శివరాత్రి నాడు ఈ మంత్రం ఎంత ఎక్కువ జపిస్తే అంత పుణ్యం

11 Mar, 2021 08:40 IST|Sakshi

పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది శివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి శివుడు లింగరూపం ధరించిన సమయం శివరాత్రి. ఇది మాఘ కృష్ణ చతుర్దశి సమయంలో జరిగింది. కనుకనే మనమంతా ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ప్రపంచంలోని సకల తీర్థాలు.. దేవతాంశలన్నీ శివలింగంలో నిలిచి ఉంటాయి. అందుకే ఆ సమయంలో ప్రతీ భక్తుడూ శివలింగారాధన చేయాలి. శివలింగారాధన సకల పాపాలనూ పోగొడుతుంది. సకల పుణ్యాలను సంపాదించి పెడుతుంది. ఈ జన్మను తరింపజేస్తుంది. మరు జన్మ లేకుండా చేస్తుంది. శాశ్వత శివపదాన్ని అందిస్తుంది. 

శివలింగారాధన అనగానే మనందరికీ అనేక పుణ్యక్షేత్రాలు.. గొప్ప పూజలు.. అభిషేకాలు.. యజ్ఞాలు తలంపుకు వస్తాయి. శివార్చన అనేది కేవలం ఆడంబరంతో..అధికారంతో చేసేది కాదు. ఐశ్వర్యంతో సాధ్యమయ్యేది కాదు. భక్తి ప్రధానమైనది. శివరాత్రి సమయంలో ఎనిమిది జాములలో వీలుకాకపోతే ఆరు జాములలో శివార్చన చేయాలని శాస్త్రవచనం. (ఒకరోజుకు ఎనిమిది జాములు. పగలు నాలుగు జాములు.. రాత్రి నాలుగు జాములు. మన కలగణనలో నాలుగు గంటలు) 
శివరాత్రి ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయాలి. సత్కాలక్షేపం చేస్తూ చేసేదే జాగరణ. మనసంతా మహాదేవుని నింపుకుని శివగాథలు వింటూ.. శివుని మహిమలను కీర్తిస్తూ.. శివనామం పలుకుతూ.. శివలింగాన్ని అభిషేకిస్తూ..శివార్చన చేస్తూ.. శివునికి నమస్కరిస్తూ..శివునికే తనువు, మనసును సమర్పించి సర్వం శివునిలో లయం చేయగలిగితేనే శివానుగ్రహం కలిగినట్లు. 

శివరాత్రి రోజున మనం చేయాల్సిన కార్యం ఇదే. అయితే సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది.

ఇవేవీ లేకపోయినా కేవలం శుద్ధజలంతో అభిషేకించినా శివుడు అమిత ప్రసన్నుడౌతాడు. శివార్చనకు తామరపువ్వు, జిల్లేడు పూలు, నల్లకలువలు చాలా ముఖ్యం. ఇవి తెచ్చే స్తోమత లేకపోతే దవనపత్రి, ఉసిరి పత్రి, మారేడు పత్రి వీటితోనైనా పూజించవచ్చు. 
పూజ కూడా కుదరని భక్తుడి చేతిలో శివనామస్మరణమనే ఆయుధం ఎలాగూ ఉంది. ‘ఓం నమఃశివాయ‘ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు. సమస్త పాపాలు తొలగిపోతాయి. శివరాత్రికి శివపంచాక్షరీ జపం చేసిన భక్తునికి ఎటువంటి పాపాలూ అంటవు. శివనామం భవసాగరం నుంచి తరింపజేసే నావ. ఏడేడు జన్మల పాపాలను క్షణంలో పోగొట్టే దివ్యమంత్రం. సకలదోషాలను..భూతప్రేతాలను పారద్రోలే పరమ మంత్రం. మహాదేవ అన్నా..శంభు అన్నా అన్నీ సదాశివుని అనుగ్రహాన్ని కలిగించేవే. శివనామోచ్చరణ ఫలితం అంతా ఇంతా కాదు. 
 శివ నామాన్ని ఒక్కసారి కీర్తించినంత మాత్రం చేత మానవులు ఏడు జన్మలలో ఎప్పుడెప్పుడు చేసి ఉన్న ఏ పాపాలనుండి అయినా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు. బుద్ధిమంతుడు ‘శి–వ’ అనే ఈ రెండక్షరాలనూ సదా ఉచ్చరిస్తూ సంసార సాగరాన్ని అవలీలగా దాటేసి, శివ సాయుజ్యం పొంది తీరుతాడు.

ఇలా శివరాత్రి సమయంలో శివపంచాక్షరీ మంత్రం ఎంత ఎక్కువ జపిస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కనుక శివరాత్రి వ్రతాన్ని ఆలయంలోనూ.. గృహంలోనూ.. ఇవి కుదరని వారు మనస్సులోనైనా భక్తితో జరుపుకుంటే వారు శివానుగ్రహభాగ్యులే. శివుడు వారికనుగ్రహించిన స్తోమతను బట్టి వారు శివపూజను ఆచరించుకోవచ్చు. ఇందులో తరతమభేదాలేమీ లేవు. భక్తి ముఖ్యం. భావన ముఖ్యం. శివునిపై మనసును నిలపడం ముఖ్యం. కనుక ఈ శివరాత్రిన శివునిపై భక్తిని నిలిపి చరమైన ఈ జీవితానికి స్థిరమైన లక్ష్యాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుందాం. శివానుగ్రహం పొందుదాం.

సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది.

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ
శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే 
శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ
శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్‌
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ
శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే 
శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ
శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్‌

 శివుడు అభిషేక ప్రియుడు. కనుక ఆ రోజు పరమేశ్వరునికి ఒక చెంబెడు నీటితో అభిషేకించి.. మారేడు పత్రిని శివలింగంపై ఉంచి ఒక్క చిరుదీపాన్ని ఏ శివాలయంలో వెలిగించినా మహాదేవుడు అమితప్రీతిపాత్రుడై భక్తులను అనుగ్రహిస్తాడు. శివరాత్రి సమయంలో స్థిరలింగం, చరలింగం, మృత్తికా లింగం, బాణలింగం, స్ఫటిక లింగం ఇలా ఏ లోహంతోనైనా తయారు చేసిన శివలింగాన్ని పూజిస్తే ఆ జన్మకు ఆ ఒక్క శివరాత్రితోనే సార్థకత చేకూరుతుంది. సామాన్య భక్తులు చక్కగా మంచి పుట్టమట్టి..బంకమట్టిని తెచ్చుకొని శివలింగం తయారు చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పంచదార వీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు రుద్రనమకచమకాలనే వేదమంత్రాలను చెప్తూ చేసినా.. ఇవేవీ రానివారు పంచాక్షరీ మంత్రం పలుకుతూ చేసినా ఒకే ఫలితం కలుగుతుందని శివుడు పార్వతికి చెప్పాడు.  
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆధ్యాత్మిక రచయిత

మరిన్ని వార్తలు