చిన్నారులకు కరోనా సోకిందా? అలా మాత్రం చేయకండి

2 May, 2021 09:40 IST|Sakshi

ఫస్ట్‌ వేవ్‌లో పిల్లలు, టీనేజర్లపై కరోనా ప్రభావం తక్కువే. సెకండ్‌ వేవ్‌లో మాత్రం పెద్దల స్థాయిలో కాకపోయినా పిల్లలూ దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ విషయంలో వారికి అవగాహన కలిగించడం, అవసరమైన చికిత్స అందించడం వంటివి కొంత క్లిష్టమైన అంశమనే చెప్పాలి.  ఈ నేపథ్యంలో పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? ఒకవేళ కరోనా సోకిన పక్షంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అన్న అంశంపై నీలోఫర్‌ ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శిరీష చెబుతున్న సలహాలతోపాటు.. ఈ కల్లోల పరిస్థితుల్లో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండాలి? ఎలా ఉంచాలి? అనే అంశంపై సైకాలజిస్ట్‌ డా.గీతా చల్లా అందిస్తున్న సూచనలు మీ కోసం..

ఈ జాగ్రత్తలు మస్ట్‌...
వీలైనంత వరకూ ఇంటికి వచ్చే అతిథుల్ని కూడా పిల్లలు కలవకుండా చూడాలి.  బయటకు వెళ్లి ఆడుకుంటామని మారాం చేసే పిల్లలను ఎలాగోలా ఆపడమే మేలు. ముఖ్యంగా పబ్లిక్‌ ప్లేసెస్, చుట్టాలింటికి పండుగలూ ఫంక్షన్లంటూ తీసుకెళ్లవద్దు.  అపార్ట్‌మెంట్స్‌లో సెల్లార్స్‌లో ఆడుకోవడం కూడా వద్దు. దానికి బదులుగా వారితో ఇండోర్‌ గేమ్స్‌ ఆడించండి లేదా స్నేహితులతో వర్చువల్‌ సంభాషణలు వంటివి అలవాటు చేయాలి. పిల్లల్లో లక్షణాల్లేని పాజిటివ్‌ కేసులే ఎక్కువ. కాబట్టి వాళ్ల ద్వారా వ్యాప్తి ఎక్కువ. ప్రతీ జలుబూ దగ్గుకీ కోవిడ్‌ పరీక్ష అవసరం లేకపోయినా.. అలా జలుబు, దగ్గు రావడానికి  ముందు బయటకు వెళ్లి వచ్చి ఉంటే.. ఎవరినైనా కలిసి వచ్చినట్టు ఉంటే తప్పకుండా పరీక్ష చేయించాలి.

మాస్క్‌... టాస్క్‌...
మాస్క్‌ధారణ విషయంలో వారు తరచుగా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి తరచుగా మాస్క్‌ సరిగా పెట్టుకున్నారో లేదో గమనిస్తూ హెచ్చరిస్తూ ఉండాలి. అలాగే చిన్నారులు కనీసం 20 సెకన్ల పాటు తమ చేతుల్ని సబ్బు నీటితో కడుగుకునేలా లేదా శానిటైజర్‌తో తరచూ శుభ్రం చేసుకునేలా చూడాలి. శానిటైజ్‌ చేసుకోకుండా చేతులతో ముఖం, కళ్లు, ముక్కు వంటివాటిని పదే పదే  తాకకుండా చూడాలి. దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు మోచేతితో లేదా టిష్యూతో  కవర్‌ చేసుకోవడం అలవాటు చేయాలి. వాడిన టిష్యూ పేపర్‌ని వెంటనే పారవేయాలి. పిల్లలు తరచుగా ముట్టుకునే డోర్‌ నాబ్స్, స్విచ్‌లు, బొమ్మలు, రిమోట్‌ కంట్రోల్స్, ఫోన్స్‌... వంటివి శుభ్రపరచడం మేలు.  
-డా. శిరీష, పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

