భారతీయ వంటకాలతో అదరహో అనిపిస్తున్న జపాన్‌ కుర్రాళ్లు! ఏకంగా రెస్టారెంట్‌నే..

31 Oct, 2023 09:12 IST|Sakshi

జపాన్‌ వాసులు ఆహారాన్ని చేతితో తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారు మన భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నారంటే నమ్ముతారా!. వెంటనే జోక్‌ చేస్తున్నారా..!అని కచ్చితంగా అంటాం. కానీ ఇది నిజం. నమ్మశక్యంగా లేకపోయిన నమ్మకతప్పని నిజం. ఆ రెస్టారెంట్‌లో ఎక్కువ కస్టమర్లు కూడా జపాన్‌ వాసులు కావడం విశేషం.

భారతీయులు ముఖ్యంగా విదేశాలకు వెళ్తే భారతీయ వంటకాలను కూడా పట్టకెళ్తారు. కనీసం ఊరు నుంచి ఎవ్వరైనా విదేశాలకు వస్తున్నారని తెలిసినా.. వెంటనే వారిని సంప్రదించి మనకు కావల్సినవి తెప్పించేసుకుంటాం. అదృష్టం కొద్దీ..మన దేశం నుంచి వచ్చి విదేశాల్లో సెటిల్‌ అయినవాళ్లు ఎవరైనా.. ఇండియన్‌ రెస్టారెంట్‌ పెట్టుకుంటే..హమ్మయ్యా మనోడిది అంటూ లొట్టలేసుకుంటూ తినేందుకు ఆ రెస్టారెంట్‌లో వాలిపోతాం. కానీ జపాన్‌లోని తడ్కా అనే ప్రాంతంలో క్యోటోలో ఈ కిక్‌ ఎ  అనే సౌత్‌ ఇండియన్‌ రెస్టారెట్‌ ఉంది.

ఐతే దీన్ని మన భారతీయులు నిర్వహిస్తున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని ఇద్దరు జపాన్‌ కుర్రాళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు ఇష్టంగాతినే ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర వంటకాలన్నీ భారత చెఫ్‌లకు తీసుపోనీ విధంగా రుచికరంగా అందిస్తున్నారు. వాస్తవానికి జపాన్‌ వాసులు ఆహారాన్ని చాప్‌ స్టిక్‌లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషమంటే..? మనలానే అక్కడ జపాన్‌ ప్రజలు మన వంటకాలను చేతితో తినడం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కసారిగా వాళ్లు కూడా మన సంస్కృతిని ఫాలో అవుతున్నారా? అని షాకింగ్‌ అనిపిస్తుంది. అంతేగాదు ఈ రెస్టారెంట్‌కి మన భారతీయుల కంటే చైనా కస్టర్లే ఎక్కువగా వస్తారు.

అందుకు సంబంధించిన విషయాన్ని గోవా ముఖ్యమంత్రికి మాజీ పాలసీ సలహదారు ప్రసన్న కార్తీక్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఆయన అందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్న జపాన్‌ కుర్రాళ్లు ప్రతి ఏడాది చెన్నై వెళ్లి అక్కడ దోస, ఇడ్లీ తయారీ విధానాన్ని నేర్చుకుని వస్తుంటారని పోస్ట్‌లో పేర్కొన్నారు కార్తీక్‌.

పైగా చెన్నై వెళ్లిన ప్రతిసారి  తిరువనమలై దేవాలయాన్ని సందర్శించడమే గాక భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి కొద్దిసేపు ధ్యానం చేసి వస్తుంటారని చెప్పుకొచ్చాడు. అంతేగాదు మన ఇండియన్‌ రెస్టారెంట్‌ల మాదిరిగా కాంప్లిమెంటరీ కాఫీని సైతం ఆ జపాన్‌ కుర్రాళ్లు అందించినట్లు వెల్లడించారు. ఈ కుర్రాళ్లిద్దరూ జపాన్‌ స్థాయిని ఒక్కసారిగా పెంచేశారంటూ ట్విట్టర్‌లో ప్రశంసలతో ముంచెత్తాడు. 

మరిన్ని వార్తలు