‘నాతో మాట్లడకపోతే నీ ఫోటోలు పోర్న్‌ సైట్‌లో పెడతాను’

29 Jul, 2021 07:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సైబర్‌ క్రైమ్‌: స్నేహతులే శత్రువులా?!

మనం విన్నదంతా వాస్తవం అనలేం. మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారందరూ మంచి వాళ్లే అని చెప్పలేం. ప్రియ (పేరు మార్చడమైనది) విషయంలో అదే జరిగింది. స్నేహితులతో సరదాగా ఉంటుంది. చదువులో నెంబర్‌ వన్‌. అందంలో మిస్‌ కాలేజ్‌. చదివేది ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌. అమ్మానాన్నలకు గారాల కూతురు. ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రియ ఆరు నెలలుగా శూన్యం ఆవరించినట్టుగా ఉంది. చదువులో వెనకబడిపోయింది. సరైన తిండి, నిద్రకు దూరమై పేషెంట్‌లా తయారైంది. స్నేహితులను కూడా కలవట్లేదు. తన గది దాటి బయటకు రావడం లేదు.

మానసిక సమస్యేమో అని తల్లిదండ్రులు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దామంటే రానంటుంది. తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానంటోంది. ప్రియ వాళ్ల పెద్దమ్మ కూతురు రాగిణి అమెరికా నుండి వచ్చి, తిరిగి వెళ్లే ముందు పిన్నిబాబాయిలను కలవడానికని వచ్చింది. విషయం తెలిసిన రాగిణి రెండు రోజులు ప్రియ వాళ్లంట్లోనే ఉంది. ప్రియతోనే ఉంటూ మాటలు కలిపింది. అసలు విషయం తెలిసి షాక్‌ అయ్యింది. 

నిమిషం కూడా విడవనంటూ..
యుఎస్‌ నుంచి అదే పనిగా ప్రియ వాట్సప్‌కి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో నిమిషం ఆలస్యమైనా కంగారు పడుతుంది ప్రియ. ‘ఆర్నెల్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ అయిన వ్యక్తి, నా గురించి అన్నీ తెలిసినట్టుగా చెబుతుంటే ఆసక్తిగా అనిపించి, చాట్‌ కొనసాగించాను. అక్కణ్ణుంచి మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఫోన్లు, చాటింగ్‌ అంతా బాగానే ఉంది. నమ్మకం కుదిరింది. ఫొటోలు కూడా షేర్‌ చేసుకున్నాం. ‘చాటింగ్, ఫోన్లతో చదవడమే కుదరడం లేదు మానేద్దాం’ అన్నాను. అప్పటి నుంచి నా ఫొటోలు పోర్న్‌సైట్‌లో పెట్టేస్తానని’ బెదిరిస్తున్నాడు అని ప్రియ తెలిపింది.

‘మంచి ఫ్రెండ్‌ అని నమ్మితే ఇలా మోసం చేశాడు. నా అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఎప్పుడు ఫోన్‌ చేసినా మాట్లాడాలి. లేదంటే, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు అందరికీ షేర్‌ చేసి, నా పరువు, కుటుంబపరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. అందువల్లే కాలేజీ మొహం చూడటం లేదు. అమ్మానాన్నలకు ఈ విషయం తెలిస్తే వాళ్లు బతకరు. నాకు చనిపోవాలని ఉందం’టూ రాగిణికి చెప్పి ఇన్నాళ్లూ దిగమింగుకున్న బాధను ఏడుస్తూ చెప్పింది ప్రియ. భయపడకుండా తను చెప్పినట్టుగా వినమని సైబర్‌క్రైమ్‌కు పిర్యాదు చేసింది రాగిణి. 

స్నేహితురాలే అడ్డంకి..
ప్రియ అన్నింటా ముందుండటం తట్టుకోలేని స్నేహితురాలు సుజి ఇదంతా చేసిందని తెలిసి అందరూ షాక్‌ అయ్యారు. అమెరికా వెళ్లొచ్చిన స్నేహితుడు అక్కడి విశేషాలు చెబుతూ వాడిన యుఎస్‌ సిమ్‌ గురించి కూడా చెప్పాడు. ఆ నెంబర్‌తో ఆన్లైన్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసిన సుజి కొత్త గేమ్‌ ఆడటం మొదలు పెట్టింది. కొన్నాళ్లు ఆ కొత్త నెంబర్‌తో యాక్టివేట్‌ అయిన అకౌంట్‌ నుంచి ప్రియతో చాటింగ్‌ చేయడం మొదలుపెట్టింది. తన స్నేహితుడి సాయంతో రోజూ కొన్ని గంటల పాటు ప్రియను మాటల్లో పెట్టించి, ఇంటి గడప దాటకుండా చేసింది. ఆ తర్వాత కొత్త బెదిరింపులకు పాల్పడింది. ప్రియతో చాటింగ్‌ చేస్తున్న అకౌంట్‌ ద్వారా నెంబర్‌ కనుక్కున్న నిపుణులు అమెరికా నుంచి వచ్చిన యువకుడిని అరెస్ట్‌ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.   
 

