ఎవర్‌గ్రీన్‌ ఫార్మర్‌!

18 Jan, 2021 00:38 IST|Sakshi

రసాయనాల జోలికి వెళ్ళకుండా ప్రకృతి సాగు 

20 సెంట్లలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు

బుట్ట నెత్తికెత్తుకొని కాలినడకన ఊళ్లోనే విక్రయం

75 ఏళ్ల వయసులోనూ ఒంటరి 

మహిళా రైతు స్వతంత్ర జీవనం 

ప్రకృతి వ్యవసాయం వైపు పయనించేలా యువ రైతులను ఒప్పించడమే సులువు, పెద్దలకు నచ్చజెప్పటం కష్టం అనే అభిప్రాయం ఒకటుంది. అయితే, ఒంటరి మహిళా రైతు తిరుపతమ్మ అనుభవం అందుకు భిన్నమైనది. అలవాటు లేని ప్రకృతి వ్యవసాయాన్ని ముదిమి వయసులో కూడా శ్రద్ధగా నేర్చుకొని, అనుసరిస్తున్నారు. స్వతంత్రంగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారామె.  

మానికల తిరుపతమ్మ వయస్సు 75 ఏళ్లు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని ముసునూరు ఆమె ఊరు. ఇంటికి దగ్గరల్లోనే తనకున్న 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారామె. గతంలో భర్తతో కలిసి రసాయనిక వ్యవసాయం చేసుకుంటూ, తీరిక రోజుల్లో కూలి పనులకు వెళ్లేవారు. ముగ్గురు అబ్బాయిలకు పెళ్లిళ్లయ్యాయి. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మూడేళ్ల క్రితం భర్త కూడా చనిపోవడంతో ఆమె ఒంటరిగా తమ సొంత పూరింటిలో నివాసం ఉంటోంది. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరిపైనా ఆధారపడకూడదని, తనను తాను పోషించుకోవాలన్నది ఆమె పట్టుదల. ఆ పట్టుదలే పెట్టుబడిగా ప్రకృతి వ్యవసాయం వైపు ఆర్నెల్ల క్రితం అడుగులేసింది. 

ప్రకృతి సాగు దిశగా..
రైతుగా ఆమె ఉత్సుకతను గుర్తించిన ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిబ్బంది సాగులో మెలకువలను చెప్పడమే కాదు.. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వంగ, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, బీర, టమోటా, మునగ, పచ్చి మిర్చి, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర విత్తనాలను కూడా ఆమెకు ఉచితంగా ఇచ్చారు. ఘన, జీవామృతాలు ఎలా తయారు చేయాలో శిక్షణనిచ్చారు.  ఈ కూరగాయ విత్తనాలతో పాటు  బొప్పాయి, జామ, మామిడి, అరటి మొక్కలను కూడా నాటింది. ఆర్నెల్ల క్రితం సాగులో మెలకువలను అంది పుచ్చుకొని ప్రకృతి సాగు చేస్తోంది.

కోడి కూయక ముందే నిద్ర లేస్తుంది తిరుపతమ్మ. అప్పటి నుంచి రాత్రి వరకు ఆ తోటే ఆమె లోకం. అన్ని పనులూ తానే చేసుకుంటుంది. ఆవు మూత్రాన్ని లీటరు రూ. 5కు కొనుకొని పొరుగు రైతుల దగ్గరి ఆవుల నుంచి పేడ తెచ్చుకొని జీవామృతం, ఘనజీవామృతం తానే తయారు చేసుకొని వాడుకుంటుంది. పంచాయితీ వారి కుళాయి నీటినే తొట్టెలోకి పట్టి పెట్టుకొని పంటలకు పోస్తుంది. 

వృద్ధాప్యంలో కూడా మనోనిబ్బరంతో ఒంటరిగా ప్రకృతి వ్యవసాయం చేయడమే కాదు పంటను మారు బేరానికి అమ్మకుండా నేరుగా తానే వినియోగదారులకు అమ్ముకొని జీవిస్తుండటం తిరుపతమ్మ ప్రత్యేకత. కూరగాయలు, ఆకుకూరలను కోసి గంపకెత్తుకొని సాయంత్రం 4 గంటలకల్లా కాలినడకన ఊళ్లోకి బయల్దేరుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట కావటంతో తిరుపతమ్మ కూరగాయల కోసం గృహిణులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఆకుకూరల పెద్ద కట్ట రూ. 10. బీర, మిరప కిలో రూ. 40. వంగ, టమాటో, కాకర కిలో రూ. 30. ఇతర కూరగాయలు రూ. 20. సరసమైన ధరలకే అమ్ముతుండటంతో గంటలోనే గంప ఖాళీ అవుతుంటుంది. ఇలా రోజూ దాదాపు రూ.250ల వరకు ఆదాయం ఆర్జిస్తుండటం విశేషం. అమృతాహారాన్ని ప్రజలకందిస్తూ వృద్ధాప్యంలోనూ ఆదర్శప్రాయంగా స్వతంత్ర జీవనం సాగిస్తున్న మహిళా రైతు తిరుపతమ్మకు జేజేలు!  

– పంపాన వరప్రసాద్, 
సాక్షి, అమరావతి

ఎవరిమీదా ఆధారపడకూడదనే..
భర్త చనిపోయాడు. కొడుకుల దగ్గరకు వెళ్లడానికి మనసు రాలేదు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు చేతనైన ఏదో ఒక పని చేయాలనిపించింది. ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని కూరగాయలు పండిస్తున్నా. అధికారులు చెప్పినట్టు ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నా. అంతే.. మంచి పంట పండుతోంది.. లాభం వస్తోంది. 
– మనికల తిరుపతమ్మ, ముసునూరు, నూజివీడు

ఆమె ఉత్సుకత చూసి ప్రోత్సహించాం
75 ఏళ్ల వయస్సులో ఆమెలో ఉత్సుకతను చూసి ప్రకృతి సాగు వైపు ప్రోత్సహించాం. సాగులో మెలకువలను అందిపుచ్చుకొని.. సుదీర్ఘ అనుభవం కలిగిన రైతులను తలదన్నేలా శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
– విజయకుమారి, డీపీఎం, ఏపీసీఎన్‌ఎఫ్, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు