లివర్‌ క్యాన్సర్‌: బీ, సీ వైరస్‌లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్‌-బీకి వ్యాక్సిన్‌ ఉంది.. కానీ,

26 Feb, 2023 10:16 IST|Sakshi

హెపాటో లేదా హెపాటిక్‌ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్‌ గురించి తెలుసుకుందాం.

విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్‌’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్‌లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్‌–బి వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్‌ ఉంది. కానీ... హెపటైటిస్‌–సి కు వ్యాక్సిన్‌ లేదు. అప్పటికే హెపటైటిస్‌–బి ఉన్నవారు వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

ఈ వ్యాక్సిన్‌ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు.  ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్‌ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్‌ యాబ్సెస్, విల్సన్‌ డిసీజ్, గిల్‌బర్ట్‌ సిండ్రోమ్‌ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్‌ బి, సి వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్‌), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. 

కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్‌ కార్సినోమా అనే క్యాన్సర్‌... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్‌ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్‌ లివర్‌ క్యాన్సర్‌ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్‌ క్యాన్సర్‌... ఇలాంటి ఏ క్యాన్సర్‌ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్‌ క్యాన్సర్‌ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు.
 
కాలేయ క్యాన్సర్‌ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్‌ క్యాన్సర్‌ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్‌ బి, సి వైరస్‌లు పాజిటివ్‌ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్‌ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్‌ సలహా మేరకు ట్రిపుల్‌ ఫేజ్‌ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్‌లు చేయించాలి. లివర్‌ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్‌ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. 

ఈ క్యాన్సర్‌ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్‌ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్‌ ఆర్టీరియల్‌ కీమో ఎంబోలైటేషన్‌ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్‌ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్‌–బి పాజిటివ్‌ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ  కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది.

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్‌ తీసుకుంటే హెపటైటిస్‌–బి పాజిటివ్‌ కాకుండా కాపాడుకోవచ్చు. 

- Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421

మరిన్ని వార్తలు