చనిపోయిన యువతి పేరుతో రాంగ్‌ మెసేజ్‌

27 Dec, 2020 12:08 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేత కిరణాలు ఒంటికి తాకితే ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది. నోట్లో వేసుకున్న టూత్‌ బ్రష్‌ వేసుకొని..  మరో చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకుని డాబాపై అటూ ఇటూ తిరుగుతున్నాను. మెసేజ్‌ వచ్చినట్టు అలర్ట్‌ టోన్‌ మోగితే చూసుకున్నాను. ఆశ్చర్యం వేసింది. మరో వైపు ఆనందం. చిన్నపాటి గొడవతో విడిపోయిన నళిని ‘ఎలా వున్నారు?’ అంటూ మెసేజ్‌ చేసింది. ఇక నా సంతోషం అవధులు దాటింది. ‘బాగున్నాను, నువ్వెలా వున్నావ్‌?’ అంటూ రిప్లై ఇచ్చాను. తిరిగి సమాధానం రాకపోయినా.. చాలా రోజుల తర్వాత నళిని నన్ను అర్థం చేసుకుందన్న సంబరంలో మునిగిపోయాను. 

ఈ విషయం వెంటనే స్నేహితుడు రాకేష్‌కి  చెప్పాలి. ఎందుకంటే మేమిద్దరం దూరంగా వుంటూ ఒకరినొకరం ఇష్టపడుతుంటే మమ్మల్ని కలిపింది వాడే. ఏదో చిన్న మాటతో నోరు జారిన కారణంగా దూరంగా వుండిపోయింది నళిని. ఆ రోజు నుండి ఇద్దరం కలవడం లేదు. దీపావళి వచ్చినంత వెలుగొచ్చింది నా ముఖంలో.  ఇక ఆలస్యం చేయలేదు చకచకా రెడీ ఐపోయి రాకేశ్‌ దగ్గరకు పరుగులు పెట్టాను. తోటలో చెట్లకు నీళ్ళు పడుతున్నాడు రాకేశ్‌. వాడి చేతిలోని నీటి పైపు లాగేసి, పక్కకు తీసుకువెళ్లి మెసేజ్‌ చూపించాను.  వాడు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. 
‘ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారన్నమాట. సంతోషకరమైన వార్త తెచ్చావ్‌.  నాకేమిస్తావ్‌?’ అని అడిగాడు రాకేశ్‌.
 ‘ఏం కావాలన్నా ఇస్తా.. అడుగు’ అన్నాను.
 ‘పార్టీ చేసుకుందాం.. చాలా రోజులైంది కదా! ఇన్నాళ్లూ  బాధలో వున్నాం అది తీరిపోయింది. ఏమంటావ్‌?’ అన్నాడు రాకేశ్‌.
 ‘అంతేకదా..! నళిని మళ్ళీ నాతో మాట్లాడింది అంటే ఇంతకన్నా ఏం కావాలి? నీకు తెలుసుగా ఆమెను ఒక్కరోజు కూడా వదిలి వుండేవాణ్ణి కాదు. పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అయ్యాను. తను హఠాత్తుగా దూరం అయ్యేసరికి ఇన్నాళ్లూ మనసు మనసులో లేదు. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఫుల్‌ పార్టీ చేసుకుందాం’ రెట్టింపు ఆనందంతో అన్నాను. 
 ‘ఓకే డన్‌’ అన్నాడు రాకేశ్‌. 

ఆరోజు ఒక మోస్తరుగా వర్షం పడుతోంది. లంచ్‌ పార్టీయే పెట్టుకుందామని రాకేశ్‌ అనేసరికి ఆ రోజు డిసైడ్‌ చేసుకున్నాం. వాడిని డైరెక్ట్‌గా వెన్యూ దగ్గరకే రమ్మన్నాను. 
కాని వాడు ‘కలిసే వెళ్దాంలే.. రెడీగా ఉండు.. పికప్‌ చేసుకుంటా’ అన్నాడు.  
గొడుగు పట్టుకుని వసారాలోకి వచ్చి ఆగిపోయాను ‘ఇంత వర్షంలో ఎక్కడికిరా’ అన్న నాన్న మాటతో. ఆ ప్రశ్న నా కాళ్ళకు అడ్డం పడింది.
అంతలోపే మళ్లీ మెసేజ్‌ టోన్‌... ఆత్రుతగా ఫోన్‌ తీసి చూసుకున్నాను.
 ‘ఈవాళ సాయంత్రం టెంపుల్‌ దగ్గరకు వస్తున్నాను అక్కడ కలుద్దాం బై’ అంటూ నళిని పెట్టిన మెసేజ్‌. అంతే... నాన్న మాటను పట్టించుకోకుండా చకచకా బయటికి వచ్చానో లేదో రాకేశ్‌ కారు ఆగింది మా ఇంటి ముందు. ఎక్కి కూర్చున్నాను. అంతకు ముందే వచ్చిన నళిని మెసేజ్‌  సంగతి చెప్పాను వాడితో.
‘ఓహో.. ఈరోజు డబుల్‌ ధమాకా అన్నమాట. ఇక్కడ పార్టీ అక్కడ మీటింగ్‌’ అన్నాడు. 
 ‘నా బాధలో, సంతోషంలో భాగం పంచుకునే నీలాంటి ఫ్రెండ్‌ దొరికినందుకు హ్యాపీగా వుందిరా’ అప్రయత్నంగా నా కళ్లు చెమ్మగిల్లాయి. 

అది బెంగళూరు బైపాస్‌ రోడ్డు పక్కనే ఉన్న  హోటల్‌. 
 పార్కింగ్‌లాట్‌లో కారు పార్క్‌ చేసి నేరుగా  హోటల్‌ లోపలికెళ్ళి కూర్చున్నాం. 
 నేను చికెన్, మందు రెండింటిని వద్దనుకొని.. రోటి స్పెషల్‌ ఆర్డర్‌ పెట్టాను.
 ‘ నువ్వు నాతో పాటు తిని తాగకపోతే.. నాకు కిక్కేముంటుంది చెప్పు’ అంటూ అసహనం వ్యక్తపరిచాడు రాకేశ్‌.
 ‘వద్దురా.. నళిని టెంపుల్‌కు రమ్మంది. చికెన్‌ తిని వెళ్లలేను. అసలే  ఒక మిస్‌ అండర్‌స్టాండ్‌ తర్వాత కలవబోతున్నాను తనను.. తాగి కలవలేనురా...’ అంటూ వాడికి సర్ది చెప్పాను. 
మా సీటింగ్‌కి ఎదురుగా గోడ గడియారం ఉంది. అప్పుడప్పుడూ దానికేసి చూస్తూ  కాలాన్ని లెక్కిస్తున్నాను. రెండు గంటలు దాటిపోయింది.. రాకేశ్‌ నింపాదిగా వున్నాడు. బిల్లు చెల్లించి బయటకు వచ్చేశాం.  

నళినిని కలవాల్సిన టైమ్‌కి ఇంకో గంట  మాత్రమే ఉండటంతో కారు వేగంగా పోనిస్తున్నాడు రాకేశ్‌.  నళిని చెప్పిన టెంపుల్‌ రానేవచ్చింది. అక్కడ  నన్ను దింపేసి ‘ బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ ‘ చెప్పి  వెళ్ళిపోయాడు రాకేశ్, టెంపుల్‌ ఆవరణలో ఉన్న ఒక చిన్న అరుగు మీద  కూర్చుని నళిని కోసం ఎదురు చూడసాగాను. 
నన్ను అయిదింటికల్లా రమ్మన్న నళిని అయిదుంపావు అయినా తాను రాలేదు. పొద్దున మెసేజ్‌ వచ్చిన నంబర్‌ కు కాల్‌ చేశాను స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. 
‘ఎక్కడ వున్నావు నళినీ?’ అని మెసేజ్‌ పంపాను. ఉహూ.. రిప్లయ్‌ లేదు. 
ఆరు గంటలు దాటి చీకటి ఆవరిస్తోంది. చాలా సార్లు కాల్‌ చేసాను.. స్విచ్‌ ఆఫ్‌ అనే వస్తోంది తన ఫోన్‌.  
 అరుగు మీద నుంచి లేచి ఇంటి ముఖం పట్టాను నిరాశగా. 

ఆరోజు బయట వసారాలో కూర్చున్నా.. నళిని ఆలోచనలు చుట్టుముట్టాయి.  
‘వస్తానని ఎందుకు రాలేదు.. నళిని ఎందుకిలా చేసింది?’  ఇద్దరం సఖ్యంగా ఉన్న రోజుల్లో... చెప్పిన సమయం కంటే పది నిమిషాలు ముందే వచ్చేది.  నేను ఆలస్యమైతే గొడవ పడేది. మరి ఇప్పుడెందుకు నన్ను రమ్మని చెప్పి తను రాలేదు.. పైగా  సెల్‌ ఫోన్‌ ఆఫ్‌ చేసింది?’ అని అనుకుంటూండగా  తలపై ఎవరో తడిమినట్టు అనిపిస్తే తల ఎత్తి చూశాను.
 చేతిలో చిల్లర పట్టుకుని నన్నే గమనిస్తోన్న అమ్మ..
 ‘ఈమధ్య నీ తల పూర్తిగా పాడైనట్టుంది పక్కన పిడుగు పడినా కదిలే పరిస్థితిలో లేవు ఏమైందిరా?’ అడిగింది.
  ‘నాకేం బాగానే వున్నాను’  అన్నాను చాలా క్యాజువల్‌గా. 
 ‘సర్లే.. ఇదిగో ఈ చిల్లర పట్టుకెళ్ళి పాల పాకెట్‌ పట్టుకురా. తొందరగా వచ్చెయ్‌ మీ నాన్న ఆఫీసుకెళ్ళాలి’ అంటూ నన్ను తరిమింది. 
పాలడైరీ దగ్గరకు వెళుతుంటే మెసేజ్‌ రింగ్‌ టోన్‌ వినిపించే సరికి చప్పున ఆగిపోయి జేబులోంచి ఫోన్‌  తీసి చూసాను.
 ‘సారీ.. బంగారు మొన్న నేను రాలేకపోయాను. ఇప్పుడు కాలేజీ దగ్గరకు రాగలవా?’ నళిని మెసేజ్‌.
 క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజ్‌ దగ్గరకు పరుగు పెట్టాను. అక్కడ నళిని కనిపించలేదు, గ్రౌండ్‌ మొత్తం వెతికా.. ప్రయోజనం లేదు. అదే నంబర్‌కు మళ్లీ  కాల్‌ చేస్తే.. స్విచ్‌ ఆఫ్‌.  నళిని ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదు, ఇంటి దగ్గర నుండి ఫోన్‌. గుండె గుభేలుమంది. పాలు తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళాను, అమ్మ గురాయించి చూసింది. పాలు ఆలస్యం అయినందుకు నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయారట.
‘వస్తానంటుంది రాదు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ ఉంటుంది. నళిని నాతో ఎందుకిలా ఆడుకుంటోందో అర్థం కావట్లేదురా’ రాకేశ్‌తో  నా బాధను చెప్పుకున్నాను. ఏం చెప్పాలో వాడికీ అర్థం కానట్టుంది. అందుకే వాడు మౌనంగా వుండిపోయాడు. 
మరోసారి.. షాపింగ్‌ మాల్‌కు రమ్మని మెసేజ్‌ చేసింది.ఈసారి ఒక్కణ్ణే వెళ్ళకుండా రాకేష్‌ని కూడా వెంట తీసుకెళ్ళాను. షాపింగ్‌ మాల్‌ మొత్తం జల్లెడ పట్టాం నళిని కనిపించలేదు. ఇద్దరి సెల్‌ఫోన్ల నుంచి కాల్‌ చేశాం. ఫోన్‌ పని చేయడం లేదు, మెసేజ్‌ మాత్రం వస్తోంది. వెంటనే కాల్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. 
‘ఏంటీ మాయ?’ జుట్టు పీక్కున్నంత పనైంది మాకు. తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయాం.

ఆ రాత్రి నిద్రపోలేదు.. సెల్‌ ఫోన్‌ పక్కనే పెట్టుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక మెసేజ్‌ వచ్చింది.
‘నువ్వు చాలా ఫీలయ్యావని నాకు తెలుసు.. నిన్ను కలవాలని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది.. అమ్మకు ఆరోగ్యం నిలకడగా లేదు హాస్పిటల్‌లో వున్నాం. అర్జెంట్‌గా పదివేలు కావాలి. సర్దగలవా ప్లీజ్‌.. నా అకౌంట్‌ నంబర్‌ పంపిస్తా.. ప్లీజ్‌..’ అంటూ మెసేజ్‌  పెట్టింది.
 ‘ఏ హాస్పిటల్‌’ అని వెంటనే నేనూ మెసేజ్‌ పెట్టాను. తిరిగి జవాబు రాలేదు. 
’ ఇప్పటికిప్పుడు పదివేలు అంటే ఎలా ?’ అనే ఆలోచనతోనే ఆ  రాత్రి గడిచిపోయింది. 
 తెల్లవారగానే తెలిసిన వాళ్ల నుంచి పదివేలు అప్పు తీసుకుని రాకేశ్‌ దగ్గరకు వెళ్లా..  విషయం చెప్పా. 
 ‘అయ్యో పాపం! ఇలాంటప్పుడే ఆదుకోవాలిరా..  అప్పుడే నీది నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది.. పదా వెళ్దాం’ అంటూ నన్ను బయలుదేరదీశాడు రాకేశ్‌. 
బ్యాంక్‌కి వెళ్ళి నళిని ఖాతాలో డబ్బు జమ చేశాను. 
అంతే మళ్లీ  వారం దాకా ఆమె నుంచి మెజేస్‌ రాలేదు. 
తర్వాత ఎప్పుడో ఒకరోజు మెసేజ్‌ వచ్చింది.. ‘పార్క్‌లో నీకోసం వెయిటింగ్‌’ అంటూ.  
పరుగులు పెట్టి వెళితే పార్క్‌ గేట్‌కు తాళం కనిపించింది. నళిని కనిపించలేదు.
విసిగిపోయి ఇంటికి వచ్చేశాను. 
మేమిద్దరం స్నేహంగా ఉన్న రోజుల్లో నళిని తన ఇంటి చిరునామా కార్డ్‌ ఇచ్చినట్టు గుర్తు. అప్పుడు వెళ్ళలేక పోయాను. ఇప్పుడు ఆ కార్డ్‌ ఎక్కడుందో? పాత పుస్తకాలన్నీ తిరగేసాను. దొరికింది. ఆలస్యం చేయకుండా బయలుదేరాను.

ఆ ఇంటి ముందు ఒక పెద్దాయన వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెళ్ళి పలకరించాను.
 ‘ఎవరు కావాలి బాబూ?’ అడిగాడతను,
 ‘నళినిగారు వున్నారాండి?’ అడిగాను. 
 ఆ  మాటకు అతను కుర్చీలోంచి లేచి ఇంట్లోకి నడిచాడు. వెనకే నేను. 
‘అదిగో బాబూ..  నా మనుమరాలు నళిని..’ అంటూ గోడ వైపు చూపించాడు.
 అంతే..  నా కాళ్ల  కింద భూమి కంపించినట్టు.. ఆకాశం విరిగి నెత్తిన పడినట్టు స్థాణువైపోయా.  
     పూలదండ వేలాడుతూ నళిని ఫొటో. 
 ‘చాలా రోజులైంది బాబూ..’ కళ్ల నిండా నీళ్లు. గొంతు జీరబోతుండగా  చెప్పాడు అతను. 
  ఎవరో హత్య చేశారంట.. ఆనవాళ్ళు కూడా దొరక్కుండా. 
నాకు వస్తున్న మెసేజ్‌ల గురించి అతనితో చెప్పాను. బ్యాంకులో వేసిన డబ్బు సంగతి సహా.
విస్తుపోయాడు అతను. మొత్తానికి ఏదో జరుగుతోంది. 

