2 యూట్యూబ్‌ చానెళ్లు.. 2 కోట్ల మంది అభిమానులు

28 Jul, 2021 08:47 IST|Sakshi
పూనమ్‌ దేవనాని (ఫైల్‌ ఫోటో)

సోషల్‌ స్టార్‌

మా ఏ కైసే కర్నా: ఆదాయాన్నివండుతోన్న అమ్మ

నిరుపేద కుటుంబం.. పెద్దగా చదువుకోలేదు. పెళ్లై పిల్లలతో గృహిణిగా స్థిరపడిపోయింది. మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించాలనుకుంది. కానీ పిల్లల చదువులు గుర్తొచ్చాయి. దీంతో తనకు వచ్చిన వంటలను వంట రాని వారికి నేర్పిస్తూ రెండు కోట్లమందికి పైగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది పూనమ్‌ దేవనాని. రెండు యూ ట్యూబ్‌ చానళ్లతో చిన్నచిన్న చిట్కాలతో వంటలు ఎలా చేయాలో కోట్ల మందికి నేర్పిస్తూ సోషల్‌ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పర్చుకుంది పూనమ్‌. 

మధ్యప్రదేశ్‌లోని నిరుపేద కుటుంబంలో పుట్టిన పూనమ్‌ దేవనానికి అమ్మన్నా... ఆమె చేసే వంటకాలన్నా ఎంతో ఇష్టం. దీంతో చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడిపేది. పూనమ్‌కి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దీంతో అమ్మ చెప్పినట్లు వింటూ బుద్ధిగా చదువుకునేది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వంటింట్లో అమ్మ చేసే వంటలను గమనించేది. ఆమె వంటలను ఎలా చేస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి పూనమ్‌కు బాగా ఉండేది.

ఈ క్రమంలోనే ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకరోజు న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వంటకం చూసి దానిలో ఉన్నట్లుగానే చేసింది. ఆ వంటకం బాగా రావడంతో ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క కిచెన్‌లో రకరకాల వంటల ప్రయోగాలు చేస్తుండేది. కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం, దానికితోడు మంచి సంబంధం రావడంతో బిఏ చదువుతుండగానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సి వచ్చింది. అందరు గృహిణుల్లాగే సంసారాన్ని చూసుకునేది. 

తొలి ఆదాయం...
పూనమ్‌కి ఇంటి పనులన్నీ అయ్యాక చదువుకోవాలనిపించేది. కానీ పిల్లల చదువులకే ఆదాయం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చదువుకోగలనా అనిపించింది తనకు. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కానీ చేతిలో కనీసం డిగ్రీ సర్టిఫికెట్‌ కూడా లేదు! ఎలా సంపాదిస్తాను? అనుకుంది. అప్పుడే పూనమ్‌కు ‘నాకు వంట చేయడం వచ్చు కదా దానిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు..?’ అనే ఆలోచన వచ్చింది. దాంతో 2004లో కాలనీలో ఖాళీగా ఉన్న కొందరు అమ్మాయిలకు వంటలు ఎలా చేయాలో నేర్పించడం మొదలు పెట్టింది. ఆమె వంటలు నేర్పించే విధానం నచ్చడంతో పూనమ్‌ దగ్గర వంట చేయడం నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

తన స్టూడెంట్స్‌కు వంటల గురించి మరింతగా వివరించేందుకు వివిధ రకాల పుస్తకాలు చదివి మరీ వారడిగే సందేహాలకు సమాధానాలు చెప్పేది. ఇలా రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వంటల క్లాసులు చెబుతూ.. సాయంత్రం పెళ్లిళ్లు, పార్టీలలో ఇచ్చే గిఫ్టులను ప్యాకింగ్‌ చేసేది. అవి అందరికీ నచ్చడంతో ఆమె ఆ పనిని మరింత క్రియేటివ్‌గా చేసేది. పూనమ్‌ వంటల క్లాసులు బాగా పాపులర్‌ అవడంతో ఆమెని వంటల కార్యక్రమాల్లో జడ్జిగా పిలిచేవారు. తన డిగ్రీ సగంలో ఆగిపోయిన కాలేజీకి వంటల క్లాసులు చెప్పడానికి వెళ్లడం విశేషం. అక్కడ కాలేజీ యాజమాన్యం ఇచ్చిన పారితోషికాన్నే పూనమ్‌ తొలి ఆదాయంగా అందుకొంది.

మసాలా కిచెన్‌...
2004లో ప్రారంభమైన పూనమ్‌ వంటల జర్నీ సాఫీగా సాగుతూ వచ్చినా, గంటల తరబడి నిలబడి క్లాసులు చెబుతుండడంతో కాళ్లు వాచి, నొప్పులు రావడం మొదలైంది. దీనికితోడు జార్ఖండ్, ముంబై, నోయిడా, ఢిల్లీ, భోపాల్‌ వంటి ప్రాంతాల నుంచి కూడా తమకు క్లాసులు చెప్పమని అడిగేవారి సంఖ్య పెరుగుతుండడంతో ఇలా లాభం లేదని ‘మసాలా కిచెన్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పడం మొదలు పెట్టింది.

అయితే చాలా కాలం పాటు ఆ చానల్‌కు ఆదాయం ఏమీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. వీడియోలు చేయడం మానలేదు. ఓసారి పూనమ్‌ అప్‌లోడ్‌ చేసిన ‘బ్రెడ్‌తో కేక్‌ తయారీ’ వీడియో బాగా పాపులర్‌ అవడంతో అప్పటి నుంచి యూ ట్యూబ్‌ ఆదాయం రావడం మొదలైంది. ప్రస్తుతం మసాలా కిచెన్‌కు దాదాపు మూడు కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

మా ఏ కైసే కర్నా?
చాలామందికి బయట తినే అలవాటు కావడం లాక్‌డౌన్‌ సమయంలో బయట ఏమీ దొరకకపోవడంతో.. చాలామంది ఇంట్లోనే రకరకాల వంటకాలు చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వంటరాని బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లయిన వారు... ‘అమ్మా ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి?’ అని అడిగే ప్రశ్నలు ఎక్కువగా వినిపించేవి పూనమ్‌కు. దీంతో వీళ్లందరి ప్రశ్నలకు జవాబులు చెప్పేలా ‘మా ఏ కైసే కర్నా’ పేరుతో వంటలకు సంబంధించి మరో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి.. సులభమైన కిచెన్‌ టిప్స్‌ చెప్పడం మొదలు పెట్టింది.. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చానల్‌కు కోటీ ముప్ఫై లక్షలకుపైనే సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు