పెళ్లినాటి కాఫీ

29 Jul, 2020 04:34 IST|Sakshi

ఇద్దరికీ మొక్కలు నాటడం ఇష్టం. పెళ్లయిన కొత్తలోనే...  ఇద్దరూ కలిసి కాఫీ మొక్కను నాటారు. ‘కాఫీ డే’ అని పేరు పెట్టారు. ఆ మొక్క మహా వృక్షమయింది. ఆరు దేశాలకు వేర్లను చాపుకుంది. అకస్మాత్తుగా అతడు.. చెట్టుపై నుంచి ఎగిరిపోయాడు. ఆమె ఒక్కటే మిగిలింది. ఆ వృక్షాన్ని మళ్లీ ఇప్పుడు..మొక్కలా పెంచబోతోంది! 

భర్తకు వారసత్వంగా వచ్చిన కాఫీ తోటలు ఉన్నాయి. మంగళూరులో సెయింట్‌ అలోయ్సియస్‌ కాలేజ్‌ నుంచి ఇకనమిక్స్‌లో పొందిన మాస్టర్స్‌ డిగ్రీ ఉంది. ఆర్థికంగా అంత సంపద, ఆర్థశాస్త్రంలో అంత తెలివి ఉన్న భర్త ఓ రోజు ‘‘కాఫీ షాప్‌ పెడదాం.. కాఫీ ఇరవై ఐదు రూపాయలకు అమ్మితే లాభాలే లాభాలు..’’ అన్నప్పుడు మాళవిక వెంటనే ‘నాట్‌ ఎ బ్రైట్‌ ఐడియా’ అనేశారు! ఆమెకు కూడా కొంచెం చదువుంది. బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేశారు. అయితే భర్త ఆలోచనను కాదన్నది ఆమె ఇంజినీరింగ్‌ కాదు. ఆమె కామన్‌ సెన్స్‌. (కాఫీ కింగ్ అదృశ్యం)

1990ల నాటి రోజులు అవి. కప్పు కాఫీ ఐదు రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఎంత మంచి కాఫీ అయినా ఇరవై ఐదు రూపాయలకు ఎవరు కొంటారు అని ఆమె పాయింట్‌. భార్య అలా అనగానే తన ఆలోచనను కొద్దిగా మార్చారు సిద్ధార్థ. ‘‘పోనీ, ఇంటర్నెట్‌ సర్ఫింగ్‌ కమ్‌ కాఫీ?’’ అన్నారు. మాళవికకు ఆ ఐడియా నచ్చింది. అప్పటికి కొన్నాళ్ల ముందే 1991లో వాళ్ల పెళ్లయింది. 1996లో వాళ్ల ఉమ్మడి ఐడియా ‘కఫే కాఫీ డే’ (సిసిడి) గా కళ్లముందుకు వచ్చింది. మొదట కాఫీ డే బెంగళూరులోని బ్రిగేడ్‌ రోడ్‌లో మొదలైంది.

గత ఏడాది జూలై 29న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునే నాటికి ఈ ఇరవై ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 243 పట్టణాలకు 1760 కాఫీ డేలు విస్తరించాయి. ఆస్ట్రియా, ఈజిప్ట్, చెక్‌ రిపబ్లిక్, మలేషియా, నేపాల్‌లలో కొన్ని బ్రాంచిలు ఉన్నాయి. అయితే సిద్ధార్థ మరణం తర్వాత ఈ ఏడాది జూన్‌ నాటికి దేశంలో 280 ‘కాఫీ డే లు’ మూతపడ్డాయి! కొన్ని అప్పులు మిగిలి ఉన్నాయి. 2,693 కోట్ల రూపాయల అప్పన్నది మాళవిక తీర్చలేనిదేమీ కాదు. ఇన్వెస్టర్లు, ఇన్‌కం టాక్స్‌ అధికారులు, వడ్డీలు, ఆడిటర్‌లకు సైతం లెక్కతేలని కొన్ని ఆర్థిక వ్యవహారాల బకాయీలు అవన్నీ. శనివారం మాళవిక తమ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.

‘‘అప్పులన్నీ తీర్చేస్తున్నాం. మునుపటిలా సంస్థను ముందుకు తీసుకెళదాం’’ అని సారాంశం. భర్త మరణం నుంచి తేరుకోడానికి సరిగ్గా ఏడాది పట్టింది మాళవికకు. ప్రస్తుతం ఆమె సిసిడి (కఫే కాఫీ డే)లో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. ప్రస్తుతం అనే కాదు, బెంగళూరులోని వారి చిన్న ప్రారంభ దుకాణం ఒక పెద్ద కంపెనీగా అవతరించిన నాటి నుంచీ ఆమె.. జీతం తీసుకోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలే. తమ కాఫీ డే ఎంటర్‌ ప్రైజస్‌ లిమిటెడ్‌ (సిడిఇఎల్‌) లో కొన్ని నిధులను ఇటు మళ్లించి కంపెనీని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నారు మాళవిక. సిడిఇఎల్‌ అనుబంధ సంస్థే కఫె కాఫీ డే. (కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా)

ఆరు దేశాలలో ఏడాదికి వందకోట్ల అరవై లక్షల కాఫీ కప్పులు అమ్మిన కాఫీ డే ఇప్పుడు రోజుకు సగటున పదిహేను వేల కప్పులు తక్కువగా అమ్ముతోంది. ఇది తాత్కాలికమైన క్షీణతేనని ఇప్పటికీ కాఫీ డే లపై కస్టమర్‌లకు ఉన్న ఆకర్షణే చెబుతోంది. ఇక మాళవికే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కనుక సమీప భవిష్యత్తులోనే ఆమె తన భర్తకు నివాళిగా సంస్థను మళ్లీ పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకెళ్లే అవకాశాలు నమ్మకంగా ఉన్నాయి. కస్టమర్‌లు ఎంతసేపైనా గడిపేందుకు అనువైన,ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండటంతో పాటు.. శాండ్‌విచ్, బర్గర్‌ల వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ లభించడం కూడా కాఫీ డే ప్రత్యేకతలు. బెంగళూరులో తొలి కాఫీ డే షాపు నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడి కిటికీల్లోంచి బయటికి చూస్తూ.. ఎవరెవరు తమ కాఫీ డేకు వస్తారో అంచనా వేయడం తమకొక ఆటగా ఉండేదని మాళవిక ఒక ఇంటర్వూ్యలో చెప్పారు.

అంతగా ఈ దంపతులకు కాఫీ డేతో అనుబంధం ఉంది. ఆ బంధాన్ని చెక్కు చెదరన్వికుండా బిజినెస్‌లో తల్లికి సాయం చేసేందుకు ఇద్దరు కొడుకులు ఇషాన్, అమర్త్యలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆమె తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం‌ కృష్ణ అండగా ఉన్నారు. సిద్ధార్థ, మాళవికలకు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. మొక్కలు నాటడం ఇష్టమైన వ్యాపకం. ఇద్దరూ కలిసి మూడు వేల వరకు చెట్ల మొక్కల్ని నాటి ఉంటారు. దగ్గర లేని ఆ జీవిత సహచరుడిS కోసం కాఫీ డే అనే మహా వృక్షాన్ని మళ్లీ ఒక మొక్కలా సంరక్షించబోతున్నారు మాళవిక. కాఫీ డే కి చైర్‌పర్సన్‌ అవడం, కాకపోవడంతో నిమిత్తం లేకుండానే. (వ్యాపారవేత్తగా విఫలమయ్యా... )
మాళవిక (గత ఏడాది భర్త అంత్యక్రియల సమయంలో)

మరిన్ని వార్తలు