ఏం పిల్లడో.. మళ్లీ వస్తవా..?

5 Aug, 2020 01:47 IST|Sakshi

జానపదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ఉద్యమకారుడు

సిక్కోలు నక్సల్‌బరి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గాయకుడు

పాటెళ్లిపోయింది... ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదిన గళం.. మూగబోయింది. అక్షరానికి గజ్జెకట్టి.. లక్షల హృదయాల్ని కొల్లగొట్టిన స్వరం.. ఆగిపోయింది. సిక్కోలు మాండలికానికి మాణిక్యంగా మారిన పాట.. వెళ్లిపోయింది. తూరుపు కనుమల్లో ఊపిరిపోసుకున్న పాటల సూరీడు అస్తమించాడు.. మట్టివాసనని విశ్వానికి పరిచయం చేసిన ప్రజాగాయకుడు మట్టిలో కలిసిపోయాడు. ఏం పిల్లడో మళ్లీ వస్తవా– అంటూ జనగళం విషాద స్వరంతో అడుగుతోంది.

‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా..సికాకుళంలో చీమలన్నయట..ఏం పిల్లడో వెల్దమొస్తవా’ ఈ పదాలు చాలు ఆయన్ని పరిచయం చేయడానికి. సిక్కోలు నక్సల్‌బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు. తన ఇంటి పేరు జానపదానికి బ్రాండ్‌నేమ్‌గా మార్చుకున్న ఉద్యమ కారుడు. ఆయనే వంగపండు. పూర్తి పేరు వంగపండు ప్రసాదరావు అయినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచంలో ఏ మూలకెళ్లినా వంగపండుగానే చిరపరిచితులు. తాను నమ్మిన సిద్ధాంతాలకు.. విలువలకు కట్టుబడి జీవనపోరాటం సాగించిన ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం.

విజయనగరంలో పుట్టినా.. ఇక్కడే జీవితం...
విజయనగరం జిల్లాలో  వంగపండు పుట్టినా.. సింహభాగం విశాఖలోనే గడిపారు. షిప్‌యార్డులో పనిచేశారు. ఆంధ్రావర్సిటీ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్సులో గౌరవ ఆచార్యునిగా సేవలందించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలి లో ఐటీఐ చేసి.. తండ్రితో కలిసి వ్యవసాయం చేశారు. ఊళ్లలో మాట్లాడుకునే పల్లెపదాలతో తోచిన బాణి కట్టుకుని పాడుతుంటే.. ఊళ్లల్లో అందరూ ’ఒరేయ్‌ కవి’అని వంగపండుని పిలుస్తూ.. జానపద లొల్లాయి గీతాలను పాడించుకునే వారు. అయితే వివాహమైన రెండేళ్లకు మొదలైన నక్సల్‌బరి ఉద్యమం వంగపండు జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది.

ఉద్యమమే ఊపిరిగా.. పాటే జీవితంగా..
వంగపండు... తుది శ్వాస విడిచే వరకూ ఉద్యమమే జీవితంగా... పాటే ఊపిరిగా జీవించారు. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగం రాగానే అందులో చేరారు. కానీ... ఉద్యోగం కంటే ఉద్యమమే తనకు ఎక్కువ  సంతృప్తిని ఇస్తోందంటూ ప్రతి రోజూ సహచరులతో చెప్పేవారు. అందుకే పదిరోజులు పనికెళ్లడం.. 20 రోజులు ఉద్యమాల్లో పాల్గొనడం చేసేవారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలన్నీ తిరిగారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ఆరేళ్లకు పైగా సర్వీసు ఉన్నా షిప్‌యార్డు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ  చేసి పాటే ఊపిరిగా పనిచేశారు.

సినిమా ఛాన్సులు వచ్చినా...
జనాల్ని ఉత్తేజపరిచే వంగపండు జానపద గీతాలు సినిమా వాళ్లని కూడా ఆకట్టుకున్నాయి. అభ్యుదయకారులైన టి. కృష్ణ, ఆర్‌.నారాయణమూర్తిలతో పాటు ఎంతోమంది తమ సినిమాలకు పాటలు రాయమని ఒత్తిడి తీసుకొచ్చేవారు. దర్శకుడు టి. కృష్ణ అయితే వంగపండు ఇంటికి స్వయంగా వచ్చి పాట రాయించుకునేవారంటే.. ఆయన జానపదం అంటే.. సినిమాకు ఎంత క్రేజ్‌ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సుమారు 30 సినిమాల్లో జనాల్ని ఉత్తేజ పరిచే గీతాల్ని రాశారు. అదేవిధంగా ఆరేడు సినిమాల్లోనూ వంగపండు నటించారు. అనేక సినిమాల్లో కూడా పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి వదులుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల్ని పక్కన పెట్టి.. సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి పాటలు రాసి ఉంటే.. ఆయన జీవితం మరోలా ఉండేదేమో..

శివుడంటే ఇష్టం.. కానీ.. నాస్తికుడు
వంగపండుకు శివుడంటే ఇష్టమని చెప్పేవారు. ఎందుకంటే.. సాధారణ జీవితం గడిపేవాడు కాబట్టి అని అనేవారు. కానీ.. ఆయన ఏనాడు శివాలయానికి వెళ్లలేదు. శివుణ్ణి పూజించలేదు. ఎందుకంటే.. వంగపండు నాస్తికుడు. తనకు జన్మనిఇచ్చిన తల్లిదండ్రుల్నే దైవాలుగా భావించేవారు. ఆ తర్వాత కొలిచే దైవం జానపద కళ మాత్రమే. మానవత్వమే నిజమైన దైవత్వమని వంగపండు విశ్వసించారు. తోటి వారికి సాయపడే గుణమున్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉందని ఎప్పుడు వంగపండు అనేవారు.

పాటకు ప్రపంచవ్యాప్తంగా పట్టాభిషేకం...
వంగపండు 400కుపైగా జానపద గీతాలు రాసారు. వాటిలో 200కు పైగా గీతాలు వంగపండుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన పాటలన్నీ గిరిజన భాషల్లోనే కాదు. దేశంలోని అనేక భాషల్లోకి అనువదించారు. ముఖ్యంగా ...ఏం పిల్లో ఎల్దమొస్తవ పాటని అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో ఇంగ్లిష్‌ భాషలోకి తర్జుమా చేసి మరీ పాడుకున్న చరిత్రను సొంతం చేసుకుంది. అదేవిధంగా.. జజ్జనకరి జనారే..యంత్రమెట్టా నడుస్తున్నదంటే.. మొదలైన పాటలు అన్ని వర్గాల ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

కర్షకుల కష్టాన్ని.. కార్మికుల శ్రమనీ.. పేదోడి ఆకలినీ.. గిరిజనుల దుర్గతినీ.. వలస బతకుల్నీ... మొత్తంగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తన పాటతో ప్రపంచానికి పరిచయం చేసిన వంగపండు కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఆయన మరణంతో జానపద గళం మూగబోయినా.. ఆయన స్ఫూర్తితో ఉత్తరాంధ్ర గడ్డపై పురుడు పోసుకున్న ప్రతి కలంలోనూ, గళంలోనూ వంగపండు సాహిత్యం సందడి చేస్తుంటుంది.. మోగే గజ్జెల సవ్వడిలో ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. – సాక్షి, విశాఖపట్నం

పేరు: వంగపండు ప్రసాదరావు
జననం: 1943 జూన్‌
పుట్టిన ఊరు: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి
తల్లిదండ్రులు: జగన్నాథం, చినతల్లి
కుటుంబం: ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు (వంగపండు పెద్దవాడు)
విద్యాభ్యాసం: బొబ్బిలిలో ఐటీఐ
ఉద్యోగం: హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ఫిట్టర్, ఏయూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ గౌరవ అధ్యాపకుడు
సినీప్రస్థానం: అర్థరాత్రి స్వాతంత్య్రంతో ప్రారంభం జననాట్యమండలి 1972లో స్థాపించారు. పీపుల్స్‌వార్‌ సాంస్కృతిక విభాగంగా దీన్ని స్థాపించారు.
పేరు తెచ్చిన పాటలు: ఏం పిల్లో ఎల్దమొస్తవ, జజ్జనకరి జనారే, తరమెల్లిపోతున్నాది, ఓడ నువ్వెల్లిపోకే... పేరు తెచ్చిన నత్యరూపకం: భూమిబాగోతం
అవార్డులు: 2017లో ఏపీ ప్రభుత్వం తరఫున కళారత్న పురస్కారం; 2008లో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారం; సుద్దాల అశోక్‌తేజ అవార్డు, నంది అవార్డు, తానా నుంచి రంగస్థల రత్న అవార్డు

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు