Maternity Photoshoot: ట్రెండ్‌.. ప్రెగ్నెన్సీకి గ్లామర్‌ .. ఫొటోషూట్‌కు అదే అనువైన సమయం!

18 Feb, 2022 00:37 IST|Sakshi

అమ్మ అవడం అనే వరాన్ని ముందస్తుగా పదిలం చేసుకోవాలనే ఆరాటం ఇటీవల సోషల్‌ మీడియా పోస్టుల్లో విరివిగా కనిపిస్తోంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడనే సూచనను నలుగురికి తెలియజేయాలనే తపనతో పాటు, గర్భంతో ఉన్న అందమైన ఫొటోలను సంతోషంగా షేర్‌ చేస్తున్నారు. వెండితెర, బుల్లితెర నటీమణులు కూడా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు.

గర్భం అనేది స్త్రీకి జీవితంలో ఒక ప్రత్యేక దశ. తల్లిగా మారే ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఆనందాన్ని నింపుతుంది. ఇటీవల నటి కాజల్‌ అగర్వాల్, శ్వేతా అగర్వాల్‌ల బేబీ బంప్‌ ఫొటోలు నెట్టింట బాగా వైరల్‌ అయ్యాయి. వారిలాగే  ఫొటో షూట్స్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెటర్నిటీ ఫొటోషూట్‌ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలనుకునే ట్రెండ్‌ జోరందుకుంది.

కాలేజీ, ఉద్యోగం, పెళ్లిరోజులను ఎంజాయ్‌ చేయడం ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా ప్రెగ్నెన్సీని పండగలా జరుపుకోవడం నేటి రోజుల్లో అతి ముఖ్యమని ఈ ఫొటోలు చూపుతున్నాయి. ఈ ఫొటోషూట్స్‌ కోసం ఫొటోగ్రాఫర్లు తమ స్టూడియోలను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. విభిన్న రకాల డ్రెస్‌ డిజైన్లనూ గర్భవతుల కోసం రూపొందిస్తున్నారు.

అనువైన సమయం
‘బేబీ బంప్‌ ఫొటో షూట్‌కి ఏడు–ఎనిమిది నెలల సమయం అనువైనది’ అంటున్నారు హైదరాబాద్‌లో బేబీ, ప్రెగ్నెన్సీ ఫొటోగ్రాఫర్‌గా పేరొందిన మనోజ్ఞ. ‘ఈ సమయంలో పొట్టభాగం బాగా కనిపిస్తుంది. పసిపిల్లలను ఫొటోషూట్‌ చేయడం కన్నా ఇది త్వరగా పూర్తవుతుంది కాబట్టి గర్భవతులకు అలసట ఏమీ ఉండదు. డ్రెస్‌ కలర్స్, డిజైన్స్‌ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఒక కలర్‌ థీమ్‌తో అన్ని సైజుల డ్రెస్సులను డిజైన్‌ చేసి ఉంచుతాను. ఇందుకు విదేశీ డిజైనర్స్‌తోనూ చర్చలు జరుపుతాను’ అంటారీమె.

ఎందుకు పెరుగుతోంది అంటే..
‘కాబోయే తల్లితండ్రులు తమ జీవితంలోకి అడుగిడబోయే కొత్త అతిథిని విభిన్న రకాలుగా ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతుంటారు. కొందరు తమ చేతులపై పసిపాప మెహెందీ డిజైన్‌ చేయించుకొని, ఆ ఫొటోను పోస్ట్‌ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని పంచుకుంటారు. తమ ప్రెగ్నెన్సీ వార్తలను రకరకాలుగా షేర్‌ చేయడం లాగే మెటర్నిటీ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు’ అంటారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించి తమ స్టూడియోని ప్రెగ్నెన్సీ షూట్‌కి అనువుగా మార్చుకున్నామని చెబుతున్నారు.

థీమ్‌లకు పెరిగిన డిమాండ్‌

కాన్సెప్ట్‌ షూట్, బ్యాక్‌డ్రాప్‌ మొత్తం సాదాగా ఉండేలా, ఒంటరిగా దిగే సొలో థీమ్, బోహో థీమ్, డ్రేప్‌ షాట్‌.. వంటి థీమ్స్‌ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి అంటున్నారు ఫొటోషూట్స్‌ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఫొటో షూట్‌ల సమయంలో హెయిర్‌ స్టైల్, మేకప్, డ్రెస్‌ వరకూ ప్రతి దానికీ తమ ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఫొటోషూట్‌ ఖర్చు కూడా ప్రొడక్షన్‌ హౌజ్, థీమ్, అందులో ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ ఫొటో షూట్‌ విషయంలో ఖర్చుకు వెనకాడటం లేదన్నది వాస్తవం.

ఫ్లయింగ్‌ డ్రెస్‌ స్టైల్‌లో..
ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వీలుపడనివారు ఈ ప్రెగ్నెన్సీ షూట్‌ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రసవం తర్వాత కంటే గర్భంతో ఉన్నప్పుడు జంటగా ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలావరకు బ్రైట్‌ కలర్స్, ఫ్లయింగ్‌ డ్రెస్‌ స్టైల్‌కి మొగ్గు చూపుతున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కి 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఔట్‌డోర్‌ అయితే గర్భిణులు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది.

అదే, స్టూడియోలో అయితే విశ్రాంతి తీసుకుంటూ ఫొటోషూట్‌ పూర్తి చేయవచ్చు. దానికి తగిన విధంగా స్టూడియో థీమ్‌ ఉంటుంది. శారీస్‌తోనూ ఫొటోషూట్‌ చేస్తాం. కానీ, సీమంతం సమయంలో తీసే ఫొటోలతో గర్భిణులు సంతృప్తిపడతారు. అందుకే చాలా వరకు వెస్ట్రన్‌వేర్‌లో కనిపించాలనుకుంటారు. లాంగ్‌ ఫ్లయింగ్‌ స్టైల్‌ ప్లెయిన్‌ గౌన్లను బాగా ఇష్టపడుతున్నారు.
– మనోజ్ఞారెడ్డి, ఫొటోగ్రాఫర్‌ అండ్‌ స్టైలిస్ట్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు