Mamta Tiwari: ఐఏఎస్‌ అనుకుంది కానీ... పదిహేనేళ్ల తరువాత...

22 Jun, 2022 09:55 IST|Sakshi

జీవితంలో ఎన్నో అనుకుంటాము. వాటిలో కొన్ని మాత్రమే జరుగుతాయి. అనుకున్నవి జరగలేదని బాధపడుతూ అక్కడే ఆగిపోయేవారు కొందరైతే.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన మమతా తివారి తొలుత ఐఏఎస్‌ కావాలనుకుంది.

అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కలెక్టర్‌ కాకపోయినప్పటికీ.. తన ప్రతిభా నైపుణ్యాలు, కలిసొచ్చిన కాలాన్ని ఒడిసిపట్టుకుని సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. 

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌ఘడ్‌కు చెందిన ఓ జడ్జి కుటుంబంలో 1963 మే 14న పుట్టింది మమతా తివారి. తండ్రి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో మమత బాల్యం గడిచింది. ఆ సమయంలో చూడడానికి టీవీలు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీంతో పుస్తకాలతోనే కాలక్షేపమయ్యేది.

ఏడో తరగతి నుంచే మమత తన తండ్రి గ్రంథాలయం నుంచి పుస్తకాలను తెచ్చుకుని చదువుకునేది. బాల్యంలోనే బెంగాలి సాహిత్యం మొత్తం చదివింది. అమృత ప్రీతమ్, ప్రేమ్‌చంద్, గీతాంజలితోపాటు అనేక మంది కొత్త కవుల రచనలను చదివేది. వయసుతోపాటు తన అభిరుచులు మారడంతో నవలలు చదవడమేగాక, గద్యాలను రాయడం ప్రారంభించింది మమత.

ఐఏఎస్‌ అనుకుంది కానీ...
రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసిన మమత.. రెండేళ్లపాటు టీచర్‌గా పనిచేసింది. ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో అంతా ఐఏఎస్‌ లేదా పీహెచ్‌డీ చేయమని ప్రోత్సహించారు. వారి సలహా మేరకు ఐఏఎస్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించింది. కానీ కొంతకాలానికే మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసుకుని భోపాల్‌ వెళ్లింది.     

పదిహేనేళ్ల తరువాత...
పెళ్లయ్యాక పదిహేనేళ్లపాటు గృహిణిగా ఇంటిబాధ్యతలు చూసుకుంటూనే కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంది. మమత భర్త ఓ నిరుపేద  విద్యార్థిని చదివించి ఇంజినీర్‌ని చేశాడు. అతను చూసుకుంటాడన్న నమ్మకంతో కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను పెట్టాడు. కానీ అతను మోసం చేసి వెళ్లిపోయాడు.

దీంతో ఇన్‌స్టిట్యూట్‌ పరిస్థితి ఎలాగా... అనుకుంటోన్న సమయంలో... మమత మరిది మీరు చూసుకోండి వదినా.. అని ప్రోత్సహించడంతో కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలు భుజాన వేసుకుంది. ప్రారంభంలో గృహిణులకు ఉచితం గా కంప్యూటర్‌ కోర్సులు నేర్పించడం ప్రారంభించింది.

తర్వాత దివ్యాంగ పిల్లలకు కోర్సులు నేర్పించేది. ఒకపక్క ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతూనే ‘సమీరా’ అనే మ్యాగజీన్‌లో ప్రచురితమయ్యే సాహిత్యం కంటెంట్‌ను ఎడిట్‌ చేసేది. మరోపక్క తను రాసిన గద్యాలతో ‘వాట్‌ ఈజ్‌ లైఫ్‌ సేయింగ్‌’ పేరిట తొలి పుస్తకాన్ని విడుదల చేసింది.

ఆ తరువాత ఈ పుస్తకం మీద మరికొన్ని సిరీస్‌లు విడుదల చేసింది. ఇప్పటిదాక మమత స్వయంగా రాసి విడుదల చేసిన పుస్తకాలు పదకొండు. ఈ సాహిత్య రచనలకు అనేక పురస్కారాలు, అవార్డులు మమతను వరించాయి. 

సేవా కార్యక్రమాలు..
కంప్యూటర్‌ కోర్సులు నేర్పించడంతోపాటు, సాహిత్య రచనలు ఇంకా ‘న్యూ పర్‌వర్రీష్‌’ పేరిట అనాథ ఆశ్రమం స్థాపించి అనాథ పిల్లలకు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది మమత. కవిత్వం రాయడంతోపాటు, ఆర్టికల్స్‌ను రచిస్తోంది. కొన్నిసార్లు దూరదర్శన్‌లో, ఆల్‌ ఇండియా రేడియోలో కవిత్వాలు చదివి వినిపించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ కవితలు పోస్టు చేస్తుంది. 

‘జీవితం అనేక అవకాశాలు ఇస్తుంది. వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాను. వాటిలో కొన్ని సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని చెబుతోంది మమతా తివారి.  

చదవండి: Chaganti Koteswara Rao: సచిన్‌ ఇల్లు కట్టుకుంటున్న వేళలో..... అలా చేశాడు కాబట్టే!

మరిన్ని వార్తలు