వస్తే ఇలా చేయండి
కోవిడ్‌కి సంబంధించి పిల్లల్ని కూడా 3 రకాలుగా విభజిస్తున్నారు. అవి.. అస్సలు లక్షణాలు లేకపోవడం/మైల్డ్‌/మోడరేట్‌ టు సివియర్‌. ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చినవారికి ఏ విధమైన ప్రత్యేక చికిత్స అక్కర్లేదు. ఆరోగ్యకరమైన పోషకాహారం ఇస్తే సరిపోతుంది. స్వల్ప లక్షణాలు ఉంటే వైద్యుల సలహా మేరకు పారాసిటమాల్, దగ్గు, జలుబు మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే విటమిన్‌ లోపాలు ఏమైనా గుర్తిస్తే... ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వైద్యుని సలహా మేరకు సప్లిమెంట్‌ వాడొచ్చు  మోడరేట్‌ టూ సివియర్‌ అంటే.. కనీసం 3 లేదా 4 రోజులకు కూడా జ్వరం తగ్గకపోవడం, తినలేకపోవడం, తాగలేకపోవడం, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, దద్దుర్లులాగ రావడం.. అలాగే.. కళ్లు ఎర్రగా ఉండటం, జాండిస్‌ లక్షణాలు, అతిగా డయేరియా ..ఇలాంటివి ఉంటే పీడియాట్రిక్‌ స్పెషలిస్ట్‌ పర్యవేక్షణ అవసరం.  

రికవరీ భేష్‌...
ప్రస్తుతానికి కోవిడ్‌ ఎక్కువ బొద్దుగా ఉండే పిల్లల్లో చూస్తున్నాం. చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి అజిత్రోమైసిన్‌ ఇవ్వొచ్చునని కొన్ని స్టడీస్‌ చెబుతున్నాయి. కొన్ని స్టడీస్‌ వద్దు అని చెబుతున్నాయి. కొంచెం పెద్ద పిల్లల్లో అయితే రెమిడెసివిర్‌ కూడా వాడుతున్నారు. మేమైతే నీలోఫర్‌లో ఎవరికి రెమిడెసివిర్‌ ఇవ్వడం లేదు. అయినా, రికవరీ రేట్‌ బాగా ఉంది. అయితే పాజిటివ్‌ అయిన 3, 4 వారాల తర్వాత తీసుకువస్తుండడం వల్ల  కాస్ట్‌లీ ట్రీట్‌మెంట్స్‌ అవసరం పడుతున్నాయి.  

పాజిటివ్‌...అయినా పేషెంట్‌లా ట్రీట్‌ చేయవద్దు..
పాజిటివ్‌ అని తెలిసినా వారికేదో భయంకరమైన రోగం వచ్చినట్టు భావన కలిగించవద్దు. పెద్దలు భయపడి పిల్లల్ని భయపెట్టవద్దు. ఒకసారి వారిలో భయం మొదలైతే వాళ్లని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం చాలా కష్టం. సేఫ్టీ మెజర్స్‌ పాటించేలా చూడాలి. మాస్క్, శానిటైజర్‌ వంటివి అలవాటు చేసేటప్పుడు.. అవి వేసుకోకపోతే అలా అయిపోతావ్‌ ఇలా అయిపోతావ్‌ అని భయపెట్టవద్దు. గ్రీన్‌ డ్రెస్‌ వేసుకున్నావు కదా ఇదిగో గ్రీన్‌ మాస్క్‌ కుట్టిస్తా లాంటి సరదా మాటలతో మాస్క్‌ ధరించేలా చేయాలి.

ఎక్కువగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాతావరణాన్ని ఇంట్లో ఉండేలా చూడాలి. పాజిటివ్‌ వచ్చిన చిన్నారిని ఐసోలేషన్‌లో ఉంచినా.. ఆ చిన్నారి  రూమ్‌ని చాలా ఫన్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి. ‘‘నువ్వు 14 రోజులు ఈ రూమ్‌లో ఉంటావు. అలా ఉంటే నీకు మూడు బహుమతులు ఇస్తా ’’ అంటూ గిఫ్ట్స్‌ ఫొటోలు తెచ్చి పోస్ట్‌ చేయాలి. తనొక పేషెంట్‌లా ట్రీట్‌ చేసి ముట్టుకోవద్దు వంటివి మాట్లాడితే పిల్లల సున్నితమైన మనసు బలహీనపడుతుంది. అలాగే అంటరానితనం చూపిస్తే హర్ట్‌ అవుతారు. ఈ టైమ్‌లో వారికి ఎమోషనల్‌ వెంటిలేషన్‌ చాలా కావాలి. 
-డా. గీతా చల్లా, సైకాలజిస్ట్‌

మరిన్ని వార్తలు