సాహితీ ప్రయాణం వెనక కథ

19 Oct, 2020 00:53 IST|Sakshi

ఎందుకు రాశానంటే? 

నా మొదటి కథ 1970 ఆగస్టులో చందమామ మాసపత్రికలో ప్రచురించారు. దాని పేరు ఉపాయశీలి. 2020 ఆగస్టుకి నా మొదటి కథ ప్రచురించబడి యాభై ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా నా సాహితీ ప్రయాణం గురించి వివరించిన పుస్తకమే నవల వెనక కథ. ఇందులో నేను రాసిన 106 నవలల కథలు పరిచయం చేస్తూ, ప్రతీ నవలకి నాకు క్రియేటివ్‌ ఫ్లాష్, అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా డెవలప్‌ చేసుకున్నాను? ఎంత కాలానికి అది నవలగా రాశాను? ఏ పత్రికలో సీరియలైజ్‌ అయింది, లేక డైరెక్ట్‌ నవలా? సినిమా లేదా టీవీ సీరియల్‌ లేదా వెబ్‌  సిరీస్‌గా తీస్తే ఆ అనుభవాలు, అమ్మకాలు, కోర్టు కేసులు మొదలైన వివరాలన్నీ ఇందులో ఇచ్చాను. అలాగే ప్రతి నవలకి వేసిన తెలుగు, కన్నడ కవర్‌ పేజీల బొమ్మలని కూడా చూడొచ్చు. పాఠకులకి ఇవి పాత జ్ఞాపకాలను ఇస్తాయి. ‘ముక్తాయింపు’లో  రచయితగా నా గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను రాశాను.

‘అనుబంధం’ అనే రెండో భాగంలో 1960లో నేను చదివిన మొదటి నవల నుంచి 2020 దాకా– ఈ అరవై ఏళ్లలో తెలుగు నవలకి పాఠకులిచ్చిన ఆదరణ, అమ్మకాల వివరాలని ‘లేచి పడ్డ తెలుగు నవల’ అనే పెద్ద వ్యాసంలో పాఠకులు విహంగవీక్షణం చేయొచ్చు. ఇంకా ఇందులో 1972 నుంచి నేటి దాకా నేను వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, నా ప్రచురణకర్తల మీద పెన్‌ స్కెచ్‌లు, (నా సంపాదకులతో నా అనుభవాల గురించి ‘జరిగిన కథ’ అనే పుస్తకంలో రాశాను) నేను రాసిన దిన వార పక్ష మాస పత్రికల జాబితా, సినిమాల పేర్లు, విడుదల వివరాలు, టీవీ సీరియల్స్‌ వివరాలు, నేను రాసిన వందకు పైగా నవలేతర పుస్తకాల క్లుప్త పరిచయం, వాటి కవర్‌ పేజీలు, స్రవంతి వారపత్రిక ఎడిటర్‌గా నా అనుభవాలు, తమాషా స్టాటిస్టిక్స్, చివరగా మే 2020లో ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ మిస్టరీ మేగజైన్‌కి పంపిన ఓ ఇంగ్లిష్‌ క్రైమ్‌ కథని చదవొచ్చు . 760 పేజీల ఈ హార్డ్‌బౌండ్‌ పుస్తకం, తెలుగు నవలా పాఠకులకి, సాహిత్య అభిమానులకు చాలా కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈ యాభై ఏళ్లలో నేను చేసిన రచనా వ్యాసంగాన్ని నవల వెనక కథలో పరిపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. సెప్టెంబర్‌ 2020 దాకా రోజూ మరే పని పెట్టుకోకుండా, రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు రాస్తూ, ప్రూఫ్‌ రీడింగ్‌ చేస్తూ, గడిపాను. మర్చిపోయినవి కొందరు మిత్రులకి ఫోన్‌ చేసి తెలుసుకున్నాను. ఈ వారమే పుస్తకం విడుదల అవుతోంది.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

నవల వెనక కథ 
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి; 
పేజీలు: 760; వెల: 600; 
ప్రతులకు: గోదావరి ప్రచురణలు, 
ఫోన్‌: 9553084268

మరిన్ని వార్తలు