ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!

18 Feb, 2021 06:31 IST|Sakshi
తనయ లతీఫా–తండ్రి మొహమ్మద్‌ రషీద్‌

షేఖా లతీఫా

మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్‌ రషీద్‌. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్‌ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్‌’ అంటోంది!

‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్‌ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్‌లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్‌’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్‌ గాడ్‌’ అని కూడా. ‘ఓ మై గాడ్‌’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్‌లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు.

ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్‌లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్‌ గాడ్‌’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్‌ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్‌లో ఆమె బాత్రూమ్‌లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్‌ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్‌. ఆ దుబాయ్‌ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్‌ రషీద్‌. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్‌ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్‌సన్‌ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్‌ క్లిప్‌తో పాటు, ఐర్లాండ్‌ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్‌.హ్యూమన్‌ రైట్స్‌ మాజీ హై కమిషనర్‌ అయిన రాబిన్‌సన్‌ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్‌సన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
∙∙
‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్‌లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్‌ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్‌ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్‌ రషీద్‌కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్‌ అంటే ఆమెకు ప్రాణమని!
∙∙
లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్‌ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్‌ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్‌ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్‌ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించడం వెనుక భారత్‌ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్‌ మిషెల్‌ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్‌ను అప్పగించాలని భారత్‌ కోరుతున్నా స్పందించని దుబాయ్‌ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్‌ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి.  

ఘటనల కాలక్రమం
రాకుమారి ‘ఎస్కేప్‌’కి ముందు, తర్వాత
► జూన్‌–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు.

► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్‌పోర్ట్‌ రాకుండా, డ్రైవింగ్‌ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది.

► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్‌ ఇన్‌ కేస్‌’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్‌ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు.

► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్‌ఫ్లేటబుల్‌ బోట్‌ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్‌ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్‌ సిద్ధంగా ఉంచిన అమెరికన్‌ యాట్‌లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది.

► 5 డిసెంబర్‌ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్‌ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

► 24 డిసెంబర్‌ 2018 : యు.ఎన్‌. మానవ హక్కుల కమిషనర్‌ మేరీ రాబిన్‌సన్‌ కలిసి డిసెంబర్‌ 15న లంచ్‌ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు!

► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్‌సన్‌.. ‘లతీఫా నాతో కలిసి లంచ్‌ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్‌ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు.

స్కై డైవింగ్‌ ప్రాణం, చిన్న పిల్ల మనసు


బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్‌లో లతీఫా


మేరీ రాబిన్‌సన్‌తో లతీఫా లంచ్‌

మరిన్ని వార్తలు