యుద్ధ చరిత్రల్లో స్త్రీ

9 Nov, 2020 00:33 IST|Sakshi
నవల: ద షాడో కింగ్‌ , రచన:  మాజా మెంగిస్టె, ప్రచురణ: నార్తన్‌; 2019

కొత్త బంగారం

రెండవ ఇటాలో–ఇథియోపియన్‌ యుద్ధంలో (1935–1941) ఇటలీ మీద ఇథియోపియా సాధించిన విజయం ప్రతిష్టాత్మకమైనది. మొదటిసారి పరాజయం పాలైన ఇటలీ, నలభై ఏళ్ల తరవాత ముస్సోలినీ కాలంలో మరోసారి దురాక్రమణకి ప్రయత్నించి పరాజయాన్ని చవిచూసింది. సుశిక్షిత సైన్యం, ఆధునిక యుద్ధపరికరాలూ, రేడియోలతోబాటు ఇథియోపియన్‌ ప్రాంతపు నైసర్గిక స్వరూపం తెలిసిన శత్రురాజుల సహకారం ఇటలీ బలాలైతే, అప్పటికప్పుడు హడావుడిగా సమీకరించుకున్న సైన్య సమూహాలూ, సాంప్రదాయ యుద్ధపరికరాలూ, సమాచార లోపాలూ ఇథియోపియా బలహీనతలు. ఓటమి అనివార్యం అనుకున్న తరుణంలో ఇటలీని నిలువరించి విజయాన్ని సాధించడం ఇథియోపియా చరిత్రలో ఘనమైన అధ్యాయం.

ఇథియో–అమెరికన్‌ రచయిత్రి మాజా మెంగిస్టె రాసిన చారిత్రక నవల ‘ద షాడో కింగ్‌’ ఈ యుద్ధం గురించి చెబుతుంది. పురుష సైనికాధికారులని మాత్రమే ప్రస్తావించే చరిత్రలోనూ వివక్ష ఉందన్నది రచయిత్రి వాదన. పదేళ్లపాటు ఈ యుద్ధం మీద చేసిన పరిశోధనలో స్త్రీల ప్రస్తా వన ఎక్కడా కనిపించని రచయిత్రికి, తమ వంశంలోని స్త్రీలు ఇందులో పాల్గొన్నారని తల్లి ద్వారా తెలియటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇథియోపియన్‌ స్త్రీలు తెరవెనుక పాత్రలకే పరిమితమై పోకుండా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నారన్న నిజాన్ని చరిత్రకారులు గుర్తించకపోవటం శోచనీయమనీ, వారి సాహస గాథలు వంటింటి కథలుగా మిగిలిపోతున్నాయన్న రచయిత్రి ఆవేదననే నవలకి ప్రేరణ. 

ఇటలీ యుద్ధం ప్రకటించాక పరాజయ, ప్రాణభయాలతో ఇథియోపియా రాజు హైలా సెలాసే ఇంగ్లండ్‌ పారిపోతాడు. రాజే పారిపోయాడని తెలిస్తే ప్రజలు నిర్వీర్యులవుతారనుకున్న సైన్యాధికారి కిడానె, రాజు రూపురేఖలతో ఉన్న దళసభ్యుడు మినిమ్‌ అనే వ్యక్తిని ప్రజలను ఉత్తేజపరిచేందుకు షాడో కింగ్‌గా ప్రజల ముందుకు తెస్తాడు. గెరిల్లా పద్ధతిలో ప్రాణాలకు తెగించి పోరాడిన కిడానె, హీరూట్, ఆస్తర్, ఇతర పౌరులూ వెన్నెముకై నిలిచి గెలిచిన యుద్ధమే కథాంశం; యుద్ధభూమే కథావరణం. కొడుకు మరణం, భర్త నిర్లక్ష్యం, సేవకురాలు హీరూట్‌ పట్ల భర్త కిడానెకి ఉన్న ఆకర్షణ లాంటి సమస్యలున్నప్పటికీ, స్త్రీలను సంఘటిత పరుస్తూ సైనికులుగా తయారుచేసి ఇటాలియన్‌ సైన్యాధికారి ఫ్యుసెల్లి మీదకు ప్రత్యక్షదాడి చేసిన ఆస్తర్‌; ‘కొంతమంది వస్తువులను సొంతం చేసుకోటానికి పుడితే మరికొందరు వాటిని శుభ్రం చేసి నిర్దేశిత ప్రాంతాల్లో పెట్టడానికే పుడతారు,’ అనుకునే స్థితినుంచి యుద్ధఖైదీగా మారినపుడు గుండెనిబ్బరంతో ప్రయాణం సాగించే సేవకురాలు హీరూట్‌; వేశ్యగా పరిచయమై, ఇటాలియన్‌ సైన్యాధికారులకు సేవలందిస్తూ, మరోపక్క ఇథియోపియన్లకు గూఢచారిణిగా వ్యవహరిస్తూ స్వతంత్రాపేక్ష కోల్పోని ఫిఫి – వీళ్లంతా వివిధ ఔన్నత్యాలతో ప్రకాశించే స్త్రీ పాత్రలు. 

దాడులు కొనసాగించమని లండన్‌ నుంచి రాజు ఉత్తర్వులు పంపినప్పుడు– కొడుకుని రక్షించుకుంటున్న రాజు, కొడుకుని కోల్పోయిన తనని ప్రాణత్యాగం వైపుకి నడిపించటంలోని స్వార్థచింతన అర్థమవుతుంది సైన్యాధికారి కిడానేకి. ఇటాలియన్‌ సైన్యంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఇటాలియన్స్‌ దాష్టీకాలను అరాచకాలను సమర్థించలేని, యూదుడయిన కారణంగా వారిలో కలిసిపోలేని ఎత్తోరేది మౌనవేదన. ఇటలీ సైన్యాధికారి ఫ్యుసెల్లి సైనికరూపం వెనక ఉన్నభయాలూ, న్యూనతలూ మనిషి మౌలిక రూపాన్ని చూపిస్తాయి. యుద్ధానంతరం రాజ్యాధికారం తిరిగి చేపట్టగలిగిన హైలా సెలాసే, సివిల్‌ వార్‌ అనంతరం రైతుగా మారడం కొసమెరుపు. 

రాజై ఉండి అపరాధపు నీలినీడల్లో కుమిలిన హైలా సెలాసే షాడో కింగా? రైతే రాజుగా మారి ప్రజలను ఉత్తేజపరిచిన మినిమ్‌ షాడో కింగా అన్నది శీర్షికలోని ప్రహేళిక. బహుళ కథకులు, బలమైన పాత్రలు, కొత్తఒరవడిని గుర్తుచేసే కథాకథనం, యుద్ధవాతావరణ చిత్రీకరణలోని గ్రీక్‌ ట్రాజెడీ ఛాయలు, కథనంలో ఇమిడిపోయిన సూక్ష్మమైన వర్ణనలు, మనస్తత్వ విశ్లేషణలు, చర్చింపబడిన వివక్షలు నవల బలాలు. నవలలోని కథనం ‘ఫొటో’, ‘కోరస్‌’, ‘ఇంటర్లూ్యడ్స్‌’ అనే అధ్యాయాలుగా ఇటాలియన్‌ అరాచకాలనీ, జరుగుతున్న కథనీ, రాజు అంతరంగాన్నీ చిత్రిస్తూంటాయి. అక్కడక్కడా కనిపించే అమ్హారిక్, ఇటాలియన్‌ భాషాప్రయోగాలు ప్రాంతీయతకి దోహదం చేస్తాయే తప్ప, చదవడానికి ఆటంకాలు కావు. చరిత్ర చెప్పే వాస్తవాల అడుగున మరుగునపడ్డ ఉద్వేగాలు అనేకం ఉంటాయి. యుద్ధపరిణామాలకి సమాంతరంగా మానవజీవితంలో స్థితమై ఉండే జ్ఞాపకాల, గుండెచప్పుళ్ల నిరంతరతను ప్రదర్శించిన రచయిత్రి ప్రతిభా పాటవాలు– శ్రీపాద భాషలో – ఆమె వేత్తృతకి నికషాలు.
- పద్మప్రియ 

మరిన్ని వార్తలు