సేంద్రియ పత్తి సాగుకు సై!

15 Sep, 2020 10:40 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు

విదేశీ పరిశోధన, వాణిజ్య సంస్థలతో ఎం.ఓ.యు.

దేశీ పత్తి రకాలతోనే పొడుగు పింజ రకాల అభివృద్ధి

140 రోజుల పంటకాలం.. బీటీకి దీటైన దిగుబడి.. జన్యుకాలుష్యానికీ చెక్‌

మూడేళ్లలో తెలుగు రైతులకూ దేశీ సేంద్రియ పత్తి విత్తనాల సరఫరా 

‘సాక్షి’తో ఆర్‌.వి.ఎస్‌.కె.వి.వి. వీసీ డా. ఎస్‌. కోటేశ్వరరావు 

దేశీయంగా సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు  జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. మన దేశంలో సేంద్రియ పత్తి సాగులో ముందంజలో ఉన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రమే ఇందుకు కేంద్ర బిందువు కావటం విశేషం. దేశీయ వంగడాలతో కూడిన సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న సంకల్పంతోనే అక్కడ రెండేళ్లుగా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ రూపుదిద్దుకుంటున్నది. గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజె సింధియా కృషి విశ్వ విద్యాలయం (ఆర్‌.వి.ఎస్‌. కె.వి.వి.) పరిధిలోని ఖండవా ప్రాంగణంలో ఇది ఏర్పాటైంది. భారతీయ సంప్రదాయ రకాలపై విస్తృత పరిశోధనలు చేసి మెరుగైన సేంద్రియ పత్తి వంగడాలను అభివృద్ధి చేయటం చాలా కీలకం. ఇందుకోసం విదేశీ సంస్థలతో కలిసి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ఇటీవల ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆర్‌.వి.ఎస్‌.కె.వి.వి. వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్న డా. సూరపనేని కోటేశ్వరరావు పర్యవేక్షణలోనే ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పనిచేస్తుండటం మరో విశేషం. ప్లాంట్‌ బ్రీడర్‌ అయిన డా. రావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పోలుకొండ. ఇప్పుదు మన దేశంలో 90%పైగా విస్తీర్ణంలో సాగవుతున్న హైబ్రిడ్‌ జన్యుమార్పిడి పత్తి (Gossypium  hirsutum, G.bar-ba-den-se) విత్తనాలు అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాలతో కూడిన పత్తి సాగుకు పనికిరావు. అందువల్లనే భారతీయ సంప్రదాయ పత్తి రకాలతోనే మెరుగైన సూటి వంగడాల అభివృద్ధిపై ఇంతకుముందెన్నడూ, ఎక్కడా ఎరుగని రీతిలో సేంద్రియ భూముల్లోనే బ్రీడ్‌ చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నామని డా. రావు ‘సాక్షి’తో చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న సేంద్రియ పత్తిలో మన దేశం వాటా 56 శాతం. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌. ఆ రాష్ట్రంలో దాదాపు లక్ష హెక్టార్లలో 87 వేల మంది చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ పత్తిని సాగు చేస్తున్నారని అంచనా. బీటీ పత్తి రైతులకన్నా వీరికి 30% అదనంగా ఆదాయం వస్తున్నదని గణాంకాలు చెబుతున్నాయి.  సేంద్రియ పత్తి సాగు వ్యాప్తికి ఉన్న ప్రతిబంధకాలలో ముఖ్యమైనది.. సేంద్రియ పత్తి విత్తనాల కొరత. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాల ప్రకారం జన్యుమార్పిడి (సూటి వంగడాలు లేదా హైబ్రిడ్‌) విత్తనాలు సేంద్రియ వ్యవసాయానికి పనికిరావు. హైబ్రిడ్‌ బీటీ పత్తి విత్తనాలు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే తగినంత దిగుబడినిస్తాయి. 

సేంద్రియ పత్తి సాగులో దేశీయ పత్తి రకాల (Gossypium ar-bo-re-um-)కు చెందిన సూటి వంగడాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. సూటి రకాల పత్తి నుంచి తీసే విత్తనాలను రైతులు తిరిగి పొలంలో విత్తుకోవచ్చు. హైబ్రిడ్‌ పత్తి నుంచి తీసిన విత్తనాలు మళ్లీ విత్తుకోవడానికి పనికిరావు. ప్రతి ఏటా కంపెనీ నుంచి రైతులు విధిగా కొనుక్కోవాల్సిందే.  అయితే, దేశీ పత్తి వంగడాలు స్వల్ప విస్తీర్ణంలో సాగవుతున్నా వీటి దూది పింజ పొట్టిగా ఉంటుంది. సంప్రదాయ ఖాదీ ఉత్పత్తులకు ఈ పత్తి సరిపోతుంది. అయితే, సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలంటే.. అంతర్జాతీయంగా సేంద్రియ పత్తి వస్త్రాల తయారీ కంపెనీల యంత్రాలకు అనుగుణంగా ఉండే విధంగా పొడుగు పింజ రకాలను అభివృద్ధి చేయాలి. ఈ సమస్యను సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇప్పటికే అధిగమించిందని డా. రావు వెల్లడించారు. ఎంపీ ప్రభుత్వ మద్దతుతో మన దేశీ పత్తి రకాలతోనే గత నాలుగేళ్లుగా మెరుగైన వంగడాలను రూపొందించామన్నారు. వీటిలో 3 రకాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశీ పత్తి రకాల పింజ 24–26 ఎం.ఎం. ఉండేదని అంటూ.. తాము అభివృద్ధి చేసిన రకాల పింజ 28–33 ఎం.ఎం. వరకు ఉందన్నారు. వీటి పంటకాలం 140 రోజులేనని, అధిక సాంద్రతలో సాగుకు అనువైనేనన్నారు. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల రైతులకు ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. 

అమెరికన్‌ బీటీ పత్తి వంగడాల వల్ల ఈ దేశీ వంగడాలు జన్యు స్వచ్ఛతను కోల్పోవని చెబుతూ.. వీటి క్రోమోజోమ్‌ నంబర్లు వేరు కావటమే ఇందుకు కారణమని వివరించారు. తమ యూనివర్సిటీ పరిధిలోని అనేక ప్రాంగణాల్లోనూ సేంద్రియ సాగును ప్రామాణికంగా చేపట్టామని, ఏటా రెండు పంటలు వేస్తూ విత్తనోత్పత్తి చేస్తున్నామన్నారు. సేంద్రియ పత్తి సాగులో దిగుబడులు బీటీ హైబ్రిడ్లకు దీటుగానే వస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ఈ కృషిని మరింత ముమ్మరం చేయడం కోసమే ఎఫ్‌.ఐ.బి.ఎల్‌. తదితర స్వదేశీ, విదేశీ పరిశోధన, వాణిజ్య, ప్రభుత్వేతర సంస్థలతో ఇటీవల ఎం.ఓ.యు. కుదుర్చుకున్నట్లు వివరించారు. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పించటం కష్టమేమీ కాదన్నారు. నికార్సయిన సేంద్రియ పత్తిని పండించి, తగిన పరిమాణంలో స్థిరంగా సరఫరా చేయగలిగితే ఆకర్షణీయమైన ధర చెల్లించడానికి విదేశీ వస్త్ర వాణిజ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

ఏ రైతు పండించిన సేంద్రియ పత్తితో ఆ వస్త్రాన్ని తయారు చేశారో తెలియజెప్పే (ట్రేసబిలిటీ) వివరాలను వస్త్రాలపై పొందుపరచే విధంగా పటిష్టమైన ఉత్పత్తి గొలుసును ఏర్పాటు చేస్తే.. మన దేశానికి సేంద్రియ పత్తి సాగు రంగంలో భవిష్యత్తులో తిరుగు ఉండబోదని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ పత్తి సాగు చేసే నీటి సదుపాయం ఉన్న రైతులు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతరపంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. రసాయనిక పద్ధతులతో పోల్చితే సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు ఖర్చు 60% వరకు తగ్గుతున్నదని, రైతులకు 30% అదనంగా ఆదాయం వస్తున్నదన్నారు. ఆదాయం మెరుగ్గా ఉందని ఆచరణలో గమనిస్తే.. వాణిజ్య స్థాయిలో పత్తి సాగు చేసే పెద్ద రైతులు కూడా సేంద్రియం వైపు ఆకర్షితులవుతారన్నారు. మరో మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా సేంద్రియ పత్తి వంగడాలను అందించగలుగుతామని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వివరాలకు.. vcrvskvvgwl@gmail.com

మరిన్ని వార్తలు