పెళ్లి సందడి..

27 Nov, 2020 09:15 IST|Sakshi

ఊపందుకున్న వివాహాది శుభకార్యాలు

జనవరి వరకు శుభముహూర్తాలు

నేడు పెద్ద ఎత్తున జరగనున్న వివాహాలు

పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్ల జీవితం.. ఇది పెళ్లంటే. కరోనా నేపథ్యంలో ఏడు నెలలుగా ఇలాంటి వేడుకల ఊసే లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. రంగురంగుల విద్యుత్‌ దీపాల అలంకరణలు.. సన్నాయి మేళాల చప్పుళ్లు.. ఆత్మీయుల సందడి... అనుబంధాల కలయికతో పాటు కళ్యాణ వేదికలకు కొత్త కళవచ్చింది. ఏదీ ఏమైనా ఇన్నాళ్లు ముహూర్తాలు లేక కరోనా కారణంగా వాయిదా పడిన వివాహాలు, ఇతర శుభకార్యాలకు మోక్షం లభించింది. జనవరి మొదటి వారం ముగిసిందంటే ఉగాది వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే అన్నీ చకచకా జరిగేలా చూసుకుంటున్నారు. నవంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మొదటి వారం వరకూ మంచి రోజులు ఉండడంతో శుభకార్యాలు షురూ అయ్యాయి. ఇక వ్యాపార వర్గాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది.

మొదలైన ముహూర్తాలు..
ప్రస్తుతం వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో వివాహాది, శుభకార్యాల పనులు ఊపందుకోనున్నాయి. మొన్నటి వరకు చాలా పెళ్లిళ్లు జరగగా నేడు శుక్రవారం మరోసారి భారీగా వివాహ వేడుకలు జరగనున్నాయి. గతంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనలతో ఎలాంటి సడలింపులు లేకపోవడంతో వాయిదా పడిన పలు శుభకార్యాలు ఇప్పుడు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

శుభకార్యాలకు వేళాయె..
కరోనా ప్రభావంతో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆగిపోయాయి. గత వేసవి కాలంలో అంటే మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో మంచి ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసుకున్నారు. ఫంక్షన్‌ హాళ్లకు అడ్వాన్స్‌లు ఇవ్వడంతో పాటు పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించి చివరి సమయంలో శుభకార్యాలు నిలిపి వేసిన ఘటనలు సైతం ఉన్నాయి. లాక్‌డౌన్‌లో అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం కష్టంగా ఉండటం, కోవిడ్‌ నిబంధనలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేయడమే మేలుగా భావించి పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేశారు. 

మార్కెట్‌లో కళకళ..
శుభకార్యాలు మొదలు కావడంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు సంబంధించి ఆధార పడిన వారంతా వచ్చే ఆర్డర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెండ్లి మండపాలకు డిమాండ్‌ పెరుగగా ఇప్పటికే అన్నీ బుకింగ్‌లు అయ్యాయి. పురోహితులు బిజీ అయ్యారు. ముఖ్యంగా వస్త్ర, బంగారు వ్యాపారాలకు గిరాకీ పెరగడంతో దుకాణాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి. పెళ్లి కార్డులు, ఫ్లెక్సీల పనులు ఇతర వివాహాది శుభకార్యాల పనుల్లో మునిగిపోయారు. 

జనవరి ఎనిమిది వరకు..
వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో మూడు, నాలుగు మాసాల పాటు శుభముహూర్తాలు లేవు. ఈ ఏడాది కరోనా వైరస్‌తో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. వేసవి కాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు కార్తీక మాసంలో చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, నూతన గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుపుకునేలా అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సందడితో పూర్వ వైభవం రానుంది.                                                  – -సువర్ణం సంతోశ్‌శర్మ, వేదపండితులు, మంచిర్యాల  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా