నడిచే పుస్తకాలయాలు

7 Apr, 2021 15:05 IST|Sakshi

భారతదేశాన్ని చదవనిద్దాం

పుస్తకాలు ఒక సంప్రదాయానికి ప్రతీకలు. ఒక సంస్కృతిని మరొక తరానికి అందించే వారధులు. అటువంటి పుస్తక పఠనం తగ్గిపోతుండటంతో, తిరిగి పుస్తక పఠనానికి వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన కొందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు కలిసి ‘లెట్స్‌ రీడ్‌ ఇండియా’ అనే ఒక ఉద్యమం ప్రారంభించి, పుస్తకాల లైబ్రరీని ఇంటింటికీ తీసుకురావటం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ కొద్ది నెలల క్రితం ప్రారంభమైంది. అన్ని విభాగాలకు చెందిన పది లక్షల పుస్తకాలతో వీరు ఈ ఉద్యమం ప్రారంభించారు. ‘మా ప్రయత్నం వృథా పోలేదు. మంచి ఫలితాలు వస్తున్నాయి. వాట్సాప్, సోషల్‌ మీడియా తరాన్ని వెనుకకు మళ్లించి, పుస్తకాలు చదివించాలనేదే మా లక్ష్యం. వారు పుస్తకాలు చదివి, మన సంస్కృతి ని అర్థం చేసుకోవాలి. పుస్తకాల ద్వారా వారిని  ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అంటున్నారు ఈ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రఫుల్ల వాంఖేడే. 

ఇప్పుడు ఈ పుస్తకాలు దూర ప్రాంతాలకు, ఎటువంటి సౌకర్యాలు లేని ప్రదేశాలకు కూడా చేరుతున్నాయి. ‘‘మా పుస్తకాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. మాకు మూడు మొబైల్‌ లైబ్రరీలు ఉన్నాయి. ప్రజలు మా దగ్గర నుంచి పుస్తకాలను ఉచితంగా, ఒక వారం వారి దగ్గర ఉంచుకునేలా తీసుకోవచ్చు. అయితే  పుస్తకం చదివినవారు తప్పనిసరిగా ఆ పుస్తకం గురించి 300 పదాలలో ఒక రివ్యూ రాసి ఇవ్వాలి. అప్పుడే రెండో పుస్తకం ఇస్తామన్నది షరతు. లేదంటే వారు ఒక పుస్తకం తీసుకుని, ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. అప్పుడు మా లక్ష్యం నెరవేరదు’’ అంటున్నారు వాంఖేడే.

పుస్తకాలు చదవాలనుకునేవారు సోషల్‌ మీడియా సైట్‌ లేదా వెబ్‌సైట్‌ యాప్‌ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది. జిపియస్‌ ద్వారా మొబైల్‌ లైబ్రరీ ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే ప్రతి పుస్తకానికీ క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంది. గుర్తించిన ప్రదేశాలకు ప్రతివారం మొబైల్‌ లైబ్రరీ వస్తుంటుంది. మొదట్లో ‘లెట్స్‌ రీడ్‌ ఇండియా’ సంస్థ మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్‌లలో ఈ లైబ్రరీని ప్రారంభించాలనుకున్నా, కరోనా మహమ్మారి కారణంగా పరిధి తగ్గించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో దృష్టి కేంద్రీకరించారు. రానున్న రెండు సంవత్సరాలలో చిన్నచిన్న గ్రామాల ప్రజలకు కూడా పుస్తకాలు చేరవేయాలనే సంకల్పంతో ఉన్నారు.  ‘మహారాష్ట్రలో విస్తృతి పెంచిన తరవాత, దేశంలోని మిగతా ప్రదేశాల మీద మా దృష్టి కేంద్రీకరిస్తాం’’ అంటున్నారు వాంఖేడే.

‘‘మేం పుస్తకాలు మాత్రమే అందచేయట్లేదు. చాలామందికి ఎటువంటి పుస్తకాలు చదవాలనే విషయంలో సందిగ్ధత ఉంటుంది. వారికి ఉపయోగపడే పుస్తకాలు చదవగలిగితే, అది వారి వృత్తి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ఎటువంటి పుస్తకాలు చదవాలో కూడా సూచిస్తాం’’ అంటారు వాంఖేడే. ఈ సంస్థ త్వరలోనే యూట్యూబ్‌ చానల్‌ కూడా ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో ప్రముఖ రచయితల ఉపన్యాసాలు, ఇంటర్వూ్యలు, రివ్యూలు ప్లే చేస్తారు. పుస్తకం నిలబడాలి, పుస్తకం ద్వారా అక్షరాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ సంపదగా రానున్న తరాలకు అందాలి.

మరిన్ని వార్తలు