ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!

8 Feb, 2021 13:32 IST|Sakshi
సౌత్‌ కొరియాలోని సుసెయాంగ్‌ సరస్సు మీద వంతెనకు లవ్‌లాక్‌లు

ప్రేమ... కలకాలం కలిపి ఉంచే బంధం. అందంగా అల్లుకున్న ప్రేమబంధం...రోజు రోజుకీ మరింతగా బలపడాలి. ఎప్పటికీ దూరంకానంత దగ్గరగా ఉంచాలి. బంధించినంత దృఢంగానూ ఉండాలి. అవసరమైతే గుండె గదికి తాళం వేయాలి. ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! ఒక దేశంలో చెట్టుకు తాళం వేస్తే..మరికొన్ని దేశాల్లో వంతెనలకు తాళం వేస్తున్నారు.

ఎంతసేపూ మాట్లాడే పిల్లలను నోటికి తాళం వేయమని టీచర్లు గదిమేవాళ్లు. పిల్లలు చూపుడు వేలిని పెదవుల మీద ఆన్చి దొంగ చూపులు చూస్తూ ఉంటారు. టీచర్‌ దృష్టి తమ మీద నుంచి పక్కకు మళ్లగానే నోటి మీదున్న చూపుడు వేలిని అలాగే ఉంచి పక్కనున్న పిల్లలతో మెల్లగా గుసగుసలాడుతుంటారు గడుగ్గాయిలు. స్కూలు దశలో మొదలయ్యే ఈ అలవాటు పెద్దయినా పోయేటట్లు లేదు.

నిబంధనల కళ్లుగప్పి ప్రేమతాళాలు వేస్తూనే ఉన్నారు ప్రపంచంలోని ప్రేమికులు. ప్రేమను పండించుకోవడానికి తాళాలు వేసే అలవాటు సరదాగా మొదలైంది. ఆ అలవాటును మాన్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల తాళాల అడ్డాలు చాలానే ఉన్నాయి. మనదేశానికీ పాకింది. కానీ వెర్రి తలలు వేయడం లేదు.

ప్రేమబంధం కలకాలం
ఫ్రాన్స్‌ దేశం, పారిస్‌ నగరంలో సీయెన్‌ నది మీద ఓ వంతెన. పేరు పాంట్‌ ద ఆర్ట్స్‌. ఈ వంతెన ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుందని ఓ నమ్మకం. వంతెన రెయిలింగ్‌కు ఉన్న తాళాలన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. ప్రేమికులు తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని మరీ తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం.

ఇది సరదాగానే మొదలైంది. కానీ విపరీతంగా ప్రచారంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్‌ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్‌ అంటూ వేడుకుంటున్నారు పారిస్‌ నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. నగర పాలక సిబ్బంది వాటిని తొలగిస్తూనే ఉన్నారు. 

‘ఐ వాంట్‌ యూ’ ప్రభావం
ఫ్రాన్స్‌లో జరుగుతోంది కాబట్టి ఫ్రెంచ్‌ వాళ్ల నమ్మకం అనిపిస్తుంది. ఇటాలియన్‌ నవల ‘ఐ వాంట్‌ యూ’తో మొదలైంది. ఇందులో నాయికానాయకులైన రోమన్‌ ప్రేమికులు తమ ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించాడు రచయిత. అంతే దశాబ్దంలోపే పారిస్‌ వంతెనకు ఏడు లక్షల తాళాలు పడ్డాయి. వెర్రితలలు వేస్తున్న ఈ అలవాటును మాన్పించడానికి ‘లవ్‌ విదవుట్‌ లాక్స్‌’ ప్రచారం మొదలైంది. ‘వంతెన మీద నిలబడి ఒక సెల్ఫీ తీసుకోండి. ప్రేమ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాళం పడటం ఆగలేదు, తాళాలు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.

స్కాట్లాండ్‌లో... 
‘మార్క్‌ యువర్‌ స్పాట్‌’ ఇలాంటిదే. ఈ వంతెన మీద ఏటా ప్రేమికుల కోసం వేడుకలు  జరుగుతాయి. వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. అయితే ఈ నిషేధం తాళాలకే, ప్రేమకు కాదు.

సౌత్‌ కొరియాలో...
సౌత్‌ కొరియాలోని డియాగులో ఉన్న సుసెయాంగ్‌ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు.

మాస్కో ప్రేమ
మాస్కోలో వోడూట్‌డోట్నీ కెనాల్‌ మీద కట్టిన వంతెన ప్రేమికుల అడ్డా. ఈ వంతెన మీద ఇనుప చెట్లకు నిండా పూలు విరగబూసినట్లు తాళాలుంటాయి. అవన్నీ లవ్‌లాక్‌లే.

మరిన్ని వార్తలు