టీనేజ్‌ సంచలనం.. టిక్‌ టాక్‌ ఎటాక్‌

4 May, 2021 07:36 IST|Sakshi

పదిహేడేళ్ల మలేసియా విద్యార్థిని హస్నీజా టిక్‌ టాక్‌ చేసిన వీడియో ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపివేస్తోంది! స్కూల్‌ తరగతి గదిలో లైంగిక విజ్ఞానాన్ని బోధించే పురుష ఉపాధ్యాయుడొకరు ‘రేప్‌’ను ఒక జోక్‌లా చెప్పడం నచ్చని హస్నీజా ఆ విషయాన్ని టిక్‌టాక్‌ చేసి అప్‌లోడ్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అయి, విద్యాశాఖ ఆ ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించింది. రేప్‌ను హాస్యం చేయడంపై అక్కడి ‘ఆల్‌ ఉమెన్స్‌ యాక్షన్‌ సొసైటీ’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ‘కుదుపు’ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పట్లో ఆగిపోయేలానూ లేదు.

‘‘స్కూల్లో నిన్న నాకు ఎదురైన అనుభవం ఇది! ప్లీజ్, తరగతి గదుల్ని మాకు సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు సహాయం చేయండి’’.. అని టిక్‌ టాక్‌లో వీడియోలో విజ్ఞప్తి చేస్తున్నప్పుడు హస్నీజా ఆవేదన చూడాల్సిందే. ఏమిటి ఆమెకు ఎదురైన అనుభవం?  


రేప్‌ మీద వాళ్ల క్లాస్‌ టీచర్‌ జోక్‌ చేశాడు! ఆరోజు ఆయన బోధిస్తున్నది లైంగిక విజ్ఞాన శాస్త్రంలోని శారీరక ధర్మాల అధ్యాయం. ఇక అది మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి కూర్చొనే తరగతి గది. పాఠం చెబుతూ మధ్యలో జోక్స్‌ వేసి నవ్విస్తున్నాడు ఆయన. ఆ నవ్వించడంలో రేప్‌ను కూడా జోక్‌ చేసేశాడు. మగపిల్లలు నవ్వారు. ఆడపిల్లలు నవ్వలేదు. వయసొస్తోంది కదా, జోక్‌ లోని అంతరార్థం గ్రహించి తలలు వంచుకున్నారు. ఒక సామాజిక సమస్యపై ఆయన అలా హాస్యం ఆడటం హస్నీజాకు నచ్చలేదు.

ఆయన అలా ఎందుకు అనకూడదో, అంటే ఆడపిల్లలకు ఎంత హాని జరుగుతుందో చెబుతూ టిక్‌ టాక్‌ని అప్‌లోడ్‌ చేసింది. కొన్ని గంటల్లోనే ఆ వీడియోను పదిలక్షల 40 వేల మంది చూశారు. ఆ స్పందన చూసి హస్నీజా వెంటనే ‘మేక్‌ స్కూల్‌ ఎ సేఫర్‌ ప్లేస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని క్రియేట్‌ చేసింది. మరుక్షణమే అది ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీవీల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై డిబేట్‌లు మొదలయ్యాయి. స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులు, ౖలñ ంగిక హింస.. ఆలోచనాపరుల హాట్‌ టాపిక్‌ అయ్యాయి. టాపిక్‌  హాట్‌ అని కాదు. ఆగ్రహావేశాల చర్చలు, ప్రసంగాలు మొదలయ్యాయి. మహిళా సంఘాల్లో కదలిక రావడంతో ప్రభుత్వం ఆ టీచర్‌పై విచారణకు ఆదేశించింది. అయితే హస్నీజా పరిస్థితి ఎలా అయిందో చూడండి.
∙∙
స్కూల్‌లో హస్నీజా సీనియర్‌ విద్యార్థి ఆమెను దగ్గరికి పిలిచి, ‘‘రేప్‌ చేస్తాను జాగ్రత్త’’ అని బెదిరించాడు. టీచర్‌ మీద టిక్‌ టాక్‌ చేసినందుకే అతడికి అంత కోపం! ‘‘లేదు, అమ్మాయిలే కాదు, అబ్బాయిలకూ స్కూల్‌లో రక్షణ ఉండాలి. రేప్‌ కల్చర్‌ని జోక్‌ చేయడం వల్ల ఇద్దరికీ ప్రమాదమేనని నేను చెప్పదలచుకున్నాను’’ అని హస్నీజా వివరణ ఇస్తుంటే టీచర్లు, స్టూడెంట్స్‌ వినిపించుకోవడం లేదు. ‘‘స్కూల్‌కి నువ్వు వేసుకొచ్చే బట్టలు ఎలా ఉంటాయో తెలుసా!’’ అని కొందరు ఆమె వస్త్రధారణ మీద పడ్డారు. హెడ్‌మాస్టర్‌ ఆమెను పిలిపించి, ‘‘ఏంటమ్మా... ఇది! నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు.

మన స్కూల్‌కి ఎంత చెడ్డ పేరో!’’ అని మందలించారు. హస్నీజా ఇవేవీ ఊహించలేదు. అలాగని తను చేసిన పని తొందరపాటేమోనన్న భావనా లేదు. తను సరైన పనే చేశానని ఆమె బలంగా నమ్ముతోంది. అలా చెయ్యకపోతేనే తప్పు అయి ఉండేదని కూడా అంటోంది. హస్నీజాను ఎవరు ఏమన్నా, ఆమె తల్లిదండ్రులు మాత్రం మద్దతుగా ఉన్నారు. ‘‘తన జీవితం, తన అభిప్రాయాలు’’ అని అండగా నిలబడ్డారు. ‘‘ఈరోజు నా కూతురు ప్రశ్నించింది కనుక రేపు నా మిగతా కూతుళ్లకు ఇలాంటి అనుభవం ఎదురవదు’’ అని హస్నీజా తల్లి నోర్షానిజా అంటున్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. హస్నీజా పెద్దమ్మాయి. హస్నీజా టిక్‌ టాక్‌ ను ఆధారంగా చేసుకుని మలేషియా మహిళా సంక్షేమ శాఖ.. రేప్‌ జోకులు, ఆడవాళ్లపై కామెంట్లు, బాడీ–షేమింగ్‌ల మీద గట్టి చర్యలు తీసుకోవాలని హోమ్‌ శాఖకు సిఫారసు చేసింది.
హస్నీజా మలేషియాలోని కౌలా సెలంగార్‌ స్కూల్లో చదువుతోంది. సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తుంటుంది. సమాజంలో మార్పును కోరుకుంటూ టిక్‌టాక్‌లు చేస్తుంటుంది.
 
అమ్మానాన్నతో హస్నీజా
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు