Maalavika Manoj: ఏఆర్‌ రెహమాన్‌ మెచ్చుకున్న సింగర్‌.. ఎవరామె?

15 Apr, 2022 11:43 IST|Sakshi

అక్కడే విని...అప్పుడే మరిచిపోయేట్లు ఉండకూడదు. అది నీడలా మన వెంటపడాలి’ అని అనడమే కాదు నిరూపించింది మాలి

‘కొందరు కళాకారుల అంకితభావం వ్యక్తిత్వంలోనే కాదు వారి సృజనాత్మకప్రక్రియలోనూ బలంగా కనిపిస్తుంది. అది వారిని మరింత పైకి తీసుకెళుతుంది. అలాంటి వారిలో ఒకరు...మాళవిక మనోజ్‌’ అని ఏఆర్‌ రెహమాన్‌ మెచ్చుకోవడం తనకు లభించిన అత్యున్నత పురస్కారం అంటుంది మాళవిక మనోజ్‌. చెన్నైలోని మలియాళి దంపతులకు జన్మించిన మాళవిక మనోజ్‌కు సంగీతం అనేది బాల్యనేస్తం. తల్లిదండ్రులు సంగీతకారులు కానప్పటికీ సంగీతప్రేమికులు. పాత, కొత్త, స్వదేశ, పరదేశ...అనే తేడా లేకుండా ఆ ఇంట్లో సంగీతం నిరంతరం ప్రతిధ్వనించేది.

అయిదు సంవత్సరాల వయసులో మాళవికను స్విమ్మింగ్‌ క్లాస్‌లతో పాటు పియానో, భరతనాట్యం, డ్రాయింగ్‌ క్లాస్‌లకు పంపేవారు తల్లిదండ్రులు. కొంతకాలం తరువాత  పియానో క్లాస్‌లకు తప్ప మిగిలిన క్లాసులకు బంక్‌ కొట్టేది మాళవిక. పదహారు సంవత్సరాల వయసులో పాటలు రాయడం మ్యూజిక్‌ కంపోజింగ్‌ చేయడం మొదలు పెట్టింది. పదిహేడు సంవత్సరాల వయసులో గిటార్‌ వాయించడం నేర్చుకుంది,

ఆమె ఫస్ట్‌ సింగింగ్‌ పర్ఫామెన్స్‌ గురించి చెప్పుకోవాలంటే...
పన్నెండు సంవత్సరాల వయసులో ఒక విందులో ప్రఖ్యాత అమెరికన్‌ జాజ్‌ సింగర్‌ ఎల్లా ఫిజ్‌జెరల్డ్‌ పాట పాడింది. విశేషం ఏమిటంటే ఆ పాటను విందుకు అన్వయించి పాడడం ద్వారా ‘శబ్బాష్‌’ అనిపించుకుంది మాళవిక.

చెన్నైలో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బిబిఏ) చేసిన మాళవిక పై చదువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైకి వెళ్లింది. మంచి ఉద్యోగం వెదుక్కోవడానికి కాదు.. మ్యూజిక్‌లో కెరీర్‌ వెదుక్కోవడానికి!. బేస్‌–ఇన్‌–బ్రిడ్జి అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరడం ద్వారా తొలి అడుగువేసింది. తన స్టేజ్‌ నేమ్‌ ‘మాలి’ అయింది. డెబ్యూ ఆల్బమ్‌ ‘డిసెప్టివ్‌’తో వావ్‌ అనిపించింది. ఏఆర్‌ రెహమాన్‌లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేసింది.

యూరో ఇండీ మ్యూజిక్‌చార్ట్‌లో తన పాట ఫస్ట్‌ ర్యాంకులో నిలిచింది. తనకు పాప్‌గర్ల్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ సంగీతంలో రకరకాల జానర్స్‌ వినడం, వాటి నుంచి ఇన్‌స్పైర్‌ కావడం అంటే ఇష్టం. ‘అతిగా ఆలోచించడం అనేది నా బలం, నా బలహీనత. ఆ ఆలోచనల్లో నుంచే సంగీతం పుడుతుంది’ అంటున్న 28 సంవత్సరాల మాళవిక మనోజ్, సంగీతంలో మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటోంది.
  

మరిన్ని వార్తలు