Mansukh Mandaviya: తండ్రికి తగ్గ కూతురు

2 May, 2021 11:22 IST|Sakshi
మన్సుఖ్‌ మండవియ, దిశ

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో కూతుర్ని పైలట్‌గా చూసిన తల్లిదండ్రుల హృదయం ఉప్పొంగడం సహజమే. పైలట్‌ అనే ఏముందీ.. దేశ భద్రత కోసం ఆర్మీ యూనిఫామ్‌లో బయల్దేరిన కూతుర్ని, దేశ రక్షణకు సముద్రంపై గస్తీకి నేవీ కెప్టెన్‌గా విధుల్లో చేరబోతున్న కూతుర్ని చూసినప్పుడు ఎంతో గర్వపడతారు. ఇప్పుడదే గర్వాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్‌ మండవియ వ్యక్తం చేస్తున్నారు! ‘‘నా కూతురు, నా ప్రతిష్ట.. మా అమ్మాయి దిశ.. నేను ఏమవ్వాలని ఇంతకాలం ఎదురు చూశానో అదే అయింది’’ అంటూ ట్విట్టర్‌లో తన కూతురి ఫొటో పోస్ట్‌ చేశారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్‌ పేషెంట్‌లకు సేవలు అందించడం కోసం కొద్దిరోజుల క్రితమే ఆమె ట్రైనీగా చేరింది. అప్పటిదే ఆ ఫొటో. 

మన్సుఖ్‌ మండవియ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి. రాజ్యసభ సభ్యులు. కరోనాతో దేశం ఎంత కుదేలైపోతున్నదీ కళ్లారా చూస్తూనే ఉండి ఉంటారు. అందుకే కూతురు వైద్యలు సేవలు అందించడానికి ట్రైనీగా చేరగానే ఆయనకెంతో గర్వంగా అనిపించింది. ‘నా కూతురు కరోనా యోధురాలు’ అయింది అని ఎంతో సంతోషంగా ట్వీట్‌ చేశారు ఆయన. ‘‘ఈ కీలకమైన సమయంలో దేశానికి నీ సేవలు అవసరం దిశా. నువ్వు చేయగలవు. ఒక యోధురాలిగా నువ్వు చేస్తున్న పని నాకెంతో శక్తినిస్తోంది’’ అని అభినందించారు. ఆ అభినందనలో సగానికి  పైగా ఉన్నది కృతజ్ఞతే! ఒక సాధారణ పౌరుడిగా ఈ మంత్రిగారు తన కూతురికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం కూడా ఇది. ఆయన అలా ట్వీట్‌ పెట్టిన వెంటనే ఇలా 18 వేల లైక్‌లు వచ్చాయి. జై బంగాల్‌ అనే పేరు మీద ఉన్న యూజర్‌ ఒకరు ‘‘డాటర్స్‌ ఆర్‌ ది బెస్ట్‌’’ అని ట్వీట్‌ చేశారు. మరొక యూజర్‌.. ‘‘యుద్ధ సమయంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంత ఒత్తిడితో పని చేస్తుంటారో ఇప్పుడూ అలానే చేస్తున్నారు. సాహసవంతులైన కరోనా యోధులందరికీ సెల్యూట్‌’’ అని స్పందించారు.

ఇంత చిన్నవయసులో అంత సేవాభావం దిశకు తన తండ్రి నుంచే సంక్రమించి ఉండాలి. మన్సుఖ్‌ లక్ష్మీబాయి మండవియ నిరాడంబరమైన మనిషి. పార్లమెంటు సమావేశాలకు ఎప్పుడూ ఆయన సైకిల్‌ మీదే వెళ్లొస్తుంటారు! ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం కోసం తరచు మైళ్ల దూరం గ్రామాల గుండా పాదయాత్రలు చేస్తుంటారు. ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’ కార్యక్రమంలో మంత్రిలా కాక ఒక కార్యకర్తలా పాల్గొంటారు. మహిళల రుతుక్రమ పరిశుభ్రత కోసం ఆయన నిర్వహించిన అవగాహన సదస్సులు యునిసెఫ్‌ గుర్తింపు పొందాయి. కేంద్ర మంత్రులలో తెలివైన, ఆలోచనాపరుడైన నాయకులలో ఒకరిగా ఆయనకు పేరు. ‘అభివృద్ధి ని నిరంతరంగా కొనసాగించడానికి అవసరమైన 2030 నాటి అజెండా’ అనే అంశంపై ప్రసంగించేందుకు 2015లో మండవియ ప్రత్యేక ఆహ్వానంపై ఐక్యరాజ్య సమితికి వెళ్లి వచ్చారు.

మండవియకు దిశ తర్వాత పవన్‌ అనే కుమారుడు ఉన్నాడు. భార్య నీతాబెన్‌ గృహిణి. 1995లో వాళ్ల వివాహం జరిగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా పలితాన తాలూకాలోని హనోల్‌ అనే గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు మండవియ. నలుగురు మగపిల్లల్లో చివరివాడు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. సంగధ్‌ గురుకులంలో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. మంత్రి అయినప్పటికీ ఆయన ఎప్పటిలానే సాధారణంగా జీవిస్తున్నారు. మంత్రి కూతురు అయినప్పటికీ దిశ తండ్రి బాటలోనే నలుగురికి సహాయం చేసేందుకు వైద్యసేవల్ని ఎంచుకుంది. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు