హ్యాపీ న్యూ ఇయర్‌ సిల్వీ

1 Jan, 2021 00:22 IST|Sakshi
 ప్రతీకాత్మక చిత్రం

మాధవ్‌ శింగరాజు

జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువ. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అవుతుంది. ఇల్లు సపోర్ట్‌ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. 

‘‘నేనేం గ్రహించానో తెలుసా? జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’’ అంటుంది సిల్వీ. ఉద్యోగం చేస్తుంటుంది తను. టీవీ స్టేషన్‌లో తనకు ఇష్టమైన ఉద్యోగం. ఉద్యోగంలా చేయదు. ఉద్యోగమే తన జీవితం అన్నంతగా చేస్తుంది. ఆమె జీవితంలో మరికొన్ని కూడా ఉంటాయి. ఇల్లు, వంట, భర్త, ఇంటికి వచ్చిపోతుండే అతిథులు. ‘‘అవన్నీ నువ్వే చూస్కో, నేను చేయలేను..’’ అంటుంది భర్తతో. ఆఖరికి అతిథుల్ని కూడా! ‘‘బాగోదు సిల్వీ.. అతిథులు ముఖ్యం కదా. కొన్నిరోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టేయ్‌..’’ అంటాడు భర్త. ఆ ఘర్షణలోనే.. ‘జీవితం మనకు అస్సలు ఇష్టం లేనివాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’ అని భర్తతో అంటుంది సిల్వీ. వాపోవడమది. 


సిల్వీస్‌ లవ్‌’ చిత్రంలో సిల్వీ పాత్రధారి టెస్సా థాంప్సన్

జీవితంలో ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ రెండూ ఉంటాయి. రెండిటికీ కలిపి ఒకే సమయం ఉంటుంది. ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ వేటికవి జరిగిపోతున్నా.. ఇష్టమైనవి చేయనివ్వకుండా ముఖ్యమైనవి అడ్డుపడుతున్నప్పుడే.. ‘జీవితం పొద్దెక్కిపోతోందే’ అని మనసు త్వరపడి బలాన్ని కూడదీసుకుని ఇష్టమైనవాటి వైపు పరుగులు తీయాలని చూస్తుంది. ఆ వెనకే.. స్ట్రెస్‌. కన్నీళ్లు. ఇక్కడ సిల్వీ కూడా ఏడుస్తుంది. అర్థం చేసుకోగలిగిన భర్త అయుండీ, అర్థం చేసుకోలేకపోతున్న స్థితిలో మృదువుగా నెమ్మదైన స్వరంతో సిల్వీతో వాదించి ఆమె గదిలోంచి వెళ్లిపోతాడు. ఇంట్లోని గెస్ట్‌లకు మర్యాదలు అందించే పనిలో పడతాడు. అది అతడికి ముఖ్యమైన పని కాకుండా, ఇష్టమైన పని అయి ఉంటే కనుక అతడికోసం సిల్వీ తనకు ఇష్టమైన పనిని వదిలి, అతడికి ఇష్టమైన పనిని తన ముఖ్యమైన పనిగా మీద వేసుకుని గెస్ట్‌లు ఉన్న హాల్లోకి వెళ్లి ఉండేదేమో.

ఇష్టమైన పని చేయడానికి వీల్లేకపోవడం ఎంత తీవ్రమైన మానసికమైన ఒత్తిడో ఆమెకు తెలుసు కాబట్టి వెళ్లి ఉండేదే..నేమో. కొండంత పని కలిగించే ఒత్తిడి కన్నా, ఇష్టమైన పనిని పిసరంతైనా చేయడానికి వీల్లేకపోవడం కొండంత ఒత్తిడి. నోటిఫికేషన్‌ పడకుండానే, దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ లేకుండానే, అసలు ఇష్టమే లేకుండానే వెళ్లిపోయి తప్పనిసరిగా చేయవలసిన ఉద్యోగం స్త్రీకి.. పెళ్లి, భర్త, ఇల్లు! ఆమెకు ఇష్టమైన ఉద్యోగం వేరే చోట ఎక్కడైనా ఉండొచ్చు సిల్వీకి టీవీ స్టేషన్‌లో ఉన్నట్లు. ఈ ‘ముఖ్యం’–‘ఇష్టం’ మధ్య ఆ గోడకూ ఈ గోడకూ షటిల్‌ అవుతూ కింద పడిపోకుండా జీవితాన్ని లాగించేవాళ్లలో స్త్రీలు మాత్రమే ఉంటారని కాదు. జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువే. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అంత సమయాన్ని ఆమెకు ఉదారంగా ఇచ్చేందుకు జీవితమేమీ స్త్రీవాది కాదు.

జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది అంటే, జీవితం మనకు అస్సలు ఇష్టం లేని పనులను చేసుకుంటూ పోగలిగినంత పెద్దది కాదనే. ముఖ్యమైన పని ‘స్టేటస్‌’ను ఇస్తే ఇవ్వొచ్చు. ఇష్టమైన పని ‘సాఫల్యత’ను ఇస్తుంది. ఇంటిముందుకు ఖరీదైన కొత్త కారు రావడం స్టేటస్‌. స్టేటస్‌ లేట్‌ అవుతుంటే ‘ఏంటండీ.. మీరింకా కారే కొనలేదు’ అని ఇంటి ముందుకొచ్చి ఎవ్వరూ అడిగిపోతుండరు. సాఫల్యతకు సమయం మించిపోతుంటేనే.. ‘గడియారం చూసుకున్నావా? జీవితం ఎంతైందో తెలుసా!..’ అని మనసు అదేపనిగా అడగడానికొస్తుంది. సిల్వీపాత్ర ఇటీవలి హాలీవుడ్‌ చిత్రం ‘సిల్వీస్‌ లవ్‌’ లోనిది. సిల్వీ వర్కింగ్‌ ఉమన్‌. ఈ కొత్త సంవత్సరం సిల్వీలందరినీ వారికి ఇష్టమైన ఉద్యోగాలను హాయిగా చేసుకోనివ్వాలి. ఇల్లు సపోర్ట్‌ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. 

మరిన్ని వార్తలు