Maharashtra: అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజారమ్మ.. అమ్మవారే స్వయంగా!

30 Nov, 2022 12:29 IST|Sakshi

పూజారమ్మ 

సరస్వతీ పరమేశ్వర్‌ బాగావలే... అతి సాధారణ మహిళ. సమాజం స్త్రీ కోసమే నిర్మించిన ఆంక్షల వలయాన్ని ఛేదించింది. ఇందుకోసం ఆమె పోరాటం చేయలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. చేపట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజాదికాలు నిర్వర్తిస్తోంది. అమ్మ పిలిపించుకుంది 

సరస్వతి పరమేశ్వర్‌ వయసు 36. ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఆలయం ప్రాంగణంలోనే జీవిస్తోంది. రోజూ ఉదయాన్నే ఆలయం ఆవరణ  శుభ్రం చేయడం, స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆరోగ్యభవాని విగ్రహంతో సహా ఆలయం లోపల శుభ్రం చేయడం, విగ్రహాలను అలంకరించడం, ఆ తర్వాత వంట చేసుకుని వచ్చి ఆరగింపు సేవ చేయడంతో శుభోదయ సేవలు పూర్తవుతాయి.

సాయంత్రం ఐదు గంటలకు మరోసారి పూజ చేసి, చపాతీలు చేసుకుని వచ్చి పటిక బెల్లంతో నివేదన చేస్తానని చెప్పింది. ‘‘నాలుగేళ్ల కిందట కొందరు ఊరి పెద్దలు వచ్చి ఆలయంలో పూజాదికాలు ఎవరు చేస్తారని అడిగారు. అప్పటివరకు పూజలు చేస్తున్న పూజారి బాగా వృద్ధులయ్యారు. వాళ్ల పిల్లలు వచ్చి తాము నివసించే పట్టణానికి తీసుకెళ్లిపోయారు.

ఇక  ఆయన కుటుంబం నుంచి పూజ చేయడానికి ఎవరూ లేరు. దాంతో మరొకరిని నియమించడానికి అందరినీ అడిగారు. అప్పుడు నేను ఆడవాళ్లు కూడా రావచ్చా అని అడిగాను. ఆ తర్వాత వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ‘అమ్మవారే స్వయంగా నిన్ను పిలిపించుకుంటుందేమో...’ అని నన్ను పూజారిగా నియమించారు. 

భూగర్భంలో మరో ఆలయం 
మరాఠీ యూ ట్యూబర్‌లు వచ్చి ఈ ఆలయాన్ని వీడియోలు తీసుకుంటున్నారు. ఈ ఆలయంలో ఈ మాత కింద భూగర్భంలో మరో గుడి ఉంది. ఇక్కడ ఉన్న జాలీ తొలగించి మెట్ల నుంచి కిందకు వెళ్తే కనిపిస్తుంది. భూగర్భంలో ఉన్న ప్రతిమలు ఇక్కడ కనిపిస్తాయి చూడండి’’ అంటూ సీసీ టీవీ చూపించింది.

‘భక్తులు కిందకు వెళ్లి చూడవచ్చు’ అని మెష్‌ అమర్చిన ఉడెన్‌ ఫ్రేమ్‌ను తొలగించింది. కిందకు దిగితే అక్కడ మరో చిన్న ఆలయమే ఉంది. అందులో పూజాదికాలు కూడా సరస్వతి చేతుల మీదుగానే జరుగుతాయి. తనకు సాధ్యం కాని రోజుల్లో తన కూతురు పూజ చేస్తున్నట్లు చెప్పిందామె. 

ఇక్కడ ఏ ఉద్యమమూ జరగలేదు, కానీ ఒక అవసరం సమాజపు ఆధిపత్య గిరిగీతను తుడిచివేసింది. సరస్వతి పూజ చేస్తున్న ఆలయం మహారాష్ట్ర, బీడ్‌ జిల్లాలో ఉంది. మనకు సులభంగా తెలియాలంటే... ద్వాదశ జ్యోతిర్లింగం పర్లి వైద్యనాథ్‌ ఆలయం ఆధారంగా చెప్పుకోవాలి. వైద్యనాథ ఆలయం ఉన్న పర్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చాందాపూర్‌ గ్రామంలో ఉంది సరస్వతి చేతుల మీదుగా పూజలందుకుంటున్న ఆరోగ్యభవాని ఆలయం. 
– వాకా మంజులారెడ్డి 

చదవండి: యాకమ్మ.. ఒక గొప్ప వెలుగు

మరిన్ని వార్తలు