Holi 2021: హెర్బల్‌ హోలీ!

28 Mar, 2021 22:30 IST|Sakshi

రంగుల పండుగ హోలీలో కలర్స్‌ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్‌. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో  కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్‌ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో  తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. యూపీలోని సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్‌ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది.  

ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్‌ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్‌ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు.

ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్‌ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్‌ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్‌ గులాల్‌ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్‌..

ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్‌ తెలిపారు.యూపీ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ డైరెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి.

సోన్‌భద్రా, మీర్జాపూర్‌ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్‌ గ్రూపు  మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058  మహిళలు  మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు  చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్‌ నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు.

కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్‌ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, బీహార్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్‌ ఇన్పెక్షన్స్‌ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్‌ హోలీ ఆడండి.

మరిన్ని వార్తలు