చదువులమ్మ ఈ లాయరమ్మ

8 Feb, 2021 06:02 IST|Sakshi
పౌలోమి పావిని శ్లుక్లా

స్ఫూర్తి

అనాథ పిల్లలు రోజు గడవడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. జీవితంలో ఎదుగుదలకు లక్ష్యం ఏర్పాడటానికి ఊతంగా నిలిచే చదువు లభించాలంటే అందుకు దైవం నుంచి వరం లభించాల్సిందే. అలాంటి అనాథ పిల్లల చదువుకు వరప్రదాయినిగా కృషి చేస్తోంది లాయర్‌ పౌలోమి పావిని శ్లుక్లా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ 30 సంవత్సరాల వయస్సులో సేవా రంగంలో గణనీయమైన కృషి చేసిన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది అనాథల విద్య కోసం కృషి చేస్తున్న పావిని పేరును ఆ 30 మంది జాబితాలో చేర్చింది.   

అనాథ పిల్లలకు సరైన విద్యను అందించడం ఎలాగో 28 ఏళ్ల సుప్రింకోర్టు న్యాయవాది పావినికి తెలుసు. ఆమె చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఆమె కుటుంబమే అతి పెద్ద మద్ధతు. పావిని తల్లి అరాధన శుక్లా మాట్లాడుతూ –‘దేశంలో తమ గొంతు వినిపించలేని అనాథ పిల్లలు చదువులో రాణించడం వల్ల వారి హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏమీ లేని పిల్లలు జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నది ఒక న్యాయవాది. ఆమె నా కూతురు అవడం మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆనందంగా పావిని చేస్తున్న పనిని అభినందించారు ఆమె తల్లి.

స్వీయ రచన
లక్నోలో ఉంటున్న రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి పావిని శుక్లా దేశం గర్వించదగిన వ్యక్తుల జాబితాలో చేరడం ఒకే రోజులో జరగలేదు. దాని వెనక పదేళ్లుగా ఆమె చేస్తున్న కృషి ఉంది. సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లైన ఆరాధన శుక్లా, ప్రదీప్‌ శుక్లాల కూతురు పౌలోమి పావిని శుక్లా. 2015 లో భారతదేశంలో అనాథ పిల్లల దుస్థితి గురించి తన సోదరుడితో కలిసి ‘వీకెస్ట్‌ ఆన్‌ ఎర్త్‌– ఆర్ఫాన్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో పుస్తకం రాసింది. పావిని అదే ఏడాది అనాథల కోసం లక్నోలో ‘అడాప్ట్‌ ఎ అనాథాశ్రమం’ ప్రారంభించింది.

ఆశ్రమ నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. వీరి నుంచి నగరంలోని పాఠశాలల నిరుపేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్‌ ఫీజులను ఇచ్చి చదివించగలిగింది. పిల్లలను చదివించడానికి గల కారణాలను పావిని తెలియజేస్తూ– ‘నా తొమ్మిదేళ్ల వయసులో నా పుట్టిన రోజున మా అమ్మ అనాథాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. మాట్లాడాను. చదువుకోవాలనే వారి ఆశను స్వయంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి అనాథల కోసం ఏదైనా చేయాలి అని బలంగా అనుకునేదాన్ని. దాంట్లో భాగంగానే వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాను’ అని వివరించింది.

పదేళ్ల కృషి
సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథ పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు దశాబ్దం పాటు కృషి చేస్తూనే ఉంది పావిని. విద్యార్థులకు అవసరమైన కోచింగ్, ట్యూషన్ల కోసం ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖతో కలిసి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది నగరాల్లో 13 స్కూళ్లలోని నిరుపేద పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్‌ డబ్బును అందజేసింది. లాక్డౌన్‌ సమయంలో నగరంలోని అన్ని అనాథాశ్రమాలలో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకు ఆ¯Œ లైన్‌ విద్య సౌకర్యం లభిస్తోంది. ఈ పని ప్రారంభాన్ని వివరిస్తూ, పావిని ఇలా అన్నారు ‘ఫోర్బ్స్‌ జాబితాలో నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది. అనాథల కోసం ఎక్కువ పని చేయమని సూచించిన ఈ స్థానం నన్ను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు