స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం

6 Aug, 2022 00:24 IST|Sakshi

పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్‌ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది.

‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్‌ ఫార్మసిస్ట్‌. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం.

స్కూల్‌తో మొదలు
కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది.

క్యాన్సర్‌ నుంచి కోలుకుని..
వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను.

అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం.

పచ్చని విస్తరాకులు
పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్‌ అండ్‌ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్‌ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది.

మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్‌ లీఫ్‌ టేబుల్‌’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు.

విదేశాలకూ ఎగుమతి
జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను.

ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్‌ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి.

పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్‌ అండ్‌ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్‌ కారణంగా ఎంత నష్టం
వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను.

– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట
ఫొటోలు: కె.సతీశ్‌కుమార్‌

మరిన్ని వార్తలు