ఇరవై ఒకటో శతాబ్దపు టీచర్‌

5 Dec, 2020 08:09 IST|Sakshi

మనసున్న టీచర్‌

రంజిత్‌ సిన్హ్‌ దిశాలె...ఇంజనీర్‌ కాలేకపోయిన ఒక ఉపాధ్యాయుడు. విద్యాబోధనలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు. పాఠ్య పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌తో అనుసంధానం చేశారు. విద్యార్థుల మాతృభాషలో వీడియోలు, ఆడియోలు తెచ్చారు... బాలికల హాజరును నూరు శాతానికి పెంచారు. ఈ పద్ధతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఆ తర్వాత... కేంద్రప్రభుత్వం కూడా. ఈ సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సిన్హ్‌... గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ అవార్డు గెలుచుకున్నారు.

మహారాష్ట్ర, షోలాపూర్‌ జిల్లా, పరేటి వాడీ అనే చిన్న గ్రామం. అందులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల లో ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్‌ దిశాలె. ఆయన గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ 2020 పురస్కారానికి ఎంపికయ్యారు. 140 దేశాల నుంచి వచ్చిన పన్నెండు వేల ఎంట్రీలలో రంజిత్‌ విజేతగా నిలిచారు. గురువారం నాడు లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్‌ నటుడు, ప్రసారకర్త స్టీఫెన్‌ ఫ్రై అవార్డు ప్రకటించిన వెంటనే రంజిత్‌ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. విద్యాబోధనలో సాంకేతికతను జోడించి విద్యార్థులను మంచి విద్యనందించిందుకు గాను రంజిత్‌కి ఈ గౌరవం లభించింది.

బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది!
అతడు పని చేసే పాఠశాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండేది. వాళ్లను బడికి రప్పించాలంటే పాఠాలతో వాళ్లను అలరించడమే మార్గం అనుకున్నారాయన. పాఠాలను దృశ్య, శ్రవణ విధానంలో రికార్డు చేశారు. పాఠ్యపుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యం కల్పించడం ద్వారా పిల్లలందరికీ పాఠాలు చేరేటట్లు చేశారు. దాంతో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎనభై ఐదు శాతం మంది ‘ఏ’ గ్రేడ్‌లో పాసయ్యారు. రెండు శాతం ఉన్న బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఇప్పుడు బాల్య వివాహాల్లేవు. రంజిత్‌ సాధించిన ప్రగతిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రం మొత్తం క్యూఆర్‌ కోడ్‌ సాంకేతికతను దత్తత చేసుకుంది.

ఆ తర్వాత భారత విద్యాశాఖ ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) ద్వారా ఈ విధానాన్ని అవలంబించింది. ఈ సాంకేతిక విప్లవం ఇంతటితో ఆగిపోలేదు. దేశం సరిహద్దులు దాటింది. పాకిస్థాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యూఎస్, నార్త్‌ కొరియా కూడా అనుసరించాయి. మొత్తం 19 వేల మంది విద్యార్థులను అనుసంధానం చేశారు రంజిత్‌ సిన్హ్‌. ఆయన అందుకుంటున్న గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ వెనుక ఇంతటి కఠోరదీక్ష ఉంది, అంతకు మించిన అంకిత భావమూ ఉంది. (చదవండి: ట్రావెలింగ్‌ టీచర్‌)

మార్చే శక్తి టీచర్‌దే!
‘‘రంజిత్‌ సింగ్‌ వంటి ఉపాధ్యాయులు ఉంటే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది. మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది’’ అని యునెస్కో విద్యావిభాగపు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్టెఫానియా గియాన్ని ప్రశంసించారు. రంజిత్‌ మాత్రం... ‘‘ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. కోవిడ్‌ మహమ్మారి విద్యారంగాన్ని కూడా కుదిపేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని నూటికి నూరుశాతం నిర్వర్తించారు.

విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన విద్యాహక్కును సమర్థంగా అందించారు. కరోనా పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపకుండా కాపాడగలిగారు’’ అన్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ సిన్హ్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఇరవయ్యో శతాబ్దపు ఉపాధ్యాయుడిని, నేను బోధిస్తున్నది 21వ శతాబ్దపు పౌరులకు. మనం పాఠాలు చెప్పే విధానం కూడా మారాలి. సిలబస్‌ పందొమ్మిదవ శతాబ్దంలో, సాంకేతిక విధానం 18వ శతాబ్దంలోనే ఉండిపోయింది. అలా ఉండిపోకూడదు. అందుకే కొత్త సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నాను’’ అన్నారు.

అందరూ విజేతలే! 
ఈ ఎంపిక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన పదిమందిలో రంజిత్‌ విజేత... కాగా మిగిలిన తొమ్మిది మంది కూడా తక్కువవారేమీ కాదు. అంకితభావంతో పని చేసిన వారేనంటూ... వర్కీ ఫౌండేషన్‌ చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ ఇచ్చే బహుమతిలో సగం డబ్బును మిగిలిన తొమ్మిదిమందికీ పంచుతున్నట్లు ప్రకటించారు రంజిత్‌. అలాగే తన సగభాగం డబ్బును మూలనిధిగా ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా మారుస్తానని కూడా చెప్పారు. ఈ నిర్ణయంతో రంజిత్‌ మరోసారి ప్రపంచం ప్రశంసలు అందుకున్నారు. ఈ పురస్కారానికి నగదు బహుమతి పది లక్షలు డాలర్లు (ఏడుకోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా). అందులో సగం అంటే ఐదు లక్షల డాలర్లను తొమ్మిది మందికి ఒక్కొక్కరికీ యాభై ఐదు వేల డాలర్ల చొప్పున పంచుతారు.                   

ఇంతకు ముందు...
రంజిత్‌ సిన్హ్‌ దిశాలె 2016లో కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇన్నోవేటివ్‌ రీసెర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’అవార్డు అందుకున్నారు. 2018లో నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్స్‌ ఇన్నోవేటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, 2019లో గ్లోబల్‌ పీస్‌ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌తోపాటు పారిస్‌లో మైక్రోసాఫ్ట్స్‌ ఎడ్యుకేషన్‌ ఎక్సేంజ్‌ ఈవెంట్‌లో పురస్కారాన్ని అందుకున్నారు.

మరిన్ని వార్తలు