ఏడడుగుల బంధం

27 Dec, 2020 14:20 IST|Sakshi

వివాహ సంస్కారం

మనకు శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. ఏడు అడుగులు కలిసి నడిస్తే సఖ్యత సిద్ధిస్తుంది–అని. అందుకే వివాహంలో సప్తపది చేస్తారు. ప్రారంభంలోనే ఒక మాట అంటారు. మనిద్దరం ఏడడుగులు వేస్తున్నాం సఖీ–అని పిలుస్తాడు. ‘‘ఓ నెచ్చెలీ! మనిద్దరం ఒకరికొకరం జీవితంలో కలిసి నడుద్దాం. ఇదిగో నా చేయి పట్టుకో’’.. అని తాను  ముందుండి భార్యను నడిపించాల్సిన వాడు కాబట్టి ఆయన ముందు నడుస్తాడు. ఆయన వెంట ఆమె నడుస్తుంది.

వయసులో కొద్దిగా పెద్దవాడిని భర్తగా తెస్తారు. అనుభవం ఉన్నవాడు, పరిణతి ఉన్నవాడు కాబట్టి నడిపించగలిగినవాడై ఉంటాడు. కాబట్టి ఆయన చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆమె నడుస్తుంది. ఏడడుగులు వేస్తూ మంత్రాలు చెబుతారు. ఒక్కొక్క మంత్రం చెబుతూ ఒక్కొక్కటి కోరుతారు. మొదటి అడుగు చేత ‘అన్నం సమృద్ధిగా లభించుగాక’తో మొదలుబెట్టి వరుసగా బలం లభించుగాక, కర్మ లభించుగాక, కర్మ వలన సౌఖ్యాలు లభించుగాక, యజ్ఞం చేసెదము గాక, రుతు సంబంధమైన సుఖాలన్నిటినీ అనుభవించెదము గాక, పశుసమృద్ధిని పొందెదము గాక...అని ఏడు రకాలయిన సమృద్ధులను కోరుతూ జీవితంలో ప్రస్థానం చేసి కలిసి మెలిసి అన్ని సుఖాలు అనుభవించి చిట్టచివరకు – ఈ సుఖాలు కూడా సుఖాలేనా అన్న వైరాగ్యాన్ని పొంది భగవంతుని పరిపూర్ణ అనుగ్రహానికి నోచుకోవాలి.హోమప్రక్రియలో భర్త .. ఎన్నడూ నీవు జుట్టు విరబోసుకుని, రొమ్ము బాదుకుంటూ ఏడవవలసిన పరిస్థితి కలుగకుండుగాక! నీవు సంతోషంతో పదిమంది బిడ్డలను కనెదవు గాక! నేను నీకు 11వ కుమారుడిగా అగుదును గాక’’ అంటాడు. 

ఎందుకు 11వ కుమారుడు అవడం? పదిమంది పిల్లల్ని కనీపెంచీ పెద్దచేసీ ఆమె అనుభవాన్ని పొందుతుంది. ఇంతమందిని వృద్ధిలోకి తెచ్చిన–ఆయన మాటను పిల్లలు వినకపోతే పక్కకు వెళ్ళి అలిగి కూర్చుంటాడు. అప్పుడు పిల్లలు –‘‘నాన్నగారు కోపం వచ్చి కూర్చున్నారు. చెబితే వినరు. ఇంకా ఎందుకు మీకీ తాపత్రయం? మేం పెద్దవాళ్ళమయ్యాం కదా.. నాన్నగారూ...’’ అని వాళ్ళు నాన్నగారితో మాట్లాడడానికి భయపడి పక్కకు వెడతారు. నువ్వు కూడా అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోకేం. చిన్నతనంలో పిల్లలు మారాం చేస్తే వారిని బుజ్జగించినట్లు నన్ను కూడా బుజ్జగించు. నన్ను 11వ కుమారుని చేసుకో. నీవు నాకు శాంతి స్థానంగా ఉండు’’ అని అడుగుతాడు భర్త.

వివాహక్రతువులో స్త్రీపురుషుల మధ్య, వధూవరుల మధ్య అటువంటి పరిణతి కల్పించి దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువుల సమాహారమే వివాహం. అటువంటి వివాహ వ్యవస్థను ఆదరించి, గౌరవించి ఆ మంత్రాలకు అర్థం తెలుసుకోవాలి... మంత్రభాగం మీద, శాస్త్రం మీద, క్రతువు మీద, పెద్దల మీద గౌరవాన్ని ఉంచి వివాహం చేసుకుంటే అది అభ్యున్నతికి కారణమవుతుంది. అటువంటి వైవాహిక వ్యవస్థ వైభవం ఈ దేశంలో మరింత ద్విగుణీకృతంగా ప్రకాశించాలని ఆ పరమేశ్వరుని పాదాలను పట్టి ప్రార్థన చేస్తున్నా.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు