Sita Vasuniya: చేనేత సీతమ్మ

3 Apr, 2021 18:13 IST|Sakshi
వోగ్‌ ఇటాలియా ఫ్యాషన్‌ మ్యాగజీన్‌లో వచ్చిన ఆదివాసీ యువతి సీతా వసూనియా ఫొటో దానా.

ఫ్యాషన్‌ ప్రపంచం ప్యారిస్‌ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్‌’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్‌ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్‌ ఉంది. ‘వోగ్‌ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్‌ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్‌ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో కొత్త షో కేస్‌ డిజైన్‌ అయింది!

సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్‌ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్‌ స్టైల్‌. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్‌ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు.

ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు.  ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్‌ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్‌ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు.

ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌. ధార్‌ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్‌ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్‌ జిల్లాలోని పనల గ్రామ్‌ సీతది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ మిషన్‌ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్‌ జిల్లా ఏక్‌ ఉత్పాద్‌’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్‌ చేసుకున్నారు ఆ  ఫొటోగ్రాఫర్‌. మండులోని రాణి రూపమతి మహల్‌ మ్యూజియం ఫొటో షూట్‌ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది!

‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్‌ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్‌ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ ఆర్ట్, బాగ్‌ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్‌ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్‌ జిల్లా అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ సలోనీ సిదానా.

మరిన్ని వార్తలు