Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు!

7 Sep, 2021 11:41 IST|Sakshi

బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది నిపుణుల మాట. రక్తహీనతను నివారించడంలోనూ.. చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. అదే విధంగా జీర్ణకోశానికి మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరచడంలోనూ బెండకాయల పాత్ర మరువలేనిది.

ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి గనుకే చాలా మంది బెండకాయలతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. ఒకే తరహాలో కాకుండా కూరలు, వేపుళ్లు, పులుసు.. ఇలా రకారకాలుగా ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు భిన్న రుచులను ఆస్వాదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు.

ఎర్ర బెండీలు.. భలే భలే..
ఇక బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా ఆకుపచ్చని రంగులో ఉండే బెండకాయలే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు.. ఎర్రని బెండకాయలు పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మిస్రిలాల్‌ రాజ్‌పుత్‌ ఈ కొత్తరకం సాగుతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వారణాసిలోని వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కిలో ఎర్ర బెండీ గింజలు తీసుకువచ్చిన ఆయన.. 40 రోజుల్లోనే పంట చేతికి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయం గురించి మిస్రిలాల్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ సాధారణమైన ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉండే బెండీలను పండించడం కొత్తగా అనిపిస్తోంది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీపీ సమస్యలు, షుగర్‌ పేషెంట్లు, కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. జూలై మొదటి వారంలో ఎర్రటి బిండీ విత్తనాలను నాటాను. ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండానే వీటిని పండించాను’’ అని రెడ్‌ లేడీఫింగర్‌ గురించి చెప్పుకొచ్చారు.

చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్‌ తాగితే..


                                      సాధారణ బెండకాయలు

అయితే, మామూలు బెండకాయలకంటే వీటి ధర మాత్రం 5- 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని మిస్రీలాల్‌ చెబుతున్నారు. కొన్ని సూపర్‌మార్కెట్లలో ఎర్ర బెండీల ధర అరకేజీకి కనిష్టంగా రూ. 70- 80, గరిష్టంగా.. 300- 400 రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక సాగు విషయానికొస్తే.. ఎకరా స్థలంలో ఒక పంటకు 70- 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. 

సాధారణంగా బెండకాయల్లో ఉండే పోషకాలు
►బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి.
►విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయని ప్రతీతి.

చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే...

మరిన్ని వార్తలు