శివరాత్రికి మౌనవ్రతం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

11 Mar, 2021 11:01 IST|Sakshi

మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును పరమ శివునిపై కేంద్రీకరించాలి.

వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే!

మహిమాన్వితం... మంత్ర జపం
మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ఓం నమః శివాయ!!

చదవండి:
ఉపవాసం రోజు ఏం చేయాలి?

ఆరు రకాల ఉపవాసాలు మంచివట!

మరిన్ని వార్తలు