ఏదో రకంగా ఇతర దేశాల సిమ్‌లను ఉపయోగిస్తూ వంచనకు పాల్పడేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్‌ లేదా సంస్థ అధికారిక ప్రతినిధిగా నటిస్తారు. ముందుగా URLను తనిఖీ చేయాలి. వారి అకౌంట్‌ ఎప్పుడు ఓపెన్‌ చేశారు, ఆ పేరు లేదా నెంబర్‌తో గతంలో మరికొన్ని అకౌంట్‌ లు ఉన్నాయోమో చూడాలి. ఫ్రాడ్‌ అకౌంటైతే తక్కువ ఫాలోవర్లు, అతి తక్కువ పోస్టులు ఉంటాయి. సంక్లిష్ట పదాలతో పాస్‌వర్డ్‌ మారుస్తూ ఉండాలి. ప్రొఫైల్‌ లాక్‌ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌ల పై క్లిక్‌ చేయకూడదు. తెలిసిన వ్యక్తులతో మాత్రమే సంభాషణ కొనసాగించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా ఉంటామో ఆన్‌లైన్‌లోనూ అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

తెలిసినవారే అయ్యుంటారా?! 
నిధి రజ్దాన్‌ ఓ ప్రఖ్యాత టీవీ ఛానెల్‌లో జర్నలిస్ట్‌. ఆర్నెల్ల క్రితం తను భారీగా మోసపోయిన విధానం గురించి చెబుతూ, ఇది ఎవరికైనా ఓ పాఠంలా ఉపయోగపడితే చాలు అంది. ‘హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధించడానికి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరడానికి 21 ఏళ్ల తర్వాత నేను పని చేస్తున్న సంస్థను వీడి వెళ్తున్నాను అని ట్విట్టర్‌లో ప్రకటించాను. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని నేను నిజంగా నమ్మాను. హార్వర్డ్‌ యూనివర్శిటీలో చేరడానికి నా బ్యాంక్‌ ఖాతా, వ్యక్తిగత డేటా, ఇమెయిల్, మెడికల్‌ రికార్డులు, పాస్‌పోర్ట్, నా కంప్యూటర్, ఫోన్‌ వంటి పరికరాలు యాక్సెస్‌ చేయడానికి జరిగిన అధునిక ఫిషింగ్‌ దాడిలో ఇదంతా భాగం అని 8 నెలల తర్వాత తెలిసింది.

ఆఫర్‌ లెటర్, అగ్రిమెంట్‌తో అధికారిక హార్వర్డ్‌ ఈమెయిల్‌ ఐడి నుంచి నాకు మెయిల్‌ వచ్చింది. విశ్వవిద్యాలయ లోగోతో ఉన్న లెటర్‌హెడ్, పదవులు పొందిన సీనియర్‌ అధికారులందరి సంతకాలు ఉన్నాయి. నేను పనిచేసే యజమానులకు సిఫారసు లేఖ కూడా పంపారు. అన్నీ పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని మానేశాను. హార్వర్డ్‌ వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి అర్థమైంది నా డబ్బు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేయడానికి ఇంతా జరిగిందని. పోలీసులకు అన్ని పత్రాలతో ఫిర్యాదు చేశాను’ అంటూ వివరించారు. ఇదంతా చూస్తుంటే తెలిసిన వాళ్లే ఆమెను ఉద్యోగం నుంచి తప్పించడానికే చేశారేమో?! అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

వెరిఫికేషన్‌ ముఖ్యం
మోసపోయాక కళ్లు తెరవడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. అసూయతో సన్నిహితం గా ఉండే వారు కూడా మనల్ని మోసం చేయవచ్చు. నిత్యం మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసేవారూ ఉంటారు. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే విచక్షణ ముఖ్యం. డబ్బు కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా వెనకాడనివారుంటారు. మన చదువుకు, వృత్తికి, అభిరుచికి తగిన లింక్స్‌ ఆకట్టుకునే విధంగా మెయిల్స్‌కు వస్తుంటాయి. కొత్తగా వచ్చిన మెయిల్‌ URL పూర్తిగా వెరిఫై చేసుకున్నాక గానీ ఆ లింక్‌ ఓపెన్‌ చేయకూడదు. మన పూర్తి డేటా ఇవ్వకూడదు. ఎక్కడైనా అనుమానం వస్తే సైబర్‌ నిపుణుల సాయం తీసుకోవడం మేలు చేస్తుంది. – జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌

మరిన్ని వార్తలు