స్త్రీ శక్తి: లండన్‌ మ్యూజియానికి పింక్‌ శారీ!

19 Mar, 2023 05:55 IST|Sakshi

ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్‌’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్‌ మ్యూజియానికి చేరనుంది.

ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్‌ ‘డిజైన్‌ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్‌లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది.

2006లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస!
అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్‌!

‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్‌ శారీని యూనిఫామ్‌గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్‌పాల్‌దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు.

తాజాగా...
లండన్‌ ‘డిజైన్‌ మ్యూజియం’ క్యూరేటర్‌ ప్రియా ఖాన్‌చందాని నుంచి సంపత్‌పాల్‌దేవికి  ఇమెయిల్‌ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్‌ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్‌బీట్‌ శారీ టైటిల్‌తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’
‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్‌పాల్‌దేవి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు