Maitri Patel: ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్‌ పైలట్‌.. ఇంకా

16 Sep, 2021 10:19 IST|Sakshi

పైలట్‌ పటేల్‌! 

19 ఏళ్లకే ఇండియన్‌ తొలి కమర్షియల్‌ పైలట్‌

ఆకాశంలో విమానం ఎగురుతున్న శబ్దం వచ్చిందంటే చాలు ఇంట్లో ఏ మూలన ఉన్నా.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి విమానం కనపడినంతసేపూ గాలిలో చేతులూపుతూ సంతోషపడుతుంటారు చిన్నపిల్లలు. గుజరాత్‌కు చెందిన మైత్రి పటేల్‌ కూడా తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తొలిసారి విమానాన్ని చూసింది. ‘అబ్బ! బలే ఉంది! ఆకాశంలో ఎంత బాగా ఎగురుతుందో అని సంబరపడడమేగాక, తను కూడా పెద్దయ్యాక విమానం నడపాలని అప్పుడే నిర్ణయించుకుంది. అనాటి కలను ఈరోజు నిజం చేసుకుని, దేశంలోనే తొలి అతి పిన్న కమర్షియల్‌ పైలట్‌గా నిలిచింది. 

సూరత్‌లోని ఓల్‌పాడ్‌ నగరానికి చెందిన మైత్రి తండ్రి కాంతీలాల్‌ వ్యవసాయం చేస్తున్నారు. తల్లి రేఖ బెన్‌ సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగంలో సివిల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతుర్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న తపనతో ప్రైవేటు స్కూల్లో చేర్చి  ఇంగ్లీష్‌ మీడియంలో చదివించారు కాంతీలాల్‌ దంపతులు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్కూల్‌ విద్య అయ్యాక.. ఇంటర్మీడియట్‌లో ఉండగా మైత్రిని ముంబైలోని స్కైలైన్‌ ఏవియేషన్‌ క్లబ్‌లో చేర్పించారు.

అక్కడ కెప్టెన్‌ ఏడీ మాణిక్‌ మైత్రికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. ఒకపక్క ఇంటరీ్మడియట్‌ చదువుతూనే పైలట్‌కు సంబంధించిన గ్రౌండ్‌ శిక్షణను పూర్తిచేసింది. శని, ఆదివారాల్లో ఎంట్రన్స్‌ పరీక్షకు సన్నద్ధమవుతూ అమెరికాలో పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకునేందుకు అర్హత సాధించింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ అగ్రరాజ్యంలో పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకోవడానికి కావలసినంత డబ్బు సమకూరలేదు. 

చిన్నప్పటి నుంచి తమ కూతుర్ని పైలట్‌ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రోత్సహిస్తున్న కాంతీలాల్‌... తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలాన్ని విక్రయించి మైత్రిని అమెరికాలో పైలట్‌ ట్రైనింగ్‌ కోర్సులో చేర్పించారు. పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌ను మైత్రి కేవలం పన్నెండు నెలల్లోనే పూర్తిచేసింది. చాలామంది పద్దెనిమిది నెలలు పూర్తయినా కూడా ట్రైనింగ్‌ను పూర్తిచేయలేరు. అటువంటిది ఆరునెలల ముందుగానే పైలట్‌ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి అమెరికా పైలట్‌ లైసెన్స్‌ను పొందింది మైత్రి. దీంతో ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్‌ పైలట్‌గా రికార్డు సృష్టించింది మైత్రి పటేల్‌. ఈ విషయం తెలిసిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆమెను అభినందించారు. 

ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది.. 
‘‘మైత్రి సూరత్‌లో, స్కైలైన్‌ ఏవియేషన్‌ ముంబైలో ఉంటుంది. ఒకపక్క చదువుకుంటూ, మరోపక్క పైలట్‌ శిక్షణ తీసుకోవడం కష్టం. అందుకే ఆమెకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. త్వరగా నేర్చుకునే అమ్మాయి కావడంతో... కరోనా సమయంలో కూడా పూర్తి సమయాన్ని కేటాయించి గ్రౌండ్‌ స్థాయి శిక్షణ పూర్తి చేసింది. అమెరికాలో 18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా కష్టపడే శిక్షణను, పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి దేశమంతా గర్వపడేలా చేసింది. ఇప్పుడు మైత్రి పటేల్‌ మహిళాభివృద్దికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఈమెను చూసి మరికొంతమంది పైలట్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని కెప్టెన్‌ మాణిక్‌ చెప్పారు.  

ప్రస్తుతం మైత్రి బోయింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి త్వరలోనే శిక్షణ తీసుకోడానికి సన్నాహకాలు చేసుకుంటోంది. ‘‘ప్రస్తుతం అమెరికా లైసెన్స్‌ వచ్చింది. త్వరలో దానిని ఇండియన్‌ లైసెన్స్‌గా మార్చుకుని ఎయిర్‌ లైన్స్‌లో పనిచేస్తాను. పైలట్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయపడతాను’’ అని మైత్రి చెబుతోంది. 19 ఏళ్ల వయసులో ఇంత గొప్ప విజయం సాధించిన మైత్రి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది.   

చదవండి: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్‌

మరిన్ని వార్తలు