నళిని కుటుంబసభ్యులతో కలిసి ఎంక్వయిరీ దిశగా అడుగులు వేశాను. ఆమె అకౌంట్‌ డీటైల్స్‌ తీసుకున్నాం. గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన లావాదేవీలు నేను వేసిన పదివేలుతో మొదలైనట్టు తెలిసింది. అదే బ్యాంక్‌  ఏటీఎమ్‌లో డబ్బు అయినట్టూ తేలింది. విత్‌ డ్రా ఫాంలో వున్న సమయాన్ని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్‌ను గమనిస్తే..  అరవై ఏళ్ళు నిండిన పెద్దాయన ఆ డబ్బు డ్రా చేసినట్టు కనిపిస్తోంది. 
నిద్రాహారాలు ఎగిరిపోయాయి నాకు. ఎవరు అతను? ఈ మిస్టరీని రాకేశ్‌తో షేర్‌ చేసుకుందామనుకుంటే సమయానికి వాడు అందుబాటులో లేడు. 
కొంత సస్పెన్స్‌ అనుభవించాక మొత్తానికి డబ్బు డ్రా చేసిన పెద్దాయన దొరికాడు. 
 ‘అతనెవరో తెలీదు బాబు.. డబ్బు డ్రా చేసుకురా.. నీకు ఐదు వందలు ఇస్తానని, కార్డు, పిన్‌ నంబర్‌ ఇచ్చాడు. ఏటీఎంలో డబ్బు తీసి అతని చేతిలో పెట్టాను’  చెప్పాడు ఆ పెద్దాయన. 
 ‘అతను ఎక్కడ వుంటాడో తెలుసా?’అడిగాను.
 ‘రండి .. చూపిస్తా’ అంటూ ఊరికి దూరంగా వున్న ఓ బంగ్లా వైపు తీసుకెళ్ళాడు అతను.
అక్కడ కొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. 
 ‘అదిగో ఆ గళ్ళ చొక్కా వేసుకున్నాడే.. అతనే’ అని చూపించాడు ఆ పెద్దాయన.
కళ్లు తిరిగినంత పనైంది నాకు. 
  ఎవరో కాదు వాడు రాకేశే... నమ్మలేక పోయా.  
పోలీసులకు కంప్లయింట్‌ ఇవ్వడంతో గుట్టు మొత్తం బయట పడింది. 
 నళిని నన్ను ప్రేమించడాన్ని వాడు జీర్ణించుకోలేకపోయాడు. తన కోరిక తీర్చమని నళిని వెంట పడ్డాడు. ఆమె వినకపోవడంతో ఓ పథకం ప్రకారం.. సాక్ష్యం దొరకనివ్వకుండా నళినిని చంపేశాడు.  
కూతురే పోయాక .. పోలీసులు, కేసులు ఎందుకని మిన్నకున్నారు నళిని తల్లిదండ్రులు. 
వాళ్ల నిస్సహాయతను రాకేశ్‌ ఆసరాగా తీసుకొని నళిని సెల్‌ఫోన్‌ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకున్నాడు ఇన్నాళ్లూ. నా శ్రేయోభిలాషిగా నటిస్తూ నాకే ద్రోహం తలపెట్టాడు రాకేశ్‌. తట్టుకోలేకపోయా. వాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.. కాని వాడు నళిని తల్లిదండ్రులకు, నాకు మిగిల్చిన శోకం మాత్రం తీరేది కాదు.  
‘ స్నేహం చేస్తే గుడ్డిగా నమ్మకూడద’ని మా అమ్మమ్మ అంటుండేది.. ఆ మాట నా కళ్లు తెరిపించింది.
- నరెద్దుల రాజారెడ్డి

మరిన్ని వార్తలు