కూతురి కోసం స్త్రీ జన్మను వీడి మగ బతుకులో

13 May, 2022 00:14 IST|Sakshi
పురుష వేషధారణలో.. పెచ్చియమ్మాళ్‌

స్టేజ్‌ మీద నాటకం కోసం కాసేపు స్త్రీ పురుషుడిగా... పురుషుడు స్త్రీగా మారాలంటేనే కొంచెం కష్టం. కాని– తమిళనాడులో ఒక తల్లి 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం ఆమె పురుషుడిగా మారింది. ‘ముత్తు మాస్టర్‌’గా టీ స్టాల్‌లో పని చేసే ఆమె స్త్రీ అని ఎవరికీ తెలియదు. పురుషాధిపత్య సమాజం ఎంత భయపెడితే ఆమె ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది?

రాజ్యాలను కాపాడుకోవడానికి ఆడపిల్ల పుడితే మగపిల్లాడిగా పెంచిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఒంటరి స్త్రీలు ఈ మగ ప్రపంచంలో బతకాలంటే అవసరార్థం మగ అవతారం ఎత్తక తప్పదని రాజ్‌ కపూర్‌ ‘మేరా నామ్‌ జోకర్‌’లో పద్మిని పాత్ర ద్వారా చూపిస్తాడు. ఆమె ఆ సినిమాలో మగవాడి వేషం కట్టి బతుకు ఈడుస్తుంటుంది. అమోల్‌ పాలేకర్‌ తీసిన ‘దాయ్‌రా’ అనే సినిమాలో ఒక గ్రామీణ యువతి గ్రామస్తుల దాష్టికాలు భరించలేక, స్త్రీగా తనకు కలుగుతున్న అభద్రత నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మగ ఐడెంటిటీలోకి మారిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక నిస్సహాయురాలైన వితంతువు తన కూతురిని పెంచుకోవాలంటే మగవాడి అవతారం ఎత్తక తప్పదని భావించి గత ముప్పై ఏళ్లుగా అలాగే బతుకుతున్నదని తెలిస్తే ఆశ్చర్యమూ బాధా కలుగుతాయి. ఆ స్త్రీ పేరు పెచ్చియమ్మాళ్‌. ఊరు తమిళనాడులోని తూతుకూడి జిల్లాలోని కతునాయకన్‌పట్టి.

20 ఏళ్ల వయసులో
పెచ్చియమ్మాళ్‌ది తూతుకూడి జిల్లా. ఆమెకు వివాహం అయ్యాక గర్భంలో ఉండగా భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఒంటరి స్త్రీగా కుమార్తెను కాపాడుకోవడానికి అదే జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్‌. ఒంటరి స్త్రీ. పైగా వయసులో ఉంది. నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. తన ప్రాణం, తన ఉనికి కంటే తన కుమార్తె ఉనికి ముఖ్యం అనుకుందామె. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలి... తను కూడా రేపు పెద్దది అవుతుంది... దానికి కూడా ఒక మగ అండ ఉందనే భ్రాంతి కలిగించాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. మగ అవతారం ఎత్తడమే అందుకు విరుగుడు అనుకుంది. అంతే! జుట్టు కత్తిరించుకుని, లుంగీ చొక్కా ధరించి, పూర్తిగా పురుషుడిలా కనిపిస్తూ ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్‌పట్టికి చేరుకుంది.

అన్ని మగవాళ్ల పనులే
ఆ పల్లెలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. ఆమె తన పేరును ముత్తు అని చెప్పుకుంది. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలి పనులు, పెయింటింగ్‌ పని, కొబ్బరి బోండాలు కొట్టే పని, ఎక్కువ కాలం ఆమె హోటల్‌లో పరోటా మాస్టర్‌గా, టీ మాస్టర్‌గా పని చేసింది. అందువల్ల ఆమెను ఆ ఊళ్లో అందరూ ‘ముత్తు మాస్టర్‌’ అని పిలుస్తారు. ముత్తు మాస్టర్‌ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురిని పెంచి పెద్ద చేసుకుంది. ఆమెకు జీవితం ఇచ్చింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు. కూతురికి ‘తండ్రి అండ’ ఉండటం వల్ల ప్రత్యేకంగా సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 30 ఏళ్లుగా మగవాడిగా బతుకుతున్నది పెచ్చియమ్మాళ్‌. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు.

పెన్షన్‌ కోసం అసలు రూపం
పెచ్చియమ్మాళ్‌కు వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకున్నది. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకని ‘వితంతువు పెన్షన్‌’ కోసం ఇక అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్తే ఊరంతా ఆశ్చర్య పోయింది. నమ్మకమైన ఇద్దరు ముగ్గురు స్త్రీలకు తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్‌ ఆధార్‌ కార్డు ‘ముత్తు’ పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త డెత్‌ సర్టిఫికెట్‌ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్‌ ఇవ్వడం సమస్యగా మారింది. ఈ విషయం అందరికీ తెలిసి తనకు సహాయం అందడం కోసం ఈ విషయాన్ని మీడియాకు బయటపెట్టింది. అయితే తాను ఇలా ఇక మీదట కూడా పురుషుడిగానే ఉంటానని. తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని ఆమె కోరింది.        

మరిన్ని వార్తలు