మంచి మాట..: ఈ దరి... ఆ దరి

6 Jun, 2022 00:03 IST|Sakshi

జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి  జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది.

మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే.

ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు.

ఇదే  కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు!

శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు.

శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు.

   కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో  వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం  కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ  మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ  తట్టినా  చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..!

ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు.

    చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి.

    జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు.

జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది.
   జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్‌ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది.

   మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి.
– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు

మరిన్ని వార్తలు