మంచి మాట: వర్తమానమే జీవితం

9 Jan, 2023 00:23 IST|Sakshi

మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా.  

‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్‌ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్‌ టోల్‌ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం.

ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు.

దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి.

‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది.

గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి.

‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు.
గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి.
 

వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు.

– శ్రీకాంత్‌ జయంతి

మరిన్ని వార్తలు