నాలుగు రంగాలలో జపాన్‌లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలనుకునేవారికి స్పెసీఫైడ్‌ స్కిల్డ్‌ వర్కర్‌ కేటగిరిలో జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేక వీసాలు ఇవ్వనుంది.

2030 నాటికి జపాన్‌లో 60 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం జపాన్‌ వైపు చూస్తోంది యువత. అయితే అక్కడ ఉద్యోగ ఎంపికలో జపనీస్‌ భాష నైపుణ్యం అనేది కీలకం కావడంతో పెన్ను, పుస్తకం పట్టుకొని భాష బడుల వైపు పరుగెత్తే వారి సంఖ్య పెరుగుతుంది.

అసలు మనం జపనీస్‌ నేర్చుకోగలమా, మన వల్ల అవుతుందా?
ఎందుకు కాదు అంటున్నాడు థామస్‌. యూరోపియన్‌ సిటిజన్‌ అయిన థామస్‌ ఫ్లైర్‌ సరదాగా జపనీస్‌ మీద మనసుపడ్డాడు. ఎలాగైనా నేర్చుకోవాలనుకోవడమే కాదు నేర్చుకున్నాడు కూడా. జపనీస్‌ రాయగలడు. మాట్లాడగలడు. తాను జపనీస్‌ ఎలా నేర్చుకున్నది ఆయన మాటల్లోనే... ‘మొదట నేను చేసిన పని ఏమిటంటే, జపనీస్‌ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు కొనడం. వాటిలో డిక్షనరీ, వొకాబులరీ, గ్రామర్‌ పుస్తకాలు ఉన్నాయి. ఎంత పెద్ద భవనానికైనా  పునాది గట్టిగా ఉండాలంటారు కదా...కొత్త భాష మనకు పట్టుబడాలంటే ఎక్కువ  పదాలు నేర్చుకోవాలి. ఇందుకు wani kani వెబ్‌సైట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరువేల పదాలను నేర్చుకోవచ్చు. text fugu సెల్ఫ్‌ లెర్నింగ్‌ జపనీస్‌ ఆన్‌లైన్‌ బుక్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో టెక్స్ట్‌తో పాటు వీడియోలు కూడా ఉంటాయి.

జపనీస్‌ వైబ్‌సెట్లలోకి వెళ్లి చిన్న చిన్న పదాలు చదివేవాడిని. నీ పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ...నిత్యజీవితంలో ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకున్నాను. భాష నైపుణ్యానికి మూడు ‘పి’లు ఉంటే సరిపోతుంది. 1.ప్రాక్టిస్‌ లిజనింగ్‌ 2. ప్రాక్టిస్‌ స్పీకింగ్‌ 3. ప్రాక్టిస్‌ రైటింగ్‌.

lang8 అనే సోషల్‌ నెట్‌వర్క్‌లోకి వెళితే మనకు విలువైన సలహాలెన్నో దొరుకుతాయి. జపనీస్‌లో మీరేమైనా రాసి పోస్ట్‌ చేస్తే  అందులో ఏదైనా తప్పుదొర్లితే ఎవరో ఒకరు సవరించడమే కాదు సలహా కూడా ఇస్తారు. భాష నేర్చుకోవడం అనేది భారం కాదు. ఒక ప్రయాణం. గమ్యం చేరే క్రమంలో చేసే ప్రయాణం ఆనందమయం. లెర్న్‌ జపనీస్‌ ఆల్ఫాబెట్, జపనీస్‌ ఆల్ఫాబెట్‌ విత్‌ ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్, హౌటూ రీడ్‌ అండ్‌ రైట్‌  హిరగన (జపనీ అక్షరమాల)...మొదలైన పీడిఎఫ్‌లతో పాటు వీడియోలు నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అందాలొలికే సుందర జపనీ
జపనీస్‌ కాలిగ్రఫీని ‘షోడో’ అంటారు. ఎంతో మంది విదేశీలు దీనికి ఆకర్షితులయ్యారు. ‘కంజి’ క్యారెక్టర్లలో 1–3 స్ట్రోక్‌లతో పాటు 20 స్ట్రోక్‌లతో రూపొందించినవి ఉన్నాయి. 
ఇంగ్లిష్‌కు ఒక స్క్రిప్ట్‌ చాలు. జపనీస్‌లో మాత్రం హిరగన, కటకన, కంజి అనే మూడు స్క్రిప్ట్‌లను నేర్చుకోవాల్సిందే. అయితే ఈ మూడు కలిపే ఉపయోగిస్తారు. దీంతో పాటు రొమజి (రోమనైజేషన్‌ ఆఫ్‌ జపనీ) స్క్రిప్ట్‌ కూడా ఉంటుంది. పిల్లల పుస్తకాలు తప్పనిసరిగా హిరగన, కటకన లో ఉంటాయి. హిరగన, కటకనలను కలిపి ‘కన’ అంటారు.
‘ది ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది యూఎస్‌’  చెప్పేదాని ప్రకారం జపనీస్‌లో పదును తేలడానికి 2200 గంటలు అవసరమవుతాయి.
కౌన్‌ ఒ ఇనొరిమసు (బెస్ట్‌ ఆఫ్‌ లక్‌)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు