మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?

18 Feb, 2023 03:11 IST|Sakshi

కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? 

ఎందుకు తింటారంటే..?
చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. 

కాల్షియం, ఐరన్‌ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. 

మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి.  

పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. 

అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు.

మరిన్ని వార్తలు