శివుడికి మూడో కన్ను నిజంగానే ఉందా?

11 Mar, 2021 08:30 IST|Sakshi

ఏ దేవుడికీ మూడు కళ్లు లేవు... మరి శివుడికే ఎందుకు..అందవికారంగా ఉంటాడుగా మూడో కన్ను ఉంటే... శివుడికి మూడోకన్ను ఉండకపోతే ముక్కంటి ఎందుకవుతాడు... త్రయంబకేశ్వరుడు ఎలా అవుతాడు.. త్రినేత్రుడు అనే పేరును ఎలా సంపాదించుకుంటాడు.. మూడు కళ్ల శివుడు కొలువై ఉన్న ప్రదేశానికే త్య్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. పవిత్ర గోదావరి నది అక్కడ ప్రభవించింది. తప్పు చేసినా, సాధుసజ్జనులను హింసించినా మూడో నేత్రం అగ్ని ప్రళయాన్ని సష్టిస్తుంది.

మూడో కంటి గురించి పండితులు చెప్పే మాట ఇలా ఉంది... శివుడి మూడో కన్ను భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని. ప్రతి మనిషిలోను అంతర్నేత్రం ఉంటుంది. అదే అంతర్‌జ్యోతి, జ్ఞాన జ్యోతి ప్రసాదిస్తుంది. దానినే మనోనేత్రం అంటాం. ప్రతి మనిషిలోని జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులు అవుతారు. మనకున్న రెండు కళ్లతో ఒక్కోసారి న్యాయమేదో అన్యాయమేదో చూడలేకపోతాం. అందుకే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి, మనోనేత్రంతో వాస్తవాన్ని వీక్షించాలంటారు న్యాయశాస్త్రవేత్తలు.

మూడో కన్ను ప్రత్యేకత... మనోనేత్రంతో కోరికలను జయించాలి. సాక్షాత్తు మన్మథుడు వచ్చి శివుడిని ప్రేరేపించటానికి ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఆ కాముడిని తన మూడోకంటితో భస్మం చేశాడు శివుడు. అంటే తన మనో నేత్రంతో కామ వాంఛను జయించాడని అర్థం. అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలంటున్నాడు శివుడు. ప్రతి సామాన్య మానవుడికి సమతుల్యత, సాధుత్వం, దూరదష్టి ఉండాలి. పరస్త్రీని తల్లిగా భావించాలి, ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు, సన్మార్గంలో యశస్పు గడించాలి. ఈ మూడు లక్షణాలకు, పైన చెప్పిన మూడు గుణాలకు త్రినేత్రాలు ప్రతీకలు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా, పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారని యోగీశ్వరులు చెబుతారు. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మూడో నేత్రం గురించి, ‘ఇది జ్ఞానానికి యాంటెన్నా’ అని చెబుతున్నారు. సిద్ధి పొందటానికి ఈ మూడో నేత్రమే దోహదపడుతుందని, భౌతిక శరీరంతో జీవిస్తున్నప్పటికీ సిద్ధి కలుగుతుందని వేదాంతులు చెబుతున్నారు. అదే మూడో నేత్రం.

ఒకసారి శివుడు తపోదీక్షలో నిమగ్నమైపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడకు వచ్చి, శివుడిని ఆటపట్టించటానికి ఆయన రెండు కళ్లను తన చేతులతో మూసింది. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ముల్లోకాలలోనూ అయోమయం ఏర్పడింది. స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు. శివుడు తనకున్న దివ్యశక్తితో, మూడో కన్నును సృష్టించి, తన నుదుటి మీద నిలిపాడు. ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని వల్ల ముల్లోకాలలోనూ చీకటి తొలగింది. శివుని రెండు కళ్లను మూసిన పార్వతి రెండు చేతులూ చెమర్చాయి. పార్వతిపరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట ఒక బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే అంధకుడు. మహాదేవుని పరమభక్తుడైన ఒక దానవుడు, అంధకుడిని దత్తతు తీసుకున్నాడు. ఆ కథ వేరు.
– డాక్టర్‌ వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు