నదీ తీరాన కొలువుదీరిన అష్ట వినాయకులు!

22 Aug, 2020 14:53 IST|Sakshi

విద్యకు , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు. ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజలు అందుకునేది విఘ్నాలను తొలగించే ఆ బొజ్జ గణపయ్యే. అలాంటి ఆది దేవుడు ‘విఘ్నేశాధిపత్యం’ దక్కించుకున్న భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేష్‌ చతుర్థిగా జరుపుకొంటాం. చిన్నా, పెద్దా భక్తులందరికీ ఎంతో ఇష్టమైన లంబోదరుడి పండుగ అంటే సంబరాలు మామూలుగా ఉండవు. వాడవాడలా గణనాథులను కొలువుదీర్చి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగే గణేషుని ఉత్సవాలు ముంబైలో మరింత అట్టహాసంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. 

అయితే ఈసారి మహమ్మారి కరోనా కారణంగా మునుపటిలా వేడుకలు నిర్వహించే వెసలుబాటు లేకుండా పోయినా.. ఉన్నంతలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గణపతిని పూజించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొలువుదీరిన తాత్కాలిక మంటపాలలో లంబోదరుడి ప్రతిష్టాపన మొదలైంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజుకే పరిమితం గాకుండా మహారాష్ట్రలో ఏడాదంతా పూజలు అందుకునే స్వయంభూ విఘ్నేశ్వరాలయాల(అష్ట వినాయకయాత్ర) గురించి కొన్ని వివరాలు..

1. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం 
ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న సిద్ధాటెక్‌ పట్టణంలో ఉంది. గజాననుడు ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకగా కొలువుదీరాడు. సాధారణంగా అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. అయితే సిద్ధాటెక్‌లో గల ఈ దేవాలయంలో మాత్రం లంబోదరుడి తొండం కుడివైపునకు తిరిగి కనపడుతుంది. దీనితో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది. 

2. శ్రీ మయూరేశ్వర్‌ మందిర్‌/శ్రీ మోరేశ్వర్‌ టెంపుల్‌
పుణె జిల్లాలోని మోర్గావ్‌లో ఉంది ఈ ఆలయం. పుణె నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నదీ తీరంలో కొలువుదీరిన అష్టవినాయక యాత్ర టూర్‌లో ఇది మొదటిది అని చెప్పవచ్చు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

3. బల్లాలేశ్వర దేవాలయం
రాయ్‌గఢ్‌లో జిల్లాలోని పాలి గ్రామంలో కలదు. రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్‌గడ్‌ కోట, అంబా నదికి మధ్య కొలువుదీరిన ఈ ఆలయంలో గణనాథుడు రాతి సింహానం మీద ఆసీనుడైన బల్లాలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. గజాననుడి అపర భక్తుడైన బల్లాల్‌ పేరు మీదుగా దీనికి బల్లాలేశ్వర ఆలయం అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పాలిలో సంపన్నుడైన వ్యాపారవేత్త కళ్యాణ్‌,  తన భార్య ఇందుమతి, కొడుకు బల్లాల్‌తో కలిసి నివసించేవాడు. 

ఆ ఊరిలో పిల్లలంతా రాళ్లను దేవతా మూర్తులుగా భావిస్తూ పూజలు చేస్తూ ఆటలాడుకునేవారు. అలా ఓ రోజు గ్రామ శివారులో ఓ పెద్ద రాయిని చూసిన బల్లాల్‌.. దానిని గణేషుడిగా పేర్కొంటూ పూజలు చేయడం ప్రారంభించాడు. ఆకలిదప్పులు మరచి పిల్లలంతా గణనాథుని స్మరణలో మునిగిపోయి రేయింబవళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో పిల్లల జాడ తెలియక కంగారుపడిన పెద్దలంతా అకకడి చేరుకుని, దీనికంతటికి బల్లాల్‌ కారణమంటూ తిట్టిపోస్తూ తండ్రి కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కళ్యాణ్‌ కొడుకు లాక్కొచ్చి చెట్టుకట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతేగాక గణేషుడిగా పూజలు అందుకున్న రాయిని పగులగొట్టాడు. నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అంటూ దేవుడిని తిడుతూ బల్లాల్‌ను అక్కడే వదిలి వెళ్లిపోతాడు. తన ఇష్టదైవాన్ని దూషించడంతో తండ్రిపై కోపగించుకున్న బల్లాల్‌ అతడి కళ్లు పోవాలని శపిస్తాడు.

ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా అక్కడ ఉండిపోయి లంబోదరుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. బల్లాల్‌ బాధను చూడలేక సాధువు రూపంలో వచ్చిన గజాననుడు అతడి గాయాలన్నింటి మాన్పి, ఏం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. ఇందుకు ఆ బాలుడు.. ‘‘నువ్వు ఇక్కడే కొలువుదీరి.. శరణుజొచ్చిన వారిని కాపాడు తండ్రి’’అని కోరతాడు. బల్లాల్‌ కోరికను మన్నించిన పార్వతీ పుత్రుడు అతడిని ఆలింగనం చేసుకుని, నా పేరు ముందు నీ పేరును జోడించి బల్లాలేశ్వరుడిగా కొలువుదీరతాను అని చెబుతాడు. లంబోదరుడు నిజంగా దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడని అనికలిసి ఈ దేవాలయాన్ని మోరేశ్వర్‌ విఠల్‌ సింద్‌కర్‌ 1640లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 

4. గిరిజాత్మజ దేవాలయం 
పుణె జిల్లాలోని లెన్యాద్రి(గణేష్‌ పహర్‌ లేదా సులేమాన్‌ గుహలు)లో ఉంది. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీ దేవి పుత్రుడైన(గిరిజ ఆత్మ నుంచి వచ్చినవాడు) వినాయకుడిని కేవ్‌ నంబర్‌ 7 వద్ద దర్శించుకోవచ్చు. ఇందుకోసం సుమారు 300 మెట్లు ఎక్కాలి. కాస్త కష్టంతో కూడుకున్నదైనా పైకి వెళ్లినట్లయితే లంబోదరుడితో పాటు కొండ చుట్టుపక్కల గల ప్రకృతి అందాలన వీక్షించవచ్చు.

5. చింతామణి దేవాలయం 
చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. పుణెకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి(ఆభరణం) రూపం కలిగి ఉంటాడు. అష్టవినాయక ఆలయాల్లో ఇది పెద్దది.  

6. విఘ్నేశ్వర దేవాలయం
పుణెకు 85 కిలోమీటర్ల దూరంలో గల ఓజార్ వద్ద కూకడి నది తీరాన గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరాన్ని బంగారంతో తయారు చేశారు. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగావ్ మరియు జున్నార్ ల నుండి ఇది 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలో​ వెళ్లవచ్చు.

7. మహాగణపతి దేవాలయం
పుణె జిల్లాలోని రాజన్‌గావ్‌లో కలదు. మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు.

8. వరదావినాయక దేవాలయం
మహాడ్ గ్రామంలో వరదా వినాయక దేవాలయం కలదు. పరిసరాల్లో గల ఒక సరస్సు ఒడ్డున లభించిన విగ్రహాన్ని దేవాలయం లోపల ప్రతిష్టించారు. 1725లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పీష్వా పాలకులు దీనిని పునరుద్ధరించారు. 1892 నుంచి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. స్వయంభూ వినాయకుడితో పాటు మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగం కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. 

ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాల వలె అష్ఠ గణపతులు కూడా పురాతనమైనవి. గణేష, ముద్గాల పురాణాలలో వీటి ప్రస్తావన ఉంది. ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే క్షేత్రాలుగా భాసిల్లుతున్న ఈ ఆలయాలను కరోనా అంతమైన తర్వాత హాయిగా కుటుంబంతో కలిసి దర్శించి తరించండి.

మరిన్ని వార్